Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఎత్తుగడతో అసెంబ్లీ ఎన్నికలతో బరిలోకి దిగుతోందా..? ‘వృద్ధ కాంగ్రెస్’ అన్న అపప్రదను తొలగించుకుని యువనాయకత్వానికి జై కొడుతుందా..? వయసు మళ్లిన నాయకులను ఇంట్లోనే కూర్చోబెట్టి వారి వారసులతో ఎన్నికల సంగ్రామంలో దూకుతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. త్వరలో జరుగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ‘సీనియర్ నాయకుల’ను కాదని వారి వారసులను కాంగ్రెస్ రంగంలోకి దింపుతున్నది. ఇదే సమయంలో గడిచిన నాలుగు దశాబ్దాలుగా పార్టీలో చక్రం తిప్పుతున్న సీనియర్ నాయకుల కథ కూడా ముగిసినట్టే కనిపిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కీలక నేతలుగా ఉన్న రాజకీయ దురంధరులు జానారెడ్డి, గీతారెడ్డి, రేణుకా చౌదరి, వి. హనుమంతరావు, జి.నిరంజన్ వంటి పలువురు నాయకులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోకపొవడంతో వీరి రాజకీయ భవిష్యత్‌కు శుభం కార్డు పడ్డట్టేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటికి ముగిసిన ఈ ప్రక్రియలో 119 నియోజకవర్గాల నుంచి సుమారు వెయ్యికి పైగా అభ్యర్థులు టికెట్ కోసం ఆశిస్తూ దరఖాస్తులు సమర్పించారు. కానీ జానారెడ్డి, హనుమంతరావు, గీతారెడ్డి, రేణుకా చౌదరి వంటి నాయకులు దరఖాస్తులు సమర్పించలేదు.
జానారెడ్డి వారసులకే జై..
ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ వచ్చినాక 2014లో కూడా ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2018లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఓడిపోయిన ఆయన 2020 ఉప ఎన్నికలలో కూడా ఓటమిపాలయ్యారు. అప్పట్నుంచి ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు. 1978 నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి.. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలలో మంత్రిగా కూడా పనిచేశారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నా నాగార్జునసాగర్, మిర్యాలగూడ లలో ఆయనకు మంచిపట్టుంది. దీంతో ఆయన వారసత్వాన్ని కుమారులకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. 2020 ఉపఎన్నికలలో ఓటమి తర్వాత జైవీర్ రెడ్డి.. ఇక్కడే మకాం వేసి ప్రజలతో మమేకమవుతున్నారు.
బరిలో లేని గీతారెడ్డి..
ఉమ్మడి మెదక్ జిల్లాలో కీలకనేత అయిన గీతారెడ్డి కూడా ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. గతంలో జహీరాబాద్, గజ్వేల్ నుంచి గెలిచిన ఆమె.. వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. 2014లో జహీరాబాద్ నుంచి గెలిచిన ఆమె.. 2018లో ఇదే నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్ లోని కంటోన్మెంట్ నుంచి ఆమె పోటీ చేస్తారని వార్తలు వచ్చినా ఆమె అసలు పోటీలోనే లేరు.
హన్మంతన్న కూడా..
కాంగ్రెస్‌లో నాటి ఇందిరాగాంధీ కాలం నుంచి నేటి రాహుల్ గాంధీ వరకూ ఆ పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న వి. హనుమంతరావు కూడా ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేశారు. ఆది నుంచి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని విమర్శిస్తున్న ఆయన.. గతంలో అంబార్‌పేట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. హైదరాబాద్ వాసులు హన్మంతన్న అని ముద్దుగా పిలుచుకునే ఆయన రాజకీయ జీవితానికి దాదాపు ఎండ్ కార్డ్ పడ్డట్టే..
ఫైర్ బ్రాండ్ జాడేది..?
ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపుపొందిన ‘ఫైర్ బ్రాండ్’ రేణుకా చౌదరి కూడా రాబోయే ఎన్నికలలో పోటీ చేసేందుకు విముఖంగానే ఉన్నారు. ఆమె కూడా ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకోలేదు. 1984లో తెలుగుదేశం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1998లో కాంగ్రెస్‌లో చేరిన ఆమె.. ఇటీవల ఖమ్మం మన్యం ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీంతో ఆమె అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ఊహాగానాలూ వినిపించాయి. కానీ ఆమె కూడా అసెంబ్లీకి దూరంగానే ఉన్నారు.
వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, టీపీసీసీ ఎఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ జి. నిరంజన్ కూడా పోటీకి దూరంగా ఉన్నారు. వీరితో పాటు మరికొందరు సీనియర్ నాయకులు కూడా తమ వారసులకు టికెట్లు ఇప్పించుకుంటూ ప్రత్యక్ష రాజకీయాల నుంచి క్రమంగా దూరమవుతున్నారు.