TDP In NDA :  తెలుగుదేశం పార్టీ మళ్లీ నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్ ఎన్డీఏలో చేరడానికి రంగం సిద్ధమైందని ఢిల్లీలో రాజకీయవర్గాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన సమయంలో నారా లోకేష్ కూడా ఢిల్లీలోనే ఉన్నారని.. ఆయన అమిత్ షాతో చర్చలు జరిపారని లేటుగా బయటకు వచ్చింది. అయితే ఇది అధికారికం కాదు. అలాగని ఇది తప్పు అని ..అలాంటిదేమీ జరగలేదని అటు టీడీపీ కానీ ఇటు బీజేపీ కానీ ఖండించడం లేదు. ఎవరో ఏదో అనుకుంటే తామెందుకు ఖండించాలనేది ఆ రెండు పార్టీల వాదన. పైకి ఇలా చెబుతున్నారంటే  అంతర్గతంగా ఏదో జరుగుతోందని ఎవరికైనా అనిపిస్తోంది. 


ఎన్డీఏలోకి  కొత్త పార్టీలను చేర్చుకునే వ్యూహంలో మోదీ- షా !


ఒకప్పుడు  బీజేపీ తర్వాత ఆ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న పార్టీలు ఎన్డీఏలో ఉండేవి. పంజాబ్‌లో అకాలీదళ్, మహారాష్ట్రలో శివసేన, అన్నాడీఎంకే, లోక్ జనశక్తి , 2014లో టీడీపీ కూడా ఉండేది. అయితే ఇప్పుడు బీజేపీతో జట్టులో ఉన్న ఇతర పార్టీలు ఏవీ ఆ పార్టీతో సుదీర్ఘంగా నడుస్తున్నవి కావు.  బలం ఉన్నవి కావు. ప్రస్తతం ఎన్డీఏలో బీజేపీ తర్వాత ఉన్న పార్టీ ఏది అంటే.. శివసేన చీలిక గ్రూపు మాత్రమే. ఇప్పుడు జేడీయూ కూడా దూరమైంది. పేరుకు ఎన్డీఏనే కానీ బీజేపీ తప్ప బలమైన పార్టీ ఆ కూటమిలో కనిపించలేదు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీఏలో కొత్త పార్టీలను చేర్చుకోవాలని మోదీ, షా భావిస్తున్నారు. ఆ ప్రకారమే..  రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయని అంటున్నారు. 


దక్షిణాది నుంచి కూటమికి సీట్లు ఉండటం కీలకం !


ఉత్తరాదిలో గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ అత్యధిక లోక్ సభ సీట్లను సాధించింది. కొన్ని రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేసింది. ్యితే ఈ సారి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చన్న అంచనా ఉంది. ప్రతీ  సారి వంద శాతం సీట్లు సాధించడం ఎవరికీ  సాధ్యం కాకపోవచ్చు. ఓ ఇరవై శాతం సీట్లు కోత పడినా అది బీజేపీకి ఇబ్బందికరంగా మారుతుంది. మెజార్టీని లోటులోకి తీసుకెళ్తుతంది. అది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో..  రాజకీయాల్లో ఢక్కా మొక్కీలు తిన్న మోదీ, షాలకు తెలియదని అనుకోలేం. అందుకే ఈ సారి దక్షిణాదిలో సీట్లు పెంచుకోవాలని అనుకుంటోంది. నేరుగా గెలుచుకోలేని చోట.. కూటమి కట్టి  గెలవాలనుకుంటోంది. అందుకే..  అన్ని అవకాశాలను పరిశీలించిన తర్వాత టీడీపీ బెటర్ ఆప్షన్ అని బీజేపీ హైకమాండ్  భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. 


వైఎస్ఆర్‌సీపీ దగ్గరే కానీ కూటమిలో చేరదు.. చేర్చుకోలేరు! 


ప్రస్తుతం ఏపీలో బీజేపీకి.. టీడీపీ కన్నా నమ్మకమైన  మిత్రపక్షం వైఎస్ఆర్‌సీపీ. ఎందుకంటే ..   ఎలాంటి  నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తున్నారు. ప్రధాని మోదీ పని తీరును పొగుడుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఏదో విధమైన ఒత్తిడి కేంద్రంపై తెచ్చేవారు. విభజన హామీలని.. మరొకటని.. ఎప్పుడూ కేంద్రంతో  వివాదాల్లో ఉండేవారు. కానీ వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు చాలా పొలైట్‌గా ఉంటున్నారు. కేంద్రానికి పూర్తి మెజార్టీ ఉన్నందున తాము అడగడం వృధా అన్నట్లుగా ఉన్నారు. ఇది కూడా కేంద్రానికి ఇబ్బంది లేని వైఖరి. అయితే ఇలా అని వైఎస్ఆర్‌సీపీని నమ్మలేని పరిస్థితి బీజేపీకి ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ అధికారిగంా ఎన్డీఏలో చేరదు. ఎందుకంటే ఏపీలో రాజకీయ పరిస్థితులు.. వైఎస్ఆర్‌సీపీకి  బలంగా నిలుస్తున్న వర్గాలు వ్యతిరేకతమవుతాయి. అది రాజకీయంగా ఆత్మహత్యా సదృశం. ఎన్డీఏలో చేరం కానీ ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఇస్తామని ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ చేతల్లో చూపిస్తోంది. కానీ వచ్చే ఎన్నికల తర్వాత నిజంగా వైఎస్ఆర్‌సీపీకే ప్రభుత్వాన్ని నిలబెట్టేంత బలం ఉంటే తమ వెంటే ఉంటుందన్న నమ్మకం బీజేపీ నేతలకే ఉండదు. ఎందుకంటే కూటమిలో లేకపోతే వైఎస్ఆర్‌సీపీకి ఎటు  మేలు జరిగితే అటు వెళ్తుంది. ఇప్పటికే పలుమార్లు..  బీజేపీకి పూర్తి మెజార్టీ  రాకపోతే.. తామేంటో చూపించే వాళ్లమని చెప్పారు కూడా. అదే సమయంలో వైఎస్ఆర్‌సీపీ అధినేతపై ఉన్న అక్రమాస్తుల కేసులు ఇతర ఇబ్బందుల వల్ల బీజేపీ కూడా కూటమిలో చేర్చుకోవడానికి ఆసక్తి  పెద్దగా చూపించడం లేదు. 


టీడీపీనే బెటరని అనుకుంటున్నారా ?


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూటముల్ని సిద్ధం చేయడంలో సిద్ధహస్తుడు. గతంలో  వాజ్ పేయి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి  పార్టీలన్నింటినీ కూడగట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే ఎన్డీఏను ఆయన బలోపేతం చేయగలరని బీజేపీ నమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో కూటమిలో ఉన్న పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తే.. అది కూటమి  బలం అవుతుంది. అందుకే బీజేపీ ప్రాథమికంగా మళ్లీ టీడీపీని ఎన్డీఏలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ రాజకీయం ఇప్పుడు ప్రాథమిక స్థాయిలోనే ఉంది. మౌనం అర్థాంగీకారం అయినట్లుగా రెండు వర్గాలూ సైలెంట్‌గా ఉన్నాయి కాబట్టి.. భవిష్యత్‌లో ఇదే జరుగుతుందని సగం వరకూ అనుకోవచ్చు.