Superstition in Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై జరగాల్సిన చర్చ కాస్తా మంత్రాలు, క్షుద్రపూజలు, ఆఘోరాల వైపు మళ్లింది. ఒకరిపై ఒకరు చేతబడులు చేయించుకుంటున్నారంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడం రాజకీయ స్థాయిని దిగజార్చుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడే క్రమంలో.. బీఆర్ఎస్ నేతలు తమిళనాడు, కర్ణాటకలకు వెళ్లి ఆఘోరా పూజలు చేయించారని, వర్షాలు పడకుండా, ప్రజలు ఇబ్బందిపడి ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలని క్షుద్ర పూజలు జరిపించారని ఆరోపించారు. అంతకుముందు కూడా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుపై వర్షాలు పడకుండా క్షుద్ర పూజలు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత నమ్మకాలతో పూజలు, యజ్ఞాలు చేసుకోవడం వేరు. కానీ, ఎదుటివారిని నాశనం చేసేందుకు దుష్టశక్తులను ఆవాహన చేస్తున్నారంటూ పాలకులు, విపక్షాలు పరస్పరం ఆరోపించుకోవడం నేటి ఆధునిక డిజిటల్ యుగంలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ప్రజల్లోని అజ్ఞానాన్ని పొలిటికల్ అస్త్రంగా మార్చడం
తెలంగాణ సమాజంలో గ్రామీణ స్థాయిలో చేతబడి , చిల్లంగి , క్షుద్రపూజలు అనే మూఢనమ్మకాలు ఇప్పటికీ కొన్ని వర్గాల్లో బలంగా ఉన్నాయి. రాజకీయ నేతలు తెలిసో తెలియకో ఇటువంటి మాటలు మాట్లాడటం వల్ల ప్రజల్లో ఉన్న ఈ అపోహలకు మరింత బలం చేకూరుతుంది. ప్రభుత్వ వైఫల్యాల వల్ల వర్షాలు పడలేదా? లేక క్షుద్రపూజల వల్లేనా అనే పిచ్చి చర్చలోకి సామాన్యులను నెట్టడం ద్వారా, నిజమైన సమస్యలైన నిరుద్యోగం, రుణమాఫీ, మౌలిక వసతుల వివాదాల నుండి ప్రజల దృష్టిని మళ్లించవచ్చనేది రాజకీయనాయకుల అంతర్గత వ్యూహంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంటుంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు నిరాధారమైన చేతబడి ఆరోపణలు చేయడం వల్ల క్షేత్రస్థాయిలో మూఢనమ్మకాల నెపంతో జరిగే దాడులు, దాడుల్లో అమాయకులు బలయ్యే ఘటనలు పెరిగే ముప్పు ఉంది. ఒక వైపు శాస్త్రసాంకేతిక రంగాల్లో డిజిటల్ విప్లవంతో దూసుకుపోతున్న తెలంగాణకు, మరోవైపు రాజకీయ నాయకుల ఇటువంటి ప్రచారాలు ప్రతిబంధకంగా మారుతాయి.
అభివృద్ధి రాజకీయం కనుమరుగవుతోందా?
తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా అభివృద్ధి ఫలాలు, పాలనా విధానాల ఆధారంగా ఓట్లు అడిగే సంస్కృతి కాకుండా, దుష్టశక్తులు-అదృష్టం అనే భావజాలంతో ఓటర్లను ప్రభావితం చేయాలనుకోవడం రాజకీయ పార్టీల నైతిక దిగజారుడుతనానికి నిదర్శనం. ఎన్నికల్లో నెగ్గేందుకు భావోద్వేగాలను, భయాలను ఆసరాగా చేసుకుంటున్న పార్టీలు.. ప్రజల నిజమైన అవసరాలను పక్కన పెడుతున్నాయనడానికి ఈ సంఘటనలే ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణ ఓటర్లు ఇలాంటి చౌకబారు ప్రచారాలను, మూఢనమ్మకాల రాజకీయాలను ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది. పాలకులు చేస్తున్న అభివృద్ధి, ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రజాసమస్యలపైనే చర్చ జరగాలి తప్ప, ఈ చేతబడులు - ఆఘోరాల ఆరోపణలతో ప్రజాస్వామ్య వ్యవస్థను పల్చన చేయకూడదు. నేతలు తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సమాజాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతారని అంటున్నారు.
