South Telangana municipal battle : తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి.  ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో రాజకీయం పూర్తిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గా మారిపోయింది. పార్లమెంట్ ఎన్నికల నాటి నుంచి కొనసాగుతున్న జోరును మున్సిపల్ కేంద్రాల్లోనూ ప్రదర్శించి, పట్టణ ఓటర్లపై పట్టు సాధించాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. మరోవైపు, అధికార యంత్రాంగం అండతో పాటు  గ్యారెంటీల అమలును ప్రచార అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ ఇక్కడ జైత్రయాత్ర కొనసాగించాలని చూస్తోంది. దక్షిణ తెలంగాణలో మాత్రం త్రిముఖ పోటీ కనిపిస్తోంది. 

దక్షిణ తెలంగాణలో బలంగా కనిపిస్తున్న కాంగ్రెస్

దక్షిణ తెలంగాణ ప్రాంతాలైన ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రాజకీయ వాతావరణం భిన్నంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్ ఉండగా, బీఆర్ఎస్ తన పట్టును కాపాడుకోవడానికి గట్టిగా పోరాడుతోంది. ఈ ప్రాంతంలో  నల్గొండ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్ వంటి 3 కార్పొరేషన్లతో పాటు పెద్ద సంఖ్యలో మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ కూడా తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తుండటంతో పోరు త్రిముఖంగా మారింది. 

పథకాలతో  కాంగ్రెస్ - పార్టీ బలంతో బీఆర్ఎస్ 

ప్రస్తుత ఎన్నికల్లో అధికార  కాంగ్రెస్  పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో   క్షేత్రస్థాయిలోకి వెళ్తోంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే తమకు అండగా నిలుస్తారని భావిస్తున్న హస్తం పార్టీ, దాదాపు అన్ని వార్డుల్లోనూ అభ్యర్థులను నిలబెట్టి బలమైన ఉనికిని చాటుతోంది. అయితే, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులను అణచివేస్తున్నారనే ఆరోపణలను కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని తన కంచుకోటలను కాపాడుకోవాలన్న పట్టుదలతో ఉంది.  బీజేపీ కేంద్ర నిధుల వినియోగం, హిందూత్వ ఎజెండా,స్థానిక సమస్యలపై  ఛార్జ్‌షీట్ల విడుదల ద్వారా దూకుడుగా ప్రచారం చేస్తోంది. పట్టణ ఓటర్లు తమవైపే ఉన్నారనే ధీమాతో అర్బన్ ఏరియాల్లో కమలం జెండా ఎగురవేయాలని చూస్తోంది. ఇదే సమయంలో,  బీఆర్ఎస్  ఈ ఎన్నికలను తమ మనుగడకు అత్యంత కీలకంగా భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన పట్టణ ప్రగతి  పనులను వివరిస్తూ, కేటీఆర్ ,  హరీష్ రావు నేతృత్వంలో కేడర్‌ను సమాయత్తం చేస్తోంది. త్రిముఖ పోటీ జరుగుతున్న ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే దక్షిణ తెలంగాణలో సాగుతోంది. 

ఫలితాలను మార్చనున్న రెబెల్స్ 

దక్షిణ తెలంగాణ మున్సిపాలిటీల్లో  పార్టీల కంటే అభ్యర్థుల ఎంపిక, రెబెల్స్  ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.  టికెట్ దక్కని నాయకులు స్వతంత్రులుగా బరిలోకి దిగడం అన్ని పార్టీలకూ తలనొప్పిగా మారింది.   ఓట్లు చీలితే అది ఎవరికి లాభిస్తుందనేది అంచనాలకు అందడం లేదు.  ఈ మున్సిపల్ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థలకే పరిమితం కాకుండా, రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయం ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వబోతున్నాయి. ఉత్తర తెలంగాణలో బీజేపీ తన పట్టును నిరూపించుకుంటే, రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తుంది.  లేకపోతే బీఆర్ఎస్ తన స్థానాన్ని కాపాడుకుంటుంది. అందుకే హోరాహోరీగా ప్రయత్నాలు చేస్తోంది.