టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో గట్టిగా పోరాడాలని సీఎం కేసీఆర్‌ టీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో కేసీఆర్ చర్చించారు. పార్లమెంట్‌లో తెలంగాణ వాణి వినిపించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ అంశాలతోపాటు, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ నివేదికను ఎంపీలకు అందించారు. తెలంగాణకు కేంద్రం చేసిందేం లేదన్న కేసీఆర్ న్యాయపరంగా రావాల్సిన వాటిని కూడా కేంద్రం ఇవ్వలేదని సీఎం అన్నారు. కేంద్ర బడ్జెట్‌ అనంతరం అందుకు స్పందిస్తామని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. ఎంపీలకు 23 అంశాలతో కూడిన నివేదికను సీఎం కేసీఆర్ ఇచ్చారు. విభజన చట్టంలోని హామీలపై ఎక్కువగా దృష్టి సారిస్తామని ఎంపీలు అన్నారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయించింది. ఈ ప్రసంగం వల్ల ఏం ఉపయోగంలేదని సీఎం కేసీఆర్ అన్నారు. సింగరేణి కోల్ బ్లాక్ లపై ప్రశ్నించాలని సీఎం సూచించారు. టీఆర్ఎస్ ప్రశ్నిస్తే దేశం దద్దరిల్లుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాలకు టీఆర్ఎస్ ఎంపీలు హాజరు కానున్నారు. 


కేంద్రంపై మరోసారి పోరాటానికి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సమావేశాలను వేదికగా మార్చుకోబోతుంది. బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం వైఖరిని ఎండగట్టాలని గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఇవాళ పార్టీ ఎంపీలకు కీలక సూచనలు, దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో లోక్ సభ, రాజ్య సభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. రాష్ట్రంలో అమలు కావాల్సిన పెండింగ్ అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సహా సాధించాల్సిన పెండింగ్ సమస్యలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ వాణిని ఉభయ సభల్లో గట్టిగా వినిపించాలని ఎంపీలకు సూచించనున్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లో వరి ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 


ఈ సమావేశంలో రాజ్యసభలో టీఆర్ఎస్ పార్టీ పక్షనేత కె.కేశవరావు, లోక్ సభ లో టీఆర్ఎస్ పార్టీ పక్షనేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మికాంత రావు, కె.ఆర్.సురేష్ రెడ్డి, జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, లోక్ సభ సభ్యులు బి.బి.పాటిల్, పి.రాములు, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేత, మాలోత్ కవితా నాయక్, కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు