Telangana Congerss  : తెలంగాణ కాంగ్రెస్ సీట్ల కసరత్తున వేగవంతం చేసింది.  119 అసెంబ్లి నియోజకవర్గాలలో పోటీకి 1220 మంది నేతలు దరఖాస్తు చేసుకోగా ఒక్కో నియోజకవర్గం నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ధీటైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు అవసరమైన కసరత్తును పూర్తి చేసి సంబంధిత జాబితాను సీల్డ్‌ కవర్‌లో ఉంచింది. ఇప్పుడు  స్క్రీనింగ్‌ కమిటీ చర్చించనుంది. అయితే ఇది అంత తేలికగా ముగిసిపోయే ప్రక్రియ కాదని.. అభ్యర్థులపై ఓ అవగాహనకు వచ్చినా.. చివరి వరకూ అంటే షెడ్యూల్ వచ్చే వరకూ ప్రకటించే అవకాశం లేదని భావిస్తున్నారు. 


అత్యధిక నియోజకవర్గాల్లో టిక్కెట్ల కోసం భారీ పోటీ                    


అత్యధిక నియోజకవకర్గాల్లో కాంగ్రెస్ టిక్కెట్ల కోసం భారీ పోటీ ఉంది.  ఐదు, అంతకన్నా ఎక్కువ మంది పోటీ పడుతున్నారు.  ఎంపిక చేసి ఆ జాబితాను స్క్రీనింగ్‌ కమిటీ ముందు ఉంచారు.  అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తును పూర్తి చేసిన నేతలు నియోజకవర్గాల వారీగా ఆశావహుల ప్రాధాన్యతా సంఖ్యలను కేటాయించారు. బాగా బలంగా ఉండి విపక్ష పార్టీల అభ్యర్థులకు ధీటైన వారికి క్రమ సంఖ్య 1ని కేటాయించారు. ఇలా 2, 3 క్రమ సంఖ్యలను నేతల పేర్ల చివర పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల్లో పోటీ కోసం ఎన్నికల కమిటీలోని సభ్యులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. తమకే తుది ప్రాధాన్యతా సంఖ్య కేటాయించాలని కొందరు ఈ సమావేశంలో కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తొలి ప్రాధాన్యతా సంఖ్య కోసం నేతలు కమిటీలోని మిగతా సభ్యుల మద్దతు కోరినట్లు తెలుస్తోంది.


బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని నిర్ణయం                            
 
బీఆర్ఎస్ జాబితాలో రెడ్డి సామాజికవర్గానికి అధిక ప్రాధాన్యం లభించింది. కాంగ్రెస్ బీసీలకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వాలనుకుంటోంది. బీఆర్ఎస్ వెనుకబడిన తరగతులకు ఇచ్చిన సీట్ల కన్నా తమ పార్టీలో ఎక్కువ సీట్లను ఈ వర్గాలకు కేటాయిస్తామని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి  ప్రకటించారు. ఈ మేరకు బలమైనబీసీ అభ్యర్థుల జాబితాను విడిగా పరిశీలన చేస్తున్నారు.  స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు బుధవారం  ప్రత్యేకంగా సమావేశమై ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ ఇచ్చిన నివేదికపై క్షుణ్ణంగా అధ్యయనం చేయనున్నారు.  ఆ తర్వాత ఈ కమిటీ తుది జాబితాను రూపొందించి ఢిల్లిలోని కేంద్ర ఎలక్షన్‌ కమిటీకి నివేదిస్తుంది.  కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తి చేసి పార్టీ ముఖ్యులకు ఈ నివేదిక ఇస్తుందని ఆ తర్వాత తొలి జాబితా ప్రకటన ఉంటుంది.


లిస్ట్ ఖరారైనా సరైన సమయం చూసే ప్రకటన                      
 
వీలైనంత త్వరగా అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటింస్తామని చెబుతున్నారు కానీ.. వ్యూహాత్మకంగా ఆలస్యం చేస్తారని చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా చూసిన తర్వాత కేసీఆర్ కొంత మంది అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని అలాంటి చాన్స్ ఇవ్వకూడదని అనుకుంటున్నారు.  అదే సమయంలో అభ్యర్థులపై ఒత్తిళ్లు రాకుండా చూసుకోవడానికైనా.. లిస్ట్ ను ఆలస్యంగా ప్రకటించాలని అనుకుంటున్నారు. షెడ్యూల్ వచ్చిన తర్వాతనే జాబితా ప్రకటించడం మంచిదన్న అభిప్రాయం టీ కాంగ్రెస్ లో ఎక్కువగా వినిపిస్తోంది.