NTR District News : ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో జరిగిన మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో పుట్రేల గ్రామ సర్పంచ్ కారుమంచి స్వాతి  కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ ఇంటి కరెంట్ సర్వీస్ వైర్ ను తొలగించారని, పాత మీటర్ మార్చి కొత్త మీటర్ పెట్టినా కూడా పాత కరెంటు బిల్లు కూడా కొత్త  మీటర్లో యాడ్ చేసి  బిల్ కట్టాలని వేధిస్తున్నారన్నారు. తమ కరెంట్ సర్వీస్ వైర్ ను కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసిన పుట్రేల గ్రామ సర్పంచ్ కారుమంచి స్వాతి అధికారిక సమావేశంలోనే కన్నీటి పర్యంతం అయ్యారు.  


అసలేం జరిగింది? 


ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రేలకు చెందిన వైసీపీ దళిత సర్పంచ్ కారుమంచి స్వాతి తన ఇంటికి కరెంటు కట్‌ చేశారంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆమె అధికారుల ముందే కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది.  మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ పి.మెర్సీ వనజాక్షి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పుట్రేల సర్పంచ్ స్వాతి విద్యుత్ అధికారులపై ఆరోపణలు చేశారు. విద్యుత్ శాఖ అధికారులు నాలుగు నెలల బిల్లు ఒక్కసారే తీయడంతో  ఎక్కువగా వచ్చిందని, తనిఖీల పేరిట వచ్చిన అధికారులు ఒక్కసారి బిల్లు తీసి కట్టాలంటున్నారని ఆవేదన చెందారు. బిల్లు కట్టలేదని కరెంట్ కట్ చేశారని ఆరోపించారు. తాము ఓసీలు కాదని, ఎస్సీ వర్గానికి చెప్పినా వినిపించుకోలేదన్నారు. దీంతో సభ్యులతో పాటు ఎంపీపీ వనజాక్షి, ఎంపీడీవో వెంకటరమణ విద్యుత్ అధికారి ఏఈ విజయభాస్కర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక బృందాల తనిఖీల సమయంలో ఈ పొరపాటు జరిగిందని సరిచేస్తామని ఏఈ వివరణ ఇచ్చారు. 


కూలీగా మారిన సర్పంచ్ 


మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్ర సర్పంచ్ దర్శనాల సుష్మిత.. గ్రామంలో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్‌గా గెలిచారు. అయితే అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరి గ్రామాభివృద్ధికి శ్రమించారు. ఈ క్రమంలోనే గ్రామాభివృద్ధి కోసం 20 లక్షల వరకు అప్పు చేశారు. గ్రామంలో రోడ్లు, మురికి కాలువలు ఇతర అభివృద్ధి పనులు చేయించారు. కానీ నెలలు గడిచినా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉపసర్పంచ్‌పై అవిశ్వాసం ప్రకటిస్తే అందులో రెండో సంతకం చేసిన వ్యక్తి ఇప్పుడు సుష్మితను ఇబ్బంది పెడుతున్నారు. చేసిన పనులకు బిల్లులు రానీయకుండా సమస్యలు సృష్టిస్తున్నారట. సొంత టీఆర్ఎస్ పార్టీలోనే వర్గం పేరుతో వేరు చేయడం చాలా బాధగా ఉందని సర్పంచ్‌ సుష్మిత అన్నారు. 


బిల్లులు రాక ఇబ్బందులు 


తాను ఒక దళిత మహిళనని చిన్న చూపు చూస్తూ గ్రామాభివృద్ధికి సహకరించడం లేదని సుష్మిత ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పనికి బిల్లులు రాక, రెండో సంతకందారుడి ఇబ్బందులు భరించలేకపోవడంతోపాటు వడ్డీల భారం పెరుగుతుండటంతో సమస్యలు ఎదుర్కొంటున్నానని తెలిపారు. కుటుంబ పోషణ కోసం గ్రామస్థులతో కలిసి దినసరి కూలీగా పని చేస్తున్నట్లు సర్పంచ్ సుస్మిత తెలిపారు. పెండింగ్ బిల్స్ వస్తే తప్ప తన సమస్యకు పరిష్కారం దొరకదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు.