Bandi Sanjya Vs Gangula :  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం పక్కా పథకం ప్రకారం జరిగినదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం నుండే విధ్వంస కుట్ర జరిగిందని ఆరోపించారు. ఈ విధ్వంసం వెనుక సీఎం స్ట్రాటజిస్టు పథక రచన ఉందన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రాష్ట్ర పోలీసులే కాల్పులు జరిపారని... అయినా కేంద్రాన్ని బదనాం చేయడం సిగ్గు చేటని విమర్శింారు. పోలీసుల కాల్పుల్లో మంత్రి చెందిన రాకేశ్ అంతిమ యాత్ర పేరుతో ఈరోజు వరంగల్  జిల్లాలో టీఆర్ఎస్ నేతలు విధ్వంసం సృష్టించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేస్తుండటం దుర్మార్గమన్నారు. ఆర్మీ అభ్యర్థులతోపాటు ప్రజలంతా వాస్తవాలు గమనించి కుట్రలను చేధించాలని కోరారు. కరీంనగర్‌లో జరగిన కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు.


అల్లర్ల వెనుక స్ట్రాటజిస్ట్ కుట్ర ఉందన్న బండి సండి సంజయ్
 
అగ్నిపథ్ ఒక గొప్ప పథకం... 17.5 సంవత్సరాల నుండి 23 ఏళ్ల వయసున్న యువకులను ఆర్మీలో చేర్చుకునేందుకు అగ్నిపథ్ స్కీంను ప్రవేశపెట్టారు. గతంలో వెయ్యి మంది దరఖాస్తు చేసుకుంటే కొద్ది మందిని మాత్రమే సెలెక్ట్ చేసేవాళ్లు. కానీ ఇకపైమ దరఖాస్తు చేసుకున్న వారందరినీ దాదాపు  అగ్నివీరులుగా గుర్తించి 6 నెలల పాటు శిక్షణ ఇస్తారని బండి సంజయ్ తెలిపారు.  ఇంత గొప్ప స్కీం అగ్నిపథ్.. నిరుద్యోగిగా ఉంటే ఏం వస్తది? ఆర్మీలో పనిచేస్తే గౌరవం, దేశభక్తి పెరుగుతుంది. అగ్నిపథ్ లాంటి పథకాలు చాలా దేశాల్లో అమలు చేస్తున్నారు. ఈ పథకంపై ఏమైనా అనుమానాలు, అపోహలుంటే నివ్రుత్తి చేసుకోవాలే తప్ప విధ్వంసాలు పాల్పడమేంది? అని ప్రశ్నించారు. 


ఆందోళనల వెనుక టీఆర్ఎస్ హస్తం 


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్నారని .. వారి వెనుక నుండి ఎవరో రాళ్లు రువ్వి విధ్వంసం స్రుష్టించారు. అత్యంత పటిష్టంగా ఉన్న సికింద్రాబాద్ కాంపౌండ్ వాల్ ను కూల్చేశారు. పెట్రోల్ బాటిళ్లు, రాళ్లు, రాడ్లతో వచ్చారంటే అదెలా సాధ్యమైందని అనుమానం వ్యక్తం చేశారు.  బీజేపీ నాయకులు చిన్న మీటింగులు పెట్టినా, ధర్నాలు చేసినా ఇంటెలిజెన్సుకు తెలుస్తుంది? కానీ వందల మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గుమిగూడి విధ్వంసం స్రుష్టిస్తే ఆ సమాచారం ఎందుకు రాలేదు? నిజానికి ఇంటెలిజెన్స్ కు ముందే ఈ సమాచారం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సహం, సహకారంతోనే విధ్వంసానికి కుట్ర జరిగిందని ఆరోపించారు.  ప్రభుత్వం ఉద్యోగాలివ్వకపోవడంల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియో తీసి సునీల్ నాయక్ చనిపోయారు. ఆర్టీసీ కార్మికులు, రైతులు, 317 జీవో వల్ల ఉద్యోగులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం వాళ్ల అంతిమ యాత్ర కూడా చేయనియ్యని దుర్మార్గుడు సీఎం కేసీఆర్ అని విమర్శించారు. 


యువతను రెచ్చగొట్టవద్దన్న మంత్రి గంగుల కమలాకర్ !


బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వి మూర్ఖంగా మాట్లాడుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. సున్నితమైన విషయంలో యువతను రెచ్చగొట్టకుండా బండి సంజయ్ ఆచితూచి మాట్లాడాలని హితవు పలికారు. యువత న్యాయమైన డిమాండ్ ను కేంద్రం  పరిష్కరించకుండా రాజకీయ లబ్ధికోసం వారిని రెచ్చగొడుతుందని దుయ్యబట్టారు. అగ్నిపథ్ స్కీంను కేంద్రం పునరాలోచించి.. దేశ సేవకు ముందుకు వచ్చే యువతకు అవకాశం కల్పించాలే తప్ప.. నాలుగేళ్ల కాలపరిమితి విధించడం సరికాదని సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు జరిగాయని మరి అక్కడ జరిగిన దానికి కూడా టీఆరెఎస్ పార్టీ కారణమా అని సూటిగా ప్రశ్నించారు.