Telangana municipal elections 2026 Congress Infighting : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీలో  అలజడికి కారణం అవుతున్నాయి.  పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గెలుపు గుర్రాలుగా భావించి ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున నాయకులను చేర్చుకోవడం, పాత క్యాడర్, కొత్తగా వచ్చిన వారి మధ్య సమన్వయం లోపించడం ఇప్పుడు పార్టీకి శాపంగా మారింది. టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావాహులు పెద్ద సంఖ్యలో స్వతంత్రులుగా బరిలో నిలవడం, కొన్ని చోట్ల బీ-ఫామ్ దక్కని వారు తిరుగుబాటు అభ్యర్థులుగా ప్రచారం ప్రారంభించడం పార్టీ హైకమాండ్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

Continues below advertisement

పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే సమస్య                           

ఇటీవలే ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థుల వల్ల పార్టీకి జరిగిన నష్టంపై హైకమాండ్‌కు స్పష్టమైన నివేదిక అందింది. చాలా చోట్ల కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థుల కంటే, టికెట్ దక్కక రెబల్‌గా పోటీ చేసిన వారే విజయం సాధించారు.  గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ఈసారి అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని అధిష్ఠానం సూచించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఒకే వార్డులో ఇద్దరు ముగ్గురు కీలక నేతలు పోటీ పడటం, వారికి స్థానిక ఎమ్మెల్యేలు ,  మంత్రుల మద్దతు ఉండటం వల్ల సమస్య మరింత జటిలమైంది.

Continues below advertisement

తమ వర్గం వారికే చాన్సిచ్చిన జిల్లా స్థాయి నేతలు                     

పార్టీలోని  వర్గ రాజకీయాలు  కూడా రెబల్స్ పెరగడానికి ప్రధాన కారణం. జిల్లా స్థాయి నేతలు తమ వర్గానికి చెందిన వారికే టికెట్లు ఇప్పించుకోవాలనే పట్టుదలతో ఉండటం వల్ల, సమర్థులైన ద్వితీయ శ్రేణి నాయకత్వానికి అవకాశాలు రాలేదు.  జగిత్యాల వంటి ప్రాంతాల్లో సీనియర్ నేత జీవన్ రెడ్డి,  స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాల మధ్య టికెట్ల పంపిణీలో జరిగిన రగడ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటువంటి విభేదాలు ఓట్ల చీలికకు దారితీసి, ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ , బీఆర్ఎస్‌లకు అనూహ్యంగా లాభం చేకూర్చే అవకాశం ఉందని  కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. 

చివరి క్షణంలో తేలిన అభ్యర్థులు                 

స్క్రీనింగ్ కమిటీల జాప్యం వల్ల ఆఖరి నిమిషం వరకు అభ్యర్థులపై స్పష్టత లేకపోవడంతో, నిరాశ చెందిన నేతలు ప్రత్యామ్నాయ దారులు వెతుక్కున్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి గెలుపు సులభం అనే ధీమాతో కొందరు నేతలు రెబల్స్‌ను బుజ్జగించడంలో నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినప్పటికీ, ఇంకా అనేక వార్డుల్లో రెబల్స్ బరిలో ఉన్నారు. మరి ఈ 'రెబల్' సమస్యను అధిగమించి కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందో  చూడాల్సి ఉంది. హోరాహోరీగా సాగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇతర పార్టీలతో పాటు రెబల్స్ కూడా పెద్ద సమస్యగా మారారు.