YSRCP BC Meeting: వచ్చే నెల (డిసెంబర్) 8న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 వేల మంది బీసీ ప్రజా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు అయ్యే అవకాశాలున్నాయి. వైసీపీ బీసీ మంత్రులు... వైసీపీ బీసీ ప్రజాప్రతినిధులు సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్యాల నాయుడు, వేణు గోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు అనిల్, పార్ధ సారధి, విప్ జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు. డిసెంబర్ 8 న బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో పది వేల మందితో బీసీ సమ్మేళనం జరగనుంది.. బీసీ సామాజిక వర్గ ఎంపిటిసి, జెడ్పిటిసిల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజ్యసభ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. బీసీల విషయంలో వైసీపీకి మాత్రమే చిత్తశుద్ధి ఉందన్నారు ఎంపీ మార్గాని భరత్. బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్ల కోసం ప్రైవేట్ మెంబర్‌షిప్ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఘనత వైసీపీదే అన్నారు ఎంపీ భరత్. 139 ఉప కులాలు ఉన్న బీసీలకు 56 కార్పొరేషన్ లు ఉన్నాయన్నారు మంత్రి గుమ్మనూరి జయరామ్. 88 వేల కోట్ల సంక్షేమం బీసీలకు జరిగిందన్నారు. డిసెంబర్ 8 న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.
వైసీపీ బీసీ ఆత్మీయ సభకు సీఎం జగన్ కూడా హాజరుకానున్నారని మండలి విప్ జంగా కృష్ణ మూర్తి అన్నారు. ఎన్నికలకు ముందు బీసీలకు ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగిందని.. అనేక అంశాలు ఈ డిక్లరేషన్ లో ఉన్నాయన్నారు. 50 శాతం సంక్షేమ కార్యక్రమాలు బీసీ లకు ఇవ్వడం జరిగిందన్నారు జంగా. రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు బీసీ ఎస్సి ఎస్టీలకు ఇవ్వడం జరిగిందన్నారు. మరో మూడు రోజుల్లో బీసీ నేతలు మరోసారి సమావేశం కానున్నారు. బీసీల ఆత్మీయ సమావేశంలో అజెండాపై చర్చిస్తారు. తర్వాత సీఎం జగన్ ను కలిసి బీసీ ఆత్మీయ సమావేశానికి ఆహ్వానిస్తారు బీసీ ప్రజాప్రతినిధులు. దీంతో ఈ సభపై పార్టీ వర్గాలతో పాటు ఇతర పార్టీల్లోనూ చర్చ మొదలైంది.
బీసీ నిదుల మళ్ళింపును తేల్చాంటున్న టీడీపీ..
వైసీపీ బీసీ జపం చేయటంతో టీడీపీ కూడా రాజకీయంగా ఎదురు దాడిని ప్రారంభించింది. టిడిపి ప్రభుత్వంలో అమలు చేసిన వంద సంక్షేమ పథకాలను రద్దు చేసి, రూ.34 వేల కోట్ల బీసీ నిధులను దారిమళ్లించిన జగన్ రెడ్డి బీసీ ద్రోహి అని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బీసీలను మరోసారి మోసం చేసేందుకు జగన్ రెడ్డి, వైసీపీ బీసీ మంత్రులు, నేతల సమావేశం జరిపి వారితో అబద్దపు ప్రకటనలు చేయించారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అన్ని వర్గాలకూ అమలు చేసిన పథకాలే బీసీలకు అందిస్తూ.. వాటినే ప్రత్యేక పథకాలుగా ప్రచారం చేస్తున్నారు. మూడున్నరేళ్లలో రూ.34వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించి బీసీ సాధికారితను మంటగలిపారని మండిపడ్డారు. ఆధరణ పథకం రద్దు చేశారని అన్నారు.
స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కోత విధించి సుమారు 16,800 రాజ్యాంగబద్ద పదవులను బీసీలకు దూరం చేశారని మండిపడ్డారు. బీసీల అనైన్డ్ భూములు 8వేల ఎకరాలు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని, బీసీలకు విదేశీ విద్య, పెళ్లి కానుకలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేశారని తెలిపారు. బీసీ భవనాలను నిలిపేశారని, 26 మంది బీసీ నేతల్ని హత్య చేశారని ఆరోపించారు. 650 మంది బీసీ నేతల పై తప్పుడు కేసులు పెట్టారని, వేలాది మందిపై దాడులకు పాల్పడ్డారని, బీసీ శవాలపైనే జగన్ రెడ్డి కుటుంబ వైభవం ప్రారంభమైందని విమర్శించారు. బీసీ వర్గానికి(చేనేత) చెందిన జింకా వెంకట నరసయ్యను జగన్ రెడ్డి తాత హత్య చేసి, ఆయన బైరైటీస్ గనిని దురాక్రమించుకున్నారని అన్నారు. జీవో నెం.217తో మత్స్యకారుల వృత్తికి ఉరితాడు బిగించారని, NHDP పథకాలను రద్దు చేసి చేనేత వర్గాల వారికి కేంద్ర సబ్సిడీలు దూరం చేశారన్నారు.
వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లుగా ఇద్దరు బీసీలను పెట్టి వారిని సెట్ చేయాడానికి రిమోట్ కంట్రోల్ గా తన సొంతవర్గం నేతలను నియమించారని ఆరోపించారు. 56 కార్పొరేషన్లు పెట్టి వాటికి నిధులు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. బీసీ మంత్రులను డమ్మీలను చేసి మొత్తం జగన్ రెడ్డే అధికారం చెలాయిస్తున్నారని, సామాజిక న్యాయాన్ని గొంతుకోస్తుంటే బీసీ మంత్రులు నిలదీయలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. దారిమళ్లించిన రూ.34 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని, రద్దు చేసిన బీసీ రిజర్వేషన్లు, ఆధరణ పథకాన్ని వెంటనే పునరుద్దరించాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది.
AP TDP: బీసీ మంత్రులను డమ్మీలను చేసి, వైసీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనాలా?: టీడీపీ నేతలు ఫైర్
Harish
Updated at:
26 Nov 2022 06:33 PM (IST)
టిడిపి ప్రభుత్వంలో అమలు చేసిన వంద సంక్షేమ పథకాలను రద్దు చేసి, రూ.34 వేల కోట్ల బీసీ నిధులను దారిమళ్లించిన సీఎం జగన్ బీసీ ద్రోహి అని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
వైసీపీ బీసీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు
NEXT
PREV
Published at:
26 Nov 2022 06:33 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -