BRS MLA Mallareddy: మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి(Ex-minister Mallareddy) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.  ఈ రోజు మల్లారెడ్డి అసెంబ్లీ లాబీ(Assembly Lobby)ల్లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు.  తాను కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు  సిద్ధం అంటూ బహిరంగంగానే ప్రకటించారు. అయితే, ఇక్కడే ఆయనో చిన్న కండీషన్ పెట్టారు. ఆ కండీషన్‌కు అంగీకరిస్తేనే కాంగ్రెస్‌లో చేరుతానని.. లేదంటే చేరేది లేదన్నట్లు ప్రకటించారు. మరి ఇంతకీ మల్లారెడ్డి పెట్టిన కండిషన్ ఏంటి? ఇంతకీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. మల్లారెడ్డిని కాంగ్రెస్‌లోకి రానిస్తారా? అనేది హాట్ టాపిక్ అయింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  బీఆర్‌ఎస్‌ ముచ్చటగా మూడోసారి గెలిస్తే తాను వేరే లెవల్ లో ఉండేవాడినంటూ ఆయన చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తాను హోం మంత్రి(Home Minister)ని అయ్యేవాడినన్నారు. దీంతో పాటు ఏడాదికి నాలుగు సినిమాలు తీసే వాడినని ప్రకటించారు. అంతేకాకుండా కొత్త శాటిలైట్ ఛానల్‌ కూడా పెట్టేవాడినని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో హెం మంత్రి పదవి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉందన్నారు.


హోం మంత్రి పదవి ఇస్తే వస్తా 
తనకు హోం మినిస్టర్ పోస్ట్ ఇస్తే  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. మరి ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరిస్తారా? అని కూడా మల్లారెడ్డి సందేహం వ్యక్తం చేశారు. వందశాతం సీఎం రేవంత్ రెడ్డి తనను కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వడని కూడా స్పష్టం చేశారు. తనను పార్టీలో చేర్చుకునే మధ్యవర్తిత్వం చేయాలని ఆయన జర్నలిస్టులను కోరారు. హోంమంత్రి పదవి ఇచ్చేటట్లు సీఎం రేవంత్ తో మాట్లాడాలని జర్నలిస్టులను మల్లారెడ్డి కోరారు.  దేశంలో విద్యాసంస్థల నిర్వహణలో తానే నంబర్.1 అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.. అసెంబ్లీలోనూ తాను పెద్దగా ఇన్వాల్వ్ కావడం లేదన్నారు. అధికార పక్షం వాళ్లు కూడా తనను రెచ్చగొట్టడం లేదన్నారు. అందుకే సైలెంట్ గా ఉంటున్నానన్నారు. తనపై ఎవరైనా కామంట్ చేస్తే ధీటైనా సమాధానం చెప్పడానికి రెడీ అన్నారు మల్లారెడ్డి. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు చాలా చక్కగా మాట్లాడుతున్నారని పొగిడారు.  యువ ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీలో పెరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని మల్లారెడ్డి వ్యక్తం చేశారు. ఇటీవల తన నివాసంపై జరిగిన ఐటీ దాడుల్లో ఏమీ దొరకలేదన్నారు. దీంతో ఆ అధికారులే షాక్ అయ్యారని చెప్పారు. బీఆర్ఎస్ ను వీడి వెళ్లి పోయిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో సంతోషంగా లేరన్నారు. వారంతా తిరిగి వాస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.


మళ్లీ కేసీఆర్ సీఎం కావాలె
తమ పార్టీ నేతలను పొగుడుతూ… ఇతర పార్టీల నాయకులపై సెటైర్లు విసురుతూ… నవ్వుల పువ్వులు పూయించారు మల్లారెడ్డి.  కాళేశ్వరం వెళ్లినప్పుడు ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు కదా.. దేవుణ్ని ఏమని కోరుకున్నారని అడిగిన ప్రశ్నకు.. వచ్చేసారి బీఆర్‌ఎస్‌ గెలవాలి, కేటీఆర్‌ సీఎంగావాలె.. నేను హోం మినిష్టర్‌ కావాలె అని కోరుకున్నానని మల్లారెడ్డి ఆన్సర్‌తో జర్నలిస్టులు తెగ నవ్వేశారు. 


వాస్తవానికి రేవంత్‌ రెడ్డికి, మల్లారెడ్డి కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. మల్లారెడ్డికి తగిలిన షాక్‌లు అన్నీ ఇన్నీ కావు. ఆయన కాలేజీల మీద, ఆయన మీద కేసులు.. దెబ్బకు సైలెంట్ అయిపోయారు. ఐతే కాంగ్రెస్ పార్టీలో వరుసగా బీఆర్ఎస్ నాయకుల చేరికల వ్యవహారం..   తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న వేళ.. అసెంబ్లీ చిట్‌చాట్‌లో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. నిజానికి ఎప్పటి నుంచో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు తగ్గట్లుగానే మల్లారెడ్డి ప్రవర్తన కూడా ఉంటూ వస్తుంది. ఏనాడూ ఆయన ఈ వార్తలను ఖండించిన దాఖలాల్లేవు.