తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాల చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎటువైపు జంప్ చేస్తారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన ఊపుతో తెలంగాణలో కూడా అధికారంలో వస్తున్నామని జోష్ మీద ఉన్న కాంగ్రెస్‌కు పెద్ద జలక్ తగలనుందని తెలుస్తోంది. 


ఆ నియోజక వర్గంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ గెలుస్తున్న ఓ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నట్టు సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చి కారు ఎక్కేస్తున్నారని పొలిటికల్ సర్కిల్‌లో బలంగా టాక్ నడుస్తోంది. దీనికి డేట్‌ కూడా ఫిక్స్ చేశారని సమాచారం. 


చాలా కాలంగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ ఎమ్మెల్యే గులాబీ నేతలతో చాలా సఖ్యతగా ఉంటున్నారు. చాలా పనులు చేయించుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సొంత పార్టీ నేతలతో కంటే అధికార పార్టీ నేతలతోనే ఆయన ఎక్కువ గడిపినట్టు సహచరులు చెప్పుకుంటున్నారు. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. 


తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సదరు ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారు. చాలా సందర్భాల్లో నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. అధినాయకత్వానికి కూడా ఫిర్యాదులు చేశారు. డబ్బులకు ఆ సీట్ కొనుకున్నారని కామెంట్స్ కూడా చేశారు. ఇలాంటి అసంతృప్త నేతలు ఎన్ని కామెంట్స్ చేస్తున్నా అధినాయకత్వం మాత్రం రేవంత్‌కే సపోర్ట్ చేస్తుందన్నది ఆ ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణ. 


అందుకే ఈ మధ్య కాలంలో పార్టీలో యాక్టివ్‌గా ఉండటం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట అందుకే పార్టీ మారాలన్న డెసిషన్‌కు వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. 19 లేదా 20వ తేదీన కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారని గట్టిగా టాక్ వినిపిస్తోంది.