BRS Election Strategy : భారత రాష్ట్ర సమితి విస్తరణలో కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ లో నిర్వహించిన బహిరంగసభలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. మరి అక్కడి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండే అవకాశం లేదు. మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, కర్ణాటకల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. నెలాఖరులో ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్ ఆయా రాష్ట్రాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
నెలాఖరులో ఢిల్లీకి సీఎం కేసీఆర్
జాతీయ స్థాయిలో పార్టీని భారీగా విస్తరించేందుకు పకడ్బందీ ప్రణాళికను రూపొందిస్తున్న భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ జాతీయ స్థాయిలో కలిసి వచ్చే పార్టీలు, సంస్థలను ఏకం చేసే పనిలో ఉన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు, సెక్రటేరియట్ ప్రారంభోత్సవం ముగిసినతర్వాత నాలుగైదు రోజుల పాటు ఢిల్లిలో బీఆర్ఎస్ వ్యవహారాలు చక్కదిద్దాలని అనుకుంటున్నారు. కర్ణాటకలో బీఆర్ఎస్ తో జేడీఎస్ కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. చత్తీస్ ఘడ్‌లో బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయడమా.. లేకపోతే అదే పార్టీ ని లీడ్ చేయడమో చేయడానికి అజిత్ జోగి తనయుడు రెడీగా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో కొన్ని రైతు సంఘాలను బీఆర్ఎస్‌లో విలీనం చేసి రైతులనే పాలకులుగా చేయాలనే పిలుపుతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగే ఆలోచన కేసీఆర్ చేస్తున్టన్లుగా చెబుతున్నారు.
బీఆర్ఎస్ విధానాలపై రాజకీయేతర మేధావులతో కీలక చర్చలు జరిపే చాన్స్
రాష్ట్రాల్లో బహిరంగసభలు పెట్టినా కేసీఆర్ జాతీయ అజెండా ప్రకారమే ప్రసంగిస్తున్నారు. తన అజెండాపై క్లారిటీ ఇచ్చేందుకు జాతీయ స్థాయిలో జల, విద్యుత్, ఆర్థిక, వ్యవసాయ, విద్య తదితర ప్రధాన రంగాలకు సంబంధించిన విధానాల రూపకల్పనకు ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు, నిష్ణాతులు, విశ్రాంత సివిల్ సర్వీసెస్ అధికారులు, వర్సిటీల ఆచార్యులతో ఢిల్లిలో వరుస సమావేశాలు జరిపేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. 17వ తేదీన తెలంగాణ నూతన సచివాలయ భవనాన్ని ప్రారంబించాలని ము#హుర్తాన్ని ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీల కీలక నేతలను సీఎం ఆహ్వానించారు. ఉదయం సచివాలయ భవనం ప్రారంభించిన అనంతరం అతిధులకు ప్రగతిభవన్‌లో కేసీఆర్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది ముగిశాక అక్కడే వారితో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నట్టు భారాస వర్గాలు చెబుతున్నాయి.
కర్ణాటక , ఒడిశా, ఏపీల్లో భారీ బహిరంగసభలకు సన్నాహాలు
నాందేడ్ సభ విజయవంతం కావడంతో ఇంత కన్నా మిన్నగా కర్ణాటక, ఒడిశాలలో బహిరంగ సభల నిర్వహణకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. కర్ణాటకలో త్వరలో జరిగే అసెంబ్లిd ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సభకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసి భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ కర్ణాటకలోనే ఈ సభ ఉండనుంది. గుల్బర్గా లేదా బళ్లారిలలో సభను నిర్వహించాలనుకుంటున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో బహిరంగసభను నిర్వహించాలని ఆ రాష్ట్ర బీఆర్ఎస్ చీఫ్ గిరిధర్ గమాంగ్ ప్రతిపాదించారు. రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించి అదే రోజున సభ ఏర్పాటు చేసేందుకు గమాంగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. రావెల కిషోర్‌బాబు భువనేశ్వర్‌లో మకాం వేసి పార్టీ కార్యాలయం భవన ఎంపిక చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ బహిరంగసభలకు ప్లాన్ చేస్తున్నారు.