AP Flexi War :   ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందే పార్టీల మధ్య యుద్దం మొదలైంది. టీడీపీ, జనసేన వర్సస్ అధికార వైఎస్సార్సీపీ మధ్య పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీల వార్ కొనసాగుతోంది. మూడు పార్టీల శ్రేణులు ఫ్లెక్సీల ఏర్పాటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. ఒక పార్టీ పై మరో పార్టీ నినాదాలు..వ్యంగాస్త్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం వివాదానికి కారణం అవుతోంది. పొత్తుల రాజకీయం తేలకముందే ఇప్పుడు వైసీపీ వర్సస్ జనసేన పొలిటికల్ వార్ షురూ అయింది.


పేదలు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ వైసీపీ పోస్టర్లతో వివాదం                               


ఏపీలో కృష్ణా,  పశ్చిమగోదావరి, గుంటూరు, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో ఫ్లెక్సీల వార్ సాగుతోంది. పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం’ పేరుతో రాష్ట్రంలో వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో ప్రతిపక్ష నేతలను కించ పరిచేలా బొమ్మలు ఉండటంతో దుమారం రేగింది.  జనసైనికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని కోరుతూ జనసేన నాయకులు ఆందోళనలు చేస్తున్నారు. ఫ్లెక్సీలు తొలగించాలని, లేదంటే తాము కూడా ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తామంటున్నారు. కొన్ని చోట్ల  జనసేన నాయకులు కూడా   ‘రాక్షస పాలన పోవాలి- నియంతలతో యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది’ అని పేర్కొంటూ ఫ్లెక్సీలు పెట్టారు. దీన్ని గుర్తుతెలియని వ్యక్తులు తొలగించడంతో ఆందోళనకు దిగారు. 


పలు చోట్ల ఫ్లెక్సీల పోరాటం !                               


ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని అనుచరులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా వాటిని జనసేన కార్యకర్తలు చింపివేశారు.మరోవైపు జనసేన ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు తొలగించడంతో ఇరు పార్టీ నేతల మధ్య వివాదం కొనసాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఆదివారం కొన్ని ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పేదలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అడ్డుగా మోకాళ్లపై కూర్చుని.. పెత్తందార్లతో పోరాడుతున్నట్టుగా ఈ ఫ్లెక్సీల్లో ఉంది. వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎదురుగా పల్లకీ మీద టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ ఉండగా.. జనసేన పార్టీ అధినేత పవన కల్యాణ్‌ ఆ పల్లకీని మోస్తున్నట్టుగా చూపించారు. 


టీడీపీ, జనసేన పార్టీలు పెట్టే ఫ్లెక్సీలను తొలగిస్తున్న పోలీసులు                             


టీడీపీ జనసేన పార్టీలు పెట్టే ఫ్లెక్సీలను  పోలీసులు తొలగిస్తున్నారు.   తాము కూడా ప్రజలను మోసం చేస్తున్న జగన్‌ అంటూ సీఎం చిత్రాలతో భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తామని హెచ్చరించి ఆ మేరకు ఫ్లెక్సీలు పెడుతున్నారు.  వైసీపీ ఆధ్వ ర్యంలో ‘పేదలపై పెత్తందారుల యుద్ధం’ అనే ఫ్లెక్సీలు న అన్ని చోట్లా కనిపిస్తున్నాయి.  అధికార పార్టీ వాళ్లకు ఎలాంటి అను మతులు లేకపోయినా అధికారులు కళ్లు మూసుకున్నారు. ఇతర పార్టీలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను క్షణాల్లో తొలగిస్తున్నారు. పోలీసుల తీరుపై మచిలీపట్నంలో టీడీపీ నేతలు మండిపడ్డారు.