విజయవాడ బాలిక సూసైడ్ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. వినోద్ జైన్ అనే వ్యక్తి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నానని బాలిక సూసైడ్ లెటర్ లో రాసింది. అయితే వినోద్ జైన్ టీడీపీలో ఉన్నారు. దీంతో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. టీడీపీ నేతలు మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ నారీ సంకల్ప దీక్ష ఎలా చేస్తారని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. వినోద్ జైన్ చంద్రబాబు, లోకేశ్, కేశినేని నానితో ఉన్న ఫొటోలను వైసీపీ నేతలు బయటపెట్టారు. టీడీపీ నేతల నుంచి మహిళలు, బాలికలను రక్షించాలని విజయవాడ బాలిక మృతికి సంఘీభావంగా విజయవాడలో ర్యాలీ కూడా చేశారు వైసీపీ నేతలు. అయితే టీడీపీ కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చింది. వినోద్ జైన్ మంత్రి వెల్లంపల్లి శిష్యుడని, మా దగ్గర ఫొటోలు ఉన్నాయని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఎమ్మెల్యే రోజాకు జబర్దస్త్ షూటింగ్ లేదనుకుంటా అందుకే విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
టీడీపీపై రోజా ఫైర్
వినోద్ జైన్ వేధింపులు తాళలేక 14 ఏళ్ల బాలిక సూసైడ్ చేసుకుందని వింటుంటే చాలా బాధగా ఉందని నగిరి ఎమ్మెల్యే ఆర్.కె రోజా అన్నారు. ఈ సందర్భంగా ఆర్.కె రోజా మాట్లాడుతూ.. 60 ఏళ్లకు పైబడి, ప్రజాప్రతినిధిగా పోటీ చేసిన వ్యక్తి 14 ఏళ్ల బిడ్డని తండ్రిలా చూడాల్సింది పోయి ఇలా వేధించడం చాలా దారుణమన్నారు. ఇటువంటి రాక్షసులకు బుద్ధి చెప్పే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయాలని మహిళా లోకానికి ఆర్.కె రోజా పిలుపు నిచ్చారు. చంద్రబాబు హయాంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ పేరుతో ఎంతో మంది మహిళలను వ్యభిచార కూపంలోకి దించారో కళ్లారా చూశామని ఆరోపణలు చేశారు. ఎమ్మార్వో వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టారని, చదువుల తల్లి రిషితేశ్వరి పొట్టన పెట్టుకున్నారని, ఇవి అడిగిన తనను రూల్స్ కు విరుద్ధంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. అలాంటి వాళ్లు రేపు నారీ సంకల్ప దీక్ష చేయడం చూస్తే సిగ్గు పడాలని, ఏ మొహం పెట్టుకొని దీక్ష చేస్తారని ఆమె ప్రశ్నించారు. నిజంగా టీడీపీ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే సూసైడ్ చేసుకుని చనిపోయిన బాలిక ఇంటి ముందు కూర్చుని చేయండని, అప్పుడు తెలుస్తుందని ఎవరు దొంగలని సవాల్ విసిరిన అర్ధం అవుతుందన్నారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగనన్న మహిళా భద్రత కోసం దిశ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చామన్నారు. దిశ యాప్ తీసుకువచ్చి ఎవరైనా మెసేజ్ చేస్తే అయిదు నిమిషాల్లో అక్కడికి వచ్చి రక్షణ కల్పించిన దాఖలాలు ఎన్నో చూశామన్నారు. కనీసం ఆ అమ్మాయి దిశ యాప్ కి ఒక మెసేజ్ చేసి ఉన్నా ప్రాణాలతో నిలిచేవన్నారు. మహిళలందరు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే దిశ యాప్ కు మెసేజ్ చేసి పోలీసులకు సమస్య చెప్పి తప్పు చేసిన వారికి శిక్షపడేలా చేయాలన్నారు. కానీ మీరు ఇలా భయపడి పోయే డిప్రెషన్లోకి వెళ్లి సూసైడ్ చేసుకుంటే మీ కుటుంబం ఎంత కుంగిపోతుందో ఒక్కసారి ఆలోచించండని మహిళా లోకానికి రోజా పిలుపు నిచ్చారు.
వంగలపూడి అనిత కౌంటర్
వైసీపీ నేతలు విమర్శలపై టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు స్పందించారు. బాలిక సూసైడ్ ను వైసీపీ రాజకీయాలకు వాడుకుంటుందని విమర్శించారు. బాలిక కుటుంబాన్ని ఒదార్చడం పోయి ఈ వ్యవహారంలోకి చంద్రబాబు, లోకేశ్ ను లాగేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వినోద్ జైన్ వెల్లంపల్లి శ్రీనివాస్ శిష్యుడని, ఆ ఫొటోలు తమ దగ్గర ఉన్నాయన్నారు. ఆ ఫొటోలు టీడీపీ కూడా సోషల్ మీడియా విడుదల చేయగలదన్నారు. టీడీపీ రేపు నారీ సంకల్ప దీక్ష ప్రారంభిస్తున్న అనిత... ఈ సమయంలో వైసీపీ నేతలు బయటకు రావటం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే రోజాకు జబర్దస్త్ డేట్స్ లేవనుకుంటా అందుకు టీడీపీపై విమర్శలు చేస్తున్నారని అనిత అన్నారు. విజయవాడ ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. బాలిక సూసైడ్ బాధాకరం అన్నారు. నిందితుడు వినోద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని ప్రకటించారు.