BJP Central Election Committe: ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు చేపట్టింది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆ పార్టీ అధ్యక్షుడు JP నడ్డా సహా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు హాజరయ్యారు. 


సమావేశంలో మధ్యప్రదేశ్​, ఛత్తీస్‌గఢ్​ రాష్ట్రాలపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఛత్తీస్‌గడ్‌లోని 27 అసెంబ్లీ సీట్లపై ప్రధానంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అధికారమే లక్ష్యంగా సీట్లను ఏ, బీ, సీ, డీ వర్గాలుగా విభజించారు. సమావేశంలో ముఖ్యంగా బీ, సీ కేటగిరీలో ఉన్న 22 స్థానాలు, డీ కేటగిరీలో ఉన్న 5 సీట్లపై చర్చించినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. గతంలో పోటీ చేసిన అభ్యర్థులకు ప్రజల మద్దతు లేదని, మెజారిటీ స్థానాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టే అంశాన్ని పరిశీలించినట్లు పార్టీ వర్గాల సమాచారం.


అధికారమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పార్టీ బలహీనంగా ఉన్న స్థానాల్లో ఏం చేస్తే పార్టీ బలపడుతుంది, నాయకత్వ మార్పు సమీకరణాలు అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన సీట్లపై సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నాయి. ఓటమికి కారణాలు, గెలవడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిగాయి. 






అలాగే ఎన్నికలు జరుగునున్న రాష్ట్రాల నాయకత్వం ఇచ్చిన నివేదికను కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలించింది. ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలుపై ఇందులో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. పార్టీ అభ్యర్థులు, ఎన్నికల వ్యూహాల అమలు ప్రధానాంశంగా ఈ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌​, ఛత్తీస్‌​గఢ్​ మాజీ సీఎం రమణ్ సింగ్​ పాల్గొన్నారు. 


వాస్తవానికి ఎన్నికల తేదీల ప్రకటనకు కొద్దిరోజుల ముందు ఈ కమిటీ భేటీ అవుతుంది. అయితే కొద్దినెలల ముందే ఈ కమిటీ సమావేశం కావడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అసలే కర్ణాటకలో ఓటమితో దెబ్బతిన్న బీజేపీ త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజీలేని పోరాటం చేయాలని బీజేపీ భావిస్తోంది. మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో  ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌, తెలంగాణలో విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఈ మూడుచోట్ల అధికారం కోసం బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. 


సెమీ ఫైనల్‌గా భావించే ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉండగా కాంగ్రెస్‌ నుంచి గట్టిపోటీ ఎదురవుతుందని బీజేపీ అంచనా వస్తోంది. అలాగే మిజోరంలో అధికారంలో ఉంది. మణిపుర్‌ సమస్యను పరిష్కరించడంలో బీజేపీ విఫలమైందనే ఆరోపణలు చేస్తూ MNF బీజేపీకి దూరంగా జరిగింది. ఇటీవల లోక్‌సభలో జరిగిన అవిశ్వాస తీర్మానానికి MNF అనుకూలంగా ఓటు వేసింది. దీంతో అక్కడా ఎదురుగాలి తప్పదనే భావనలో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సత్తాచాటాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు వ్యూహరచనలు చేస్తోంది.


ఈ సారి సార్వత్రిక ఎన్నికలు సైతం గతంలో జరిగినంత సులువుగా, అనుకూలంగా జరగవని బీజేపీ భావిస్తోంది. ప్రతి పక్ష కూటమి I.N.D.I.Aతో గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐదు రాష్ట్రాల్లో పార్టీ బలహీనంగా ఉన్న స్థానాలకు అభ్యర్థులను ఖరారుచేసే అంశంపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 


ఈ సందర్భంగా పలువురు స్పందిస్తూ అభ్యర్థులను ముందే ప్రకటించాలని, తద్వారా వారు ఎన్నికలకు సన్నద్ధం కావడానికి సరిపడినంత సమయం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌, విపక్షాల ఎన్నికల హామీలను దీటుగా ఎదుర్కొనేందుకు పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.