Revanth Reddy: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార పార్టీకి నువ్వు బీ టీమ్ అంటే... నువ్వు బీ టీమ్ అంటూ... ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా ఈ పంచాయతీ నడుస్తోంది. బీజేపీకి బీఆర్‌ఎస్ బీటీమ్ అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తే... కాదు కాదు... బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్సే బీటీమ్ అంటూ బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. తాజాగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరోసారి బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటే అంటూ కౌంటర్ ఎటాక్ చేశారు. అందుకు టికెట్ పంపిణీని ఉదాహరణగా చూపుతున్నారు టీపీసీసీ చీఫ్.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో బీఆర్‌ఎస్‌తో కొట్లాడే వారికి బీజేపీ పదవులు ఇవ్వలేదని... కొత్త వాదన తెరపైకి తెచ్చారు రేవంత్‌రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకరికొకకు సహకరించుకుంటున్నారనే దానికి ఇదే ఉదాహరణ అని చెప్తున్నారు. ఆర్మూర్‌లోనే కాదు... ఈ పరిస్థితి రాష్ట్రమంతా ఉందని అంటున్నారు. బీజేపీ.. కేసీఆర్ దోపీడీని బలపరుస్తోందని విమర్శించారు రేవంత్‌రెడ్డి. ఒకరికొకకు సహకరించకపోతే... రాష్ట్రాన్ని దోచుకుంటున్న బీఆర్‌ఎస్‌పై.. కేంద్రంలోని బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డి, అరవింద్‌ను తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు రేవంత్‌రెడ్డి. ఎంపీ అరవింద్ కూడా మోడీ చెప్పింది తప్ప ఇంకేమీ చేయలేరన్నారు. కాంగ్రెస్ నేతలపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టిన బీజేపీ కేసీఆర్‌పై ఎందుకు పెట్టలేదని నిలదీశారు రేవంత్‌రెడ్డి. కేసీఆర్ ఏమైనా సత్యహరిశ్చంద్రుడా? మహాత్ముడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాండ్, ల్యాండ్, మైన్ అన్ని దందాల్లో బీఆర్ఎస్ నేతలే ఉన్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు బీఆర్ఎస్, కేసీఆరే కారణమని మండిపడ్డారు రేవంత్‌రెడ్డి. కేసీఆర్ లక్ష కోట్లు దాచుకున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఒక్కో ఎమ్మెల్యేకు 50కోట్ల రూపయాలు ఖర్చు చేసి గెలిపంచుకోవాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఐదే వేల కోట్లు ఖర్చు చేయాలని చూస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏడున్నర లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని.. రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డపై కూడా లక్షన్నర అప్పు ఉందని చెప్పారు రేవంత్‌రెడ్డి.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ మాజీ నేత ప్రొద్దుటూరి వినయ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వినయ్‌రెడ్డితోపాటు ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన దాదాపు 500 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ధీటుగా పోరాడేది వినయ్‌రెడ్డి మాత్రమే అన్నారు రేవంత్‌రెడ్డి. అందుకే వినయ్‌రెడ్డిని స్వయంగా తానే పార్టీలోకి ఆహ్వానించానని చెప్పారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆర్మూర్‌కు చేసింది ఏమీ లేదన్నారు రేవంత్‌రెడ్డి.
జమిలి ఎన్నికల పేరుతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు... కాంగ్రెస్‌ను ఓడించాలని చూస్తున్నాయన్నారు రేవంత్‌రెడ్డి. ఇద్దరు కాదు... వంద మంది వచ్చినా కాంగ్రెస్‌ను ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్ గడ్డపైకి వచ్చి.. కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు రేవంత్‌రెడ్డి. వచ్చే ఎ్నన్నికల్లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని మట్టికరిపించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.