Puivendula Latest News : పులివెందుల జడ్పీటీసీని అధికార టీడీపీ కైవశం చేసుకుంది. ఇది జగన్‌కు ఎదురు దెబ్బ అని వైసీపీ మరింత నీరసించిపోతుందని టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి. పులివెందుల గడ్డా ఇకపై జగన్ అడ్డా కాదని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే సీన్ రిపీట్ అవుతుందని జోస్యం చెబుతున్నాయి. ఇదంతా దొంగ ఓట్లతో సాధించిన విజయమని కచ్చితంగా నిజమైన ఓట్లతో తాము గెలిచి చూపిస్తామని వైసీపీ శపథం చేస్తోంది. ఇంతకీ ఈ విజయాన్ని ఎలా చూడాలి. ఇది టీడీపీ బలానికి ప్రతీకనా లేకా కేవలం వాపేనా అనేది పరిశీలిద్దాం. పులివెందుల అంటేనే వైఎస్ కుటుంబానికి అడ్డా. పార్లమెంట్ ఎన్నికల నుంచి సర్పంచ్ ఎన్నికల వరకు ఆ ఫ్యామిలీయే శాసిస్తుంది. వారు ఎవర్ని నిలబెడితే వాళ్లకే జనం ఓట్లేస్తారు. ఇది అక్కడ ప్రజల ప్రేమాభిమానాలకు నిదర్శనమని వైసీపీ నేతలు చెబుతుంటారు. కానీ అక్కడ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా భయపెట్టి ఇలాంటి ప్రొజెక్షన్ ఇస్తుంటారని ప్రత్యర్థుల ఆరోపణ. ఏమైనా సరే ఇప్పటి వరకు వైఎస్ కుటుంబాన్ని దాటి వేరే వ్యక్తులు ఆ ప్రాంతంలో గెలించింది లేదు. అలానే జడ్పీటీసీ కూడా ఆ కుటుంబ ఆధిపత్యం సాగుతూ వచ్చింది. కానీ తొలిసారి ఈ ఉపఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీలో సైకిల్ బెల్ మోగింది.
దశాబ్ధాలుగా కొనసాగుతున్న వైఎస్ కుటుంబ ఆధిపత్యానికి ఇది ఎదురుదెబ్బే అనొచ్చు. పులివెందుల జడ్పీటీసీగా ఉన్న తుమ్మల మహేశ్వర్‌రెడ్డి 2023లో ఓ ప్రమాదంలో మృతి చెందారు. అందుకే ఈ స్థానం కోసం ఉప ఎన్నిక జరిగింది. అధికారంలో ఉన్న టీడీపీ, అధికారం కోల్పోయిన వైసీపీ రెండు పార్టీలు కూడా ఈ పులివెందల జడ్పీటీసీ ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. పులివెందుల గడ్డ వైసీపీ అడ్డా అంటూ ఆపార్టీ రాష్ట్ర స్థాయి నేతలంతా వచ్చి ప్రచారం చేశారు.
పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి వ్యూహాన్ని ఈ ఎన్నికల నుంచే అమలు చేయాలని భావించి టీడీపీ అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసింది. ఈ ఎన్నికల పూర్తి బాధ్యతను ఇద్దరు మంత్రులు, ఇతర సీనియర్ నేతలపై పెట్టింది. నిత్యం వారు పులివెందుల ప్రజల్లోనే ఉంటూ గెలుపు ప్రణాళికలను అమలు చేసారు. జగన్‌కు వ్యతిరేకంగా ఉన్న వర్గాలను చేరదీశారు. వైఎస్ కుటుంబంలోనే జగన్ అంటే పడని వారిని తమవైపు తిప్పుకున్నారు. ఇలా ఆరు నెలలుగా అక్కడ ఆపరేషన్ పులివెందుల చేపట్టారు. అందుకు తగ్గ ఫలితాన్ని రాబట్టారు.
అధికారులను, పోలీసులను విచ్చలవిడిగా పార్టీ కార్యకర్తల మాదిరిగా వాడుకున్న టీడీపీ పులివెందులలో అరాచకంగా ఎన్నికలు నిర్వహించిందని వైసీపీ ఆరోపించింది. నిజమైన ఓటర్లు ఓట్లు వేసుకోలేని విధంగా బూత్ క్యాప్చర్ చేసిందని మండిపడింది. అందుకు తగ్గట్టుగానే కొందరు వ్యక్తులు మీడియాతో మాట్లాడించారు. అటు టీడీపీ కూడా వాళ్లకు కౌంటర్ ఇచ్చింది. దశాబ్ధాలుగా ప్రజలను, నాయకులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకుంటూ వచ్చిన వైసీపీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతుంటే తట్టుకోలేకపోతోందని మండిపడింది. వైసీపీ అరాచకాలను పోలీసులు అడ్డుకోవడంతో ప్రజలంతా ప్రశాంతంగా వచ్చి ఓటు వేశారని అన్నారు. ఇంకా చాలా మంది రావాల్సి ఉండేదని కానీ వైసీపీ నేతల బెదిరింపులకు భయపడిపోయారని అంటోంది.
పులివెందులలో టీడీపీ అరాచకాలు చేస్తోందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలకు గతాన్ని గుర్తు చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ప్రాంతంలో కూడా ప్రత్యర్థులు కనీసం నామినేషన్ వేసే అవకాశం లేకుండా చేశారని చెబుతున్నారు. నాడు వైసీపీ నేతలు చేసింది తక్కువ కాదని చెబుతున్నారు. నాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారానికి వెళ్లినా కూడా రానివ్వకుండా చేసిన విషయాన్ని మర్చిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
పులివెందులలో విజయం సాధించిన టీడీపీ వచ్చే ఎన్నికలలో అసెంబ్లీలో గెలుస్తామని చెప్పడం అతి విశ్వాసం అవుతుంది. ఎందుకంటే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ ఇలాంటి ప్రయత్నం చేసి బోల్తా పడింది. కుప్పంలో అన్ని లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధించింద. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతారని ప్రచారం చేసింది. అప్పుడు మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడే మకాం వేసి చంద్రబాబును దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి సీన్ తిరిగబడింది. కుప్పంలో కాదు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీని ప్రజలు తిరస్కరించారు. కేవలం 11 సీట్లే కట్టబెట్టారు.
ఆ విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు పెట్టుకొని మసులుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల జయాపజయాలు కేవలం స్థానికంగా ఉండే రాజకీయ సమీకరణాలను ఆధారంగా చేసుకొని ఉంటాయి. అంతే కాకుండా అధికారంలో ఉన్న పార్టీకి కొద్దోగొప్ప అనుకూలంగా ఉంటాయి. అంత మాత్రాన నాలుగేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పుకోవడం అతి విశ్వాసం అవుతుంది. ఈ దెబ్బకు వైసీపీ ఢీలా పడుతుందని ఆ పార్టీ పని అయిపోయిందనే ఆలోచన సరికాదని అంటున్నారు. గత లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా టీడీపీ పని అయిపోయిందని వైసీపీ నేతలు స్టేట్మెంట్‌లు పాస్ చేశారు. ఇప్పుడు వారంతా ఏ పరిస్థితుల్లో ఉన్నారో అందరికీ తెలిసిందే. ఈ విజయం మెట్టుగా ఉపయోగపడుతుంది. అలానే చూడాలని అంటున్నారు.