తెలంగాణలో  పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ బహు ముఖ వ్యూహాలు అమలు చేస్తోంది. అన్ని వైపుల నుంచి ఒకే సారిగా కమ్ముకొచ్చేందుకు ప్లాన్ రెడీ చేసుకుంది. ఇప్పటికే కొన్ని అంశాల్లో అమలు ప్రారంభమైంది. మరికొన్ని అంశాల్లో రూట్ మ్యాప్ రెడీ అయింది. వచ్చే కొద్ది నెలల్లో ఎటు చూసినా బీజేపీ ఉండేలా వ్యూహం రెడీ అయిపోయింది. టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని ప్రజల దృష్టిలో పడటమే కాదు ఏకంగా వారి అధికార పీఠాన్ని అందుకోవాలని ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు.


టీఆర్ఎస్ అమలు చేయని హామీలపై ఉద్యమం !


తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో  ఇచ్చిన అనేక హామీల్ని నెరవేర్చలేకపోయారు. ముందస్తు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్  రుణమాఫీ పథకం ప్రకటించింది. తరవాత రూ. లక్ష రుణమాఫీ చేస్తామని అదీ ఒకే సారి చేస్తామని ఎన్నికల ప్రచార సభల్లో కేటీఆర్ హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఆ హామీలన్నీ అమలు చేయడం తలకు మించిన భారంగా సర్కార్‌కు మారింది. రూ. లక్ష రుణమాఫీ హామీని ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేకపోయారు. నిరుద్యోగ భృతిని ఇప్పటి వరకూ అమలు చేయలేదు. హుజూరాబాద్ ఎన్నికలకు ముందు  పెన్షన్ల మొత్తం పెంపు ఉత్తర్వులు ఇచ్చారు కానీ అమలుపై సందేహాలు ఉన్నాయి. ఇలాంటి అనేక అంశాలపై ప్రత్యేకంగా ఉద్యమం చేపట్టి ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.


నిరుద్యోగుల మద్దతు కోసం మిలియన్ మార్చ్ !


తెలంగాణ ప్రభుత్వం మీద నిరుద్యోగులకు ఉన్న అసంతృప్తి తక్కువేమీ లేదు. ఉద్యోగాల భర్తీ వారు ఊహించినత స్థాయిలో లేదు. ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు లేవు.. రావట్లేదన్న కారణంగా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. దీంతో నిరుద్యోగుల తరపున పోరాడి వారి మద్దు సాధించేందుకు బీజేపీ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గత ఏడాది నవంబర్‌లోనే రెండు సార్లు మిలియన్ మార్చ్ నిర్వహించాలని ప్రయత్నించారు కానీ వివిధ కారణాలతో వాయాా వేసుకోవాల్సి వచ్చింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని.. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని నిరుద్యోగులతో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నారు.  తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై పోరాటానికి బీజేపీ అదే మిలియన్ మార్చ్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.


 
రిజర్వుడ్ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి !


తెలంగాణలో రిజర్వుడ్ నియోజకవర్గాలపై బీజేపీ అగ్రనేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తెలంగాణలో 19 ఎస్సీ , 12  ఎస్టీ రిజర్వ్‌డ్‌ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తంగా 31 స్థానాలపై బీజేపీ రాష్ట్ర అధిష్టానం ఫోకస్​పెట్టింది. దీనికోసం సీనియర్​నాయకులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. దళితులను సీఎం చేస్తానని మోసం చేయడం.. మూడెకరాల భూమి ఇస్తామని ఇవ్వకుండా కాలం వెళ్లదీయడం, డబుల్​బెడ్రూం ఇండ్లు, దళిత బంధు కింద రూ.10 లక్షలు వంటివి ఏవీ అమలు చేయడం లేదని.. దీన్నే బీజేపీ ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. టీఆర్ఎస్​హయాంలో దళిత, గిరిజన వర్గాల ప్రజలపై అణిచివేత వల్ల తీవ్ర వ్యతిరేకత ఉందని బీజేపీ భావిస్తోంది.  ఈ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా సర్వే నిర్వహించి.. గెలుపు కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.


అసెంబ్లీ బరిలోకి సీనియర్లు !


ఇక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే తమకు ప్రతిష్టాత్మకం అని నిరూపించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తాను ఆర్మూర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చే ఎన్నికల్లో  వేములవాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారు. ఎంపీ ఎన్నికల్లో వేములవాడ నుంచే అత్యధిక ఓట్లు వచ్చాయి. కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి చూపు అసెంబ్లీపైనే ఉంది. వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న కిషన్ రెడ్డి గత ముందస్తు ఎన్నిల్లో మాత్రం పరాజయం పాలయ్యారు. ఆ వెంటనే ఎంపీగా గెలిచారు.  ఆదిలాబాద్ఎంపీ సోయం బాపూరావు కూడా  ఆసిఫాబాద్ ఏరియాల్లో ఆదివాసీల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచే బరిలోకి దిగాలనే యోచనలో ఆయన ఉన్నారు.  మిగతా ముఖ్య నేతలు కూడా అసెంబ్లీకే పోటీ చేయనున్నారు.


రాజకీయంగా టీఆర్ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసే ప్లాన్ !


ఓ వైపు రాజకీయ కార్యకలాపాలు.. ఆందోళనలతో  ప్రజల్లోకి వెళ్లడమే కాకుండా మరో వైపు టీఆర్ఎస్‌ను అవినీతి ఆరోపణలు.. విచారణలతో ఉక్కిరిబిక్కిరి చేసేందుకు బీజేపీ రెడీ అవుతోంది. తెలంగాణలో జరిగిన వందల కోట్ల అవినీతిపై కేంద్రానికి సమాచారం ఉందని.. ఎప్పుడైనా విచారణలు ప్రారంభమవుతాయన్న ప్రచారం కొన్నాళ్లుగా ఉంది. వాటికి సంబంధించి త్వరలోనే కార్యాచరణ ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఓ ఐఏఎస్ అధికారి తన కుమార్తె పెళ్లి ఖర్చుమొత్తాన్ని ఓ బడా కాంట్రాక్టర్ చేత పెట్టించారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ కంట్రాక్టర్ గుట్టు బయటకు తీస్తే చాలాని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అదే ప్లాన్ రెడీ అయితే మాత్రం..బీజేపీ ప్లాన్లు చాలా పకడ్బందీగా ఉన్నట్లే అనుకోవాలి.