Batti Vs Revant :   తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వెనక్కి తగ్గరు. వారి అంతర్గత ప్రజాస్వామ్యాన్ని వారు కొనసాగిస్తూనే ఉంటారు. ఒకరికొకరు పోటీలు పెట్టుకుంటూనే ఉంటారు. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి రాను రాను తీసికట్టుగా మారుతున్నా..సీనియర్లు పార్టీని వదిలి వెళ్లిపోతున్నా వారిలో మార్పు రావడం లేదు. తాజాగా పాదయాత్ర విషయంలో ఆ పార్టీలో  పెద్ద పంచాయతీనే నడుస్తోంది. ఇది ఎప్పుడైనా బ్లాస్ట్ కావొచ్చని ఆ పార్టీ నేతలు కంగారు పడుతున్నారు. ఈ పాదయాత్ర విషయంలో రేవంత్ రెడ్డి వర్సెస్ భట్టి విక్రమార్క అన్నట్లుగా పోరు నడుస్తోంది. 


పాదయాత్రకు హకమాండ్ నుంచి అనుమతి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ! 


రేవంత్ రెడ్డి తెలంగాణలో పాదయాత్రకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు . డిసెంబర్ 9 నుంచి ఆయన పాదయాత్ర చేసేందుకు  సైలెంట్‌గా హైకమాండ్ వద్ద తనకు కావాల్సిన అన్ని రకాల అనుమతులు తెచ్చుకున్నారు.  తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వచ్చింది. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి తాను కూడా పాదయాత్ర చేయాలనుకుంటున్నానని చెప్పడంతో రాహుల్ అంగీకరించారు. ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ వర్గీయులు ఇప్పటికే పాదయాత్ర ఏర్పాట్లు, రూట్ మ్యాప్ వంటి అంశాలపై కసరత్తు దాదాపుగా పూర్తి  చేశారు.  తెలంగాణలో ఎన్నికలకు ఇంకా ఖచ్చితంగా ఏడాది మాత్రమే సమయం ఉంది. ఆరు నెలల్లో తెలంగాణ మొత్తం పాదయాత్ర పూర్తి చేసి ఆ తర్వాత .. ఎన్నికల సన్నాహాలను ముందుండి చేయాలని రేవంత్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.  


పాదయాత్ర తానూ చేస్తానని పట్టుదలగా భట్టి విక్రమార్క !


అయితే పాదాయత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకికాదని..  రేవంత్ వ్యక్తిగత ఇమేజ్ పెరుగుతుందని సీనియర్లు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఒక్కరేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా ఇతర నేతలు కూడా పాదయాత్ర చేసేలా అంగీకరించాలని ఒత్తిడి చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ముగిసిన రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలంతా పాదయాత్ర చేయాలని ఏఐసీసీ ఆదేశించింది.   ఇదే కోణంలో తెలంగాణలోనూ ఇద్దరితో పాదయాత్ర చేయించాలని కోరారు. దీంతో  హైకమాండ్ కూడా ఈ విషయంలో ఆలోచన చేసింది. దీంతో రేవంత్‌కు తోటుగా భట్టి విక్రమార్క కూడా పాదయాత్రకు రెడీ అవుతున్నారు.  ఇద్దరూ కలిసి చేయాలని కొందరు అంటుంటే, భట్టి పాదయాత్ర చేస్తే ఇతర బాధ్యతలను రేవంత్‌ చూసుకోవచ్చని మరికొందరు, రేవంత్‌ కచ్చితంగా పాదయాత్ర చేయాలని ఇంకొందరు సలహాలిస్తున్నారు. 


నేతంలదరూ కలిసి బస్సు యాత్ర చేయాలనే మరో ప్రతిపాదన !


అసలు పాదయాత్రలు కాదని.. నేతలందరూ బస్సు యాత్ర చేయాలన్న ఓ ప్రతిపాదన కూడా హైకమాండ్ ముందు పెట్టారు.  బస్సుయాత్ర ఖరారైతే దాదాపు 10 మంది నేతలు రాష్ట్రవ్యాప్తంగా బస్సులో పర్యటించి రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నేతలందరూ ఐక్యంగా ఉన్నామనే సంకేతాలిచ్చినట్లవుతుందంటున్నారు.  డిసెంబర్‌ ఆఖరులో కాంగ్రెస్‌కు సంబంధించిన ఏదో ఒక యాత్ర రాష్ట్రంలో ప్రారంభం కానుంది.  సీఎల్పీ నేత భట్టి మాత్రం ఇప్పటికే పాదయాత్రకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. భద్రాచలం నుంచి ప్రారంభమై పినపాక, ములుగు, భూపాలపల్లి, మంథని, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ మీదుగా ఆలేరు నుంచి హైదరాబాద్‌ వరకు యాత్ర చేసేందుకు ఆయన రూట్‌ మ్యాప్‌ కూడా తయారు చేసుకుని అధిష్టానానికి సమాచారమిచ్చారు. అయితే రేవంత్ పాదయాత్ర చేస్తేనే పార్టీలో ఊపు వస్తుందని ఆయన వర్గం అంటోంది. 


మాస్ లీడర్‌ను ముందు పెట్టుకుని ఏ పార్టీ అయినా రాజకీయం చేస్తుంది. అయితే తలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం అందరూ పోటీ పడుతున్నారు. అందుకే ఆ పార్టీ రెండు అడుగులు ముందుకు..... ఐదడుగులు వెనక్కి అన్నట్లుగా పరిస్థితి మారింది.