Sharmila Politics  :   తన తండ్రిని కుట్ర చేసి చంపారని.. తనను కూడా చంపుతారంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేసిన ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. తనను అరెస్ట్ చేస్తారని.. తాను దేనకీ భయపడబోనని సంకెళ్లు చూపించి మరీ చాలెంజ్ చేశారు. అయితే ఎందుకు షర్మిల ఒక్క సారిగా ఇలా తీవ్రంగా స్పందించారన్నది చాలా మందికి సందేహంగానే ఉంది. అటెన్షన్ కోసం రాజకీయ వ్యూహమని కొందరు అంటూంటే మరకొందరు మాత్రం ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆమె చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అరెస్టులు ఆదేశాలివ్వొచ్చన్న సమాచారం మేరకు ఇలా స్పందించారని అంటున్నారు. అయితే ఆమె వ్యాఖ్యలపై ఎక్కువగా నెగెటివ్ కామెంట్సే వినిపిస్తున్నాయి. 


షర్మిలపై కుట్ర చేసేదెవరు ?


రాజన్న బిడ్డనని రాజన్న రాజ్యం తీసుకు వస్తానని.. తెలంగాణలో షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టారు. ఆమె నిర్విరామంగా పాదయాత్ర చేస్తున్నారు. ఇటీవలే రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేశారు. కానీ ఇటీవలి కాలంలో ఆమె ముఖ్యమంత్రితో పాటు  ఇతర మంత్రులపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అమె అసభ్యంగా ప్రజా ప్రతినిధుల్ని తిడుతున్నారని చర్యలు తీసుకోవాలని పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పీకర్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఆమె  తనను అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నారు. స్పీకర్ ఆ మేరకు ఆదేశాలిస్తారనే సమాచారం ఉండటంతో ఆదివారం పూట ఇలాంటి తీవ్రమైన ప్రకటన చేశారని అంటున్నారు. 


షర్మిల వ్యాఖ్యలను టీఆర్ఎస్ అంత సీరియస్‌గా తీసుకుంటుందా ? 


అయితే .. రాజకీయాల్లో దూకుడు విమర్శలు సహజమే. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల మరీ ఎక్కువ. షర్మిల కూడా అలాగే చేస్తున్నారనుకుని రాజకీయంగా విమర్శలు చేయవచ్చు.. కానీ టీఆర్ఎస్ నేతలు ఏమనుకున్నారో ఏమో కానీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశం వెనుక చర్యలు తీసుకోవాలన్న ఆలోచన ఉందన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఇof సున్నితమైన విషయం. రాజకీయ విమర్శలు.. కాస్త గీత దాటయని అనుకున్నంత మాత్రాన మరో రాజకీయ నాయకురాలిని అరెస్ట్ చేయమని స్పీకర్ ఆదేశిస్తారా అన్న సందేహం సహజంగానే ఉంటుంది.  టీఆర్ఎస్ షర్మిల విమర్శలను మరీ అంత సీరియస్‌గా తీసుకోలేదని... ఫిర్యాదు కూడా షర్మిల మరోసారి అలా మాట్లాడకుండా చేసే వ్యూహంతోనే చేశారని అంటున్నారు. 


అటెన్షన్ కోసమే షర్మిల ప్రయత్నిస్తున్నారని విమర్శలు ! 


వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా పాదయాత్ర చేస్తున్న షర్మిలకు అనుకున్నంతగా క్రేజ్ రావడం లేదని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. మీడియాలోనూ పెద్దగా స్పేస్ దొరకడం లేదు .అందుకే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ వ్యూహం ప్రకారమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై ఆయన కుటుంబసభ్యులు చాలా సార్లు అనుమానాలు లేవనెత్తారు. అయితే రాజకీయ అవసరాల కోసమే ఇలా అంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలో తన తండ్రి మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని వైఎస్ కుటుంబసభ్యులు ఆరోపించారు. కానీ ఇటీవల ముఖేష్ అంబానీ జగన్ ఇంటికి విందుకు వచ్చారు. పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటిచ్చారు. దీంతో ఆ ఆరోపణలపై ప్రజల్లోనూ సీరియస్ నెస్ తగ్గిపోయింది. ఇప్పుడు తెలంగాణలో షర్మిల అలాంటి వ్యాఖ్యలు చేయడంతో... ప్లస్ కాకపోగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.