No Funds For Telangana : తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం మధ్య నిధుల అంశంలో తరచూ వివాదాలు తలెత్తుతూనే ఉంటాయి. తెలంగాణ అసలు ఏమీ సాయం చేయడం లేదని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. అయితే దేశంలో అందరి కన్నా ఎక్కువగా సాయం చేశామని బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. తాజాగా గోదావరి వరదల విషయంలోనూ కేంద్ర సాయం మరోసారి హైలెట్ అవుతోంది. తెలంగాణకు కేంద్రం పైసా సాయం చేయలేదని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. పోటీగా బీజేపీ నేతలు కూడా సాయం చేశామని చెబుతున్నారు. బీజేపీ నేతల వాదనలకు కౌంటర్‌గా టీఆర్ఎస్ నేత క్రిషాంక్... గత ఐదేళ్లుగా రాష్ట్రాలకు కేంద్రం చేసిన విపత్తు సాయం లెక్కలను ట్వీట్ చేశారు. 



కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు సహాయనిధి ఎన్డీఆర్ఎఫ్ ఖాతా కింద .. విపత్తుల్ని ఎదుర్కొన్న రాష్ట్రాలకు సాయం చేస్తూ ఉంటుంది. ఐదేళ్లుగా ఈ నిధి కింద ఏయే రాష్ట్రాలకు ఎంత సాయం చేశారన్న దానిపై పూర్తి వివరాలను టీఆర్ఎస్ నేతలు సేకరించారు. ఆ జాబితాను సోషల్ మీడియాలో పెట్టారు. ఇందులో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇచ్చినట్లుగా లేదు. 
చత్తీస్ గఢ్, గోవా, జమ్మూకశ్మీర్, మిజోరం, పంజాబ్, తెలంగాణ , ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా సాయం చేయంలేదు. అయితే ఆయా రాష్ట్రాల్లో విపత్తులేమీ రాలేదా అంటే  మిగతా రాష్ట్రాల సంగతేమో కానీ.. తెలంగాణలో మాత్రం ప్రతీ ఏడాది విపత్తులు వస్తున్నాయని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. 


2020లో హైదరాబాద్‌లో వరదలు వచ్చి భారీగా నష్టం జరిగింది. గ్రేటర్ ఎన్నికలకు ముందు వచ్చిన ఈ వరదల్లో హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున సాయం కేంద్రం నుంచి తీసుకు వస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు.  బీజేపీ జాతీయ నేతలు కూడా వచ్చారు. అయితే ఆ విపత్తులోనూ కేంద్రం నుంచి పైసా సాయం రాలేదని టీఆర్ఎస్ నేత క్రిషాంక్ స్పష్టం చేశారు. 


టీఆర్ఎస్ బయట పెట్టిన ఎన్డీఆర్ఎఫ్ లెక్కలపై బీజేపీ ఇంకా స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం గోదావరి వరద బాధితులకు కేంద్ర సాయం కోసం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ సంప్రదిస్తున్నారు. హోంమంత్రితో భేటీ తర్వాత రాష్ట్రానికి ఓ ప్రత్యేక టీమ్‌ను పంపాలని అమిత్ షా నిర్ణయించినట్లుగా బండి సంజయ్ పక్రకటించారు.