Bajrang Dal attack on Muslim Youth:
కలిసి ప్రయాణించాడని...
హిందూ మతానికి చెందిన యువతితో కలిసి బస్సులో ప్రయాణం చేస్తున్నందుకు ఓ ముస్లిం యువకుడిపై భజరంగ్ దళ్ కార్యకర్తలు తీవ్రంగా దాడి చేసిన ఘటన కర్ణాటకలో జరిగింది. ఆ యువకుడిని భజరంగ్ దళ్ కార్యకర్తలు బాగా కొట్టినట్టు పోలీసులు వెల్లడించారు. మంగళూరులోని నతుర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. "భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ యువకుడిని వేధించారు. దాడి చేశారు. ఓ ప్రైవేట్ బస్‌లో హిందూ యువతితో ప్రయాణం చేస్తున్నాడన్న కారణంతో ఇబ్బంది పెట్టారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటాం" అని పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది జులైలోనూ భజరంగ్ దళ్ కార్యకర్తలు ఓ దళితుడిపై దాడి చేశారు. వ్యవసాయ పనుల కోసం ఓ ఆవుని వాహనంలో తీసుకెళ్తుండగా అడ్డగించి దాడి చేశారు. ఈ దాడిలో 40 ఏళ్ల మంజునాథ్ గాయాల పాలయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్‌సీ, ఎస్టీ యాక్ట్ కింద నిందితులపై కేసు నమోదు చేశారు.
ఎన్నో ఘటనలు..
కర్ణాటకలో నిత్యం ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తూనే ఉంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్ణాటక శివమొగ్గలో బజరంగ్ దళ్ కార్యకర్తను కొంత మంది యువకులు కలిసి హత్య చేశారు. వారిని మహ్మద్ ఖాసిఫ్, సయ్యద్ నదీమ్, అసిఫుల్లా ఖాన్, రేహాన్ షరీఫ్, నిహాన్, అబ్దుల్ అఫ్నాన్గా గుర్తించారు. శివమొగ్గలోని ఆదివారం రాత్రి కారులో వచ్చిన పలువురు దుండగులు బజరంగ్‌దళ్ కార్యకర్త హర్షను కత్తితో పొడిచి హత్యచేశారు. గతంలో ఓ సారి భజరంగ్ దళ్ కార్యకర్తలు హిందూ దేవతలను అవమానించే రీతిలో చిత్రాలు ఉన్నాయనే కారణంతో కామసూత్ర పుస్తకాలను తగలబెట్టిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌కి చెందిన బజ్‌రంగ్ దళ్ నేతలు ఒక బుక్ స్టోర్ ఎదుట ఈ పుస్తకాలను కాల్చివేశారు. దీనికి సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కామసూత్ర పుస్తకంలో ఉన్న ఫొటోలు అసభ్యకర రీతిలో ఉన్నాయని.. అవి హిందూ దేవతల రూపాలతో పోలి ఉన్నాయని బజ్‌రంగ్ దళ్ నేతలు ఆరోపించారు. ఈ కారణంగానే వీటిని తగలబెట్టినట్లు చెప్పారు. ఈ పుస్తకాలను మరోసారి అమ్మితే దుకాణాన్ని కూడా తగలబెట్టేందుకు వెనకాడబోమని షాపు యజమానిని హెచ్చరించారు. కామసూత్ర పుస్తకంలో అసభ్యకర రీతిలో ఉన్న ఫోజులను (ఫొటోలు) బజ్‌రంగ్ దళ్ నేతలు తమ వీడియోలో చూపించారు. ఇవి హిందూ దేవతలను పోలి ఉన్నాయని ఆరోపించారు. అనంతరం ఈ పుస్తకాలన్నింటినీ దుకాణం బయట కుప్పగా పోసి తగలబెట్టారు. హర్ హర్ మహదేవ్, జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ పుస్తకాలను తగలబెట్టినట్లుగా వీడియోలో ఉంది.
Also Read: MCD Polls 2022: బీజేపీ వీడియోలా, ఆప్ హామీలా? ఏవి గెలుస్తాయో ప్రజలే నిర్ణయిస్తారు - కేజ్రీవాల్