కేంద్ర బడ్జెట్ వచ్చింది. మా రాష్ట్రానికేమిచ్చారు..? అని వెదుక్కోవడం కూడా పూర్తయింది. తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చారో చూసుకుని ఆగ్రహంతో కేసీఆర్ రెండున్నర గంటల పాటు ప్రెస్‌మీట్ పెట్టి కేంద్రాన్ని తిట్టిపోశారు. కానీ తెలంగాణ కన్నా ఎక్కువ ఏపీ విషయంలో కేంద్రం నిరాదరణ చూపింది. విభజన చట్టంలో భాగంగా మంజూరు చేసిన సంస్ధలకు అరకొర నిధులు కేటాయించారు. ఇక ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న వాటిలో ఒక్కటంటే ఒక్క దాన్నీ పట్టించుకోలేదు. కానీ అధికార పార్టీ అయిన వైఎస్ఆర్‌సీపీ.. ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం నోరు విప్పలేదు. అభిప్రాయం చెప్పలేదు.
ఏపీ జీవనాడి ఊపిరి ఆపేస్తున్న కేంద్రం.. పైసా కేటాయింపు లేదు !
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించాల్సినవి చాలా ఉన్నాయి. అందులో మొదటిది పోలవరం. ఒక్క రూపాయి కాదు కదా అసలు పోలవరం అనే ప్రస్తావనే బడ్జెట్‌లో రాలేదు. కానీ ఉత్తరప్రదేశ్ - మధ్యప్రదేశ్ రాష్ట్రాలు సంయుక్తంగా కట్టుకుంటున్న ఓ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ. 40వేల కోట్లకుపైగా కేటాయించారు. ఆ మొత్తం పోలవరంకు ఇస్తే ఏపీ సస్యశ్యామలం అవుతుంది. రాయలసీమ పంట పండుతుంది. దశాబ్దాల దరిత్రం పోతుంది. కానీ కేంద్రం శీతకన్నేసింది. ఇంత జరుగుతున్నా వైఎస్ఆర్‌సీపీ కానీ సీఎం జగన్ కానీ నోరు మెదపడం లేదు. పోలవరం.. ఏపీ జీవనాడి అనిఅందరూ అంటారు.. కానీ ఆ జీవనాడికి ఊపిరి ఆడకుండా చేస్తున్నా మాట్లాడలేకపోతున్నారు.
విభజన హామీల్లో వేటీకి న్యాయం జరగలేదు !
పోలవరం అత్యంత ప్రధానమైనది.. అది కాకుండా వెనుకబడిన జిల్లాలకు నిధులు, ప్రత్యేకహోదా, పారిశ్రామిక రాయితీలు, రెవిన్యూ లోటు భర్తీ, రాజధాని కోసం నిధులు, విశాఖ, విజయవాడ మెట్రో రైలుకు నిధులు, కడప ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు, రామయపట్నం పోర్టు, విశాఖ రైల్వే జోన్ ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రం అమలు చేయాల్సిన హామీలు.. ఇవ్వాల్సిన నిధుల జాబితా దండిగానే ఉంది. కానీ బడ్జెట్‌లో వీటి ప్రస్తావన ఎక్కడా లేదు. లేకపోవడం ఒకటి అయితే అసలు ప్రభుత్వం అధికారికంగానో.. రాజకీయంగానే తమ అభిప్రాయం చెప్పి.. ఎంతో కొంత సాయం పొందాలనే ఆలోచన చేయడం లేదు. కేంద్రాన్ని అడిగితే ఏమనుకుంటుందో అన్న మొహమాటంతోనే కాలం గడిపేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారో ప్రజలకూ అర్థం కాని పరిస్థితి.
యుద్ధం ప్రకటించేసిన కేసీఆర్ - మౌనం పాటిస్తున్న సీఎం జగన్ ! ఎందుకిలా?
వైఎస్ఆర్‌సీపీ ఎంపీలకు లీడర్‌గా ఉన్న విజయసాయిరెడ్డి బడ్జెట్ రాష్ట్రానికి సంబంధించినంత వరకూ నిరాశజనకంగా ఉందని ప్రకటించారు. అంత వరకూ బాగానే ఉంది.. కానీ ఆయన కేంద్రం నిబంధనలకు మించి అప్పులు చేస్తోంది.. ఆ చాన్స్ ఏపీకి ఇవ్వడం లేదనే బాధపడ్డారు తప్ప.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం అదేమంత పెద్ద విషయం కాదన్నట్లుగా ఉన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో కొట్లాటకు రెడీ అయింది. పార్లమెంట్‌ను స్తంభింపచేస్తామంటున్నారు. మరి వైఎస్ఆర్‌సీపీ కార్యాచరణ ఏమిటి? రాష్ట్ర ప్రయోజనాల రక్షణకు ఏం చేస్తారు? కనీసం ఓ ఆలోచనైనా ఉందా ?