KCR Ruling Style :   తెలంగాణలో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి.    ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఆ చుట్టుపక్కన ప్రాంతాల్లో  ప్రళయం వచ్చింది.  ఎంతగా అంటే.. ఊళ్లకు ఊళ్లు నీట మునిగిపోయాయి. ఇప్పుడిప్పుడు బయట పడుతున్న దృశ్యాలు చూస్తే  ఎంత నష్టం జరిగిందో అంచనా వేయడం కష్టం. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల గురించి ఆలోచిస్తున్నారు. యూపీ నుంచి భీమ్ ఆర్మీ అనే దళిత నేత వస్తే చర్చలు జరిపారు. కానీ బాధిత ప్రాంతాల్లో పర్యటించలేదు. కనీసం ఏరియల్ సర్వే కూడా చేయలేదు. అందుకే విపక్షాలు కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వరదల్లో ప్రభుత్వం కూడా కొట్టుకుపోయిందని అంటున్నారు. కేసీఆర్ కేసీఆర్ ఇలాంటి విపత్తులు ఎప్పుడు వచ్చినా హడావుడి చేయరని బీఆర్ఎస్ వర్గాలుచెబుతున్నాయి.  


ముందు జాగ్రత్తలు తీసుకోలేదని ప్రభుత్వంపై విమర్శలు 


తెలంగాణలో భారీ వర్షాలుంటాయని వరదలు రావడానికి నాలుగైదు రోజుల ముందు నుంచే వాతారవణ నిపుణుల నుంచి హెచ్చరికలు వస్తన్నాయి.  కానీ ప్రభుత్వ యంత్రాంగం కనీస జాగ్రత్తలు తీసుకోలేదన్న  విమర్శలు ఉన్నాయి.  కడెం ప్రాజెక్ట్ పొంగిపొర్లుతూంటే ఏమీ చేయలేకపోయారు. జేసీబీతో గేట్లను  బద్దలు కొట్టించారు.  ముఖ్యంగా అత్యంత ఎక్కువగా వర్షాలు పడతాయని.. వరదలు వస్తాయని అంచనా వేసిన ప్రాంతాలకూ కనీస జాగ్రత్తలు చెప్పలేదు. గ్రామస్తులను రక్షించే ప్రయత్నం చేయలేదు. దానికి సాక్ష్యం మోరంచపల్లె గ్రామం.  అందరూ చెట్లు, పుట్టల మీద ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటే ప్రభుత్వం స్పందించడానికి పది గంటలపైనే సమయం పట్టిందన్న విమర్శలు ఉన్నాయి.  చివరికి ఆర్మీ హెలికాఫ్టర్లు వస్తే తప్ప.. చెట్లు, పుట్టల మీద దాక్కున్న వారి ప్రాణాలు కాపాడలేకపోయారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగిన తర్వాత.. ఊపిరి పీల్చుకున్నారు. 


వరంగల్ పర్యటనకు కేటీఆర్ కూడా ఎందుకెళ్లలేదు?
 
వరదలు వచ్చిన రోజున మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో పర్యటించారు. వరదల గురించి, కడెం ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తే.. తనకు అవగాహన లేదని.. తన శాఖ గురించి అడగాలన్నారు.  మరి వరంగల్ పరిస్థితి ఏమిటని అడిగితే.. అవసరం అయితే తాను కూడా వెళ్తానన్నారు. ఏ రకంగా చూసినా విపత్తుల మేనేజ్‌మెంట్‌లో తెలంగాణ సర్కార్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని చూపించిందని ఎక్కువ మంది విమర్శలు చేస్తున్న అంశం. నిజానికి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కేసీఆర్ సర్కార్ నింపాదిగానే  వ్యవహరిస్తోంది. గతంలో హైదరాబాద్  వరదలు వచ్చినప్పుడు అంతే.  కేసీఆర్ ఇలాంటివి జరిగినప్పుడు సహజంగానే ప్రభుత్వాలపై అసంతృప్తి వస్తుందని.. వాటిని  తర్వాత ఎలా డీల్ చేయాలో తనకు తెలుసుని అనుకుంటారని అంటారు. ఎలా అంటే.. ఊహించనంత పరిహారం ప్రకటించడమే. 


ప్రజల అసంతృప్తిని తగ్గించే కిటుకు కేసీఆర్ దగ్గర!  


వరద ముంపులో ప్రజలు తీవ్రంగా నష్టపోయి ఉన్న సమయంలోనే అసెంబ్లీ సమావేశాల ప్రకటన వచ్చింది. 31వ తేదీన కేబినెట్ సమావేశం కానుంది. ఈ లోపు భీమ్ ఆర్మీతో చర్చలు జరిపారు. కొన్ని రాజకీయ పరమైన సమవేశాలు నిర్వహించారు. ఓ వైపు వరదలతో ఊహించనంత నష్టం జరగబోతోందని తెలిస్తే.. వీలైనంత నష్టం తగ్గించడానికి ప్రయత్నించాల్సింది పోయి.. రాజకీయ వ్యూహాల్లో మునిగిపోవడం ఏమిటన్నది అర్థం కాని విషయం. సహాయ కార్యక్రమాల విషయంలోనూ అంత చురుకుదనం లేదన్నది బాధితుల ఆరోపణ. కేసీఆర్ ఇలాంటి ప్రకృతి విపత్తులు, సంక్షోభాలను చాలా చూశారు. అంతా అయిన తర్వాత ఎవరూ ఊహించనంత నష్టపరిహారం ప్రకటించి.. జేజేలు అందుకుంటారు. ఈ సారి కూడా అలాంటి పరిహారమే ప్రకటించవచ్చనని అంటున్నారు. పరిహారం సరే కానీ.. ప్రజల ప్రాణాల సంగతేమిటని.. ఎవరు బాధ్యత వహిస్తారని విపక్షాలు ప్రశ్నిస్తన్నాయి.