PK On jagan And Nitish : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో పాదయాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి, నితీష్ కుమార్‌ల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా ఇద్దరి పేర్లు చెప్పి వారి కోసం పని చేసి సమయం వృధా చేసుకున్నానని ఓపెన్‌గా చెప్పడంతో .. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో చర్చనీయాంశం అవుతోంది. బీహార్‌లో రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్న ప్రశాంత్ కిషోర్ ముందుగా పాదాయత్ర చేస్తున్న నేపాల్.. సరిహద్దుల్లో ప్రస్తుతం పాదయాత్ర సాగుతోంది. అక్కడ ఆయన మాట్లాడిన మాటల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జగన్, నితీష్ కుమార్ కోసం పని చేయడం కన్నా కాంగ్రెస్ కోసం పని చేసి ఉంటే బాగుండేదన్న పీకే !
గాడ్సే వాదానికి గాంధీలను బలపరచడమే కరెక్ట్ అని .. తన ప్రొఫెషనల్ జీవితంలో పదేళ్ల పాటు నితీష్ కుమార్, జగన్మోహన్ రెడ్డిలకు పని చేయకుండా కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు పని చేసి ఉండాల్సిందన్నారు. ఆయన వ్యాఖ్యల వెనుక పరమార్థం ఏమిటో కానీ.. ఏపీలో మాత్రం జగన్ ను గెలిరపించినందుకు ప్రశాంత్ కిషోర్ పశ్చాత్తాపం చెందుతున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ మరింత మెరుగైన స్థితిలో ఉండేందుకు తాను ఆ పదేళ్లు కేటాయించి ఉన్నట్లయితే బాగుండేదన్న ఉద్దేశంలో మాట్లాడారు కానీ.. నితీష్ కుమార్, జగన్మోహన్ రెడ్డిలను కించపర్చడానికి కాదన్న వాదన వినిపిస్తోంది.
తన సేవలు తీసుకున్న ఆరుగురు సీఎంలు పాదయాత్రకు సాయం చేస్తున్నారని రెండు రోజుల కిందట ప్రకటన !
రెండు రోజుల కింద పాదయాత్రకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయన్న విమర్శలకు ప్రశాంత్ కిషోర్ కౌంటర్ ఇచ్చారు. తాను స్ట్రాటజిస్ట్‌గా పని చేసిన పార్టీల్లో ఆరుగురు ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నారని వారు సాయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తన పాదయాత్రకు సాయం చేస్తున్నారని చెప్పిన ఆయన.. వారికి పని చేయకుండా ఉండే బాగుండేదన్న ఉద్దేశంలో మాట్లాడటం హాట్ టాపిక్ అవుతోంది. అదీ కూడా ఇద్దరి పేర్లను మాత్రమే ప్రస్తావించారు. ఆ ఇద్దరిలో ఒకరు నితీష్ కుమార్.. జగన్మోహన్ రెడ్డి, నితీష్ కుమార్ కు ఇప్పుడు ఆయన పూర్తి వ్యతిరేకి. ఒకప్పుడు నితీష్ పార్టీకి చెందిన జేడీయూలో చేరి నెంబర్ 2గా ఎదిగారు. నితీష్ రాజకీయ వారసుడిగా ప్రచారం పొందారు. తర్వాత ఏం జరిగిందో కానీ బయటకు వచ్చేశారు. ఇప్పుడు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇప్పుడు కూడా జగన్ కోసం పని చేస్తున్న ఐప్యాక్ టీం !
నితీష్‌ను తాను గెలిపించకుండా ఉండాల్సిందన్న ఉద్దేశంతోనే ప్రశాంత్ కిషోర్ మాట్లాడారని.. ఆ పేరుతో పాటు జగన్ పేరును యాడ్ చేయడంతోనే రాజకీయంగా .. జగన్‌కు వ్యతిరేకంగా కామెంట్లు చేసినట్లుగా గట్టి ప్రచారం జరుగుతోంది. నిజానికి పీకే టీఎం ఇప్పుడు కూడా జగన్ కోసం పని చేస్తోంది. ఐ ప్యాక్ నుంచి అధికారికంగా పీకే బయటకు వచ్చారు. ఆయన స్నేహితులు నడుపుతున్నారు. రిషిరాజ్ అనే పీకే సన్నిహితుడు ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ రాజకీయ వ్యవహారాలను చూస్తున్నారు. అందుకే జగన్ గురించి వ్యతిరేక కామెంట్లు చేయరని.. కేవలం కాంగ్రెస్ పరిస్థితి మరింత మెరుగ్గా ఉండాలన్న ఆలోచనతోనే అలా చెప్పి ఉంటారని భావిస్తున్నారు.
పీకే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ ఆయనకు సానుకూలత లభించలేదు. దాంతో కాంగ్రెస్‌కు వ్యతిరేక కామెంట్లు చేశారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌కు అనుకూల కామెంట్లు చేస్తున్నారు.