Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్‌లో ఇప్పుడు స్వపక్షంలోనే విమర్శల పర్వం మొదలైంది. ఒకవైపు ప్రభుత్వం తన పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు సీనియర్ నేతల మధ్య మొదలైన మాటల యుద్ధం గాంధీ భవన్‌లో సెగలు పుట్టిస్తోంది. మనుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దానికి ప్రతిగా తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన కౌంటర్లు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారాయి.
రాజగోపాల్ అసంతృప్తికి కారణమేంటి?
చాలా కాలంగా వివిధ వేదికలపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్‌లో కాక రేపుతున్నాయి. సమయం చిక్కినప్పుడల్లా తనకు మంత్రి కావాలనో, లేదా కాంగ్రెస్‌లో సీనియర్లకు గుర్తింపు లేదనో మాట్లాడుతూ వార్తల్లో ఉంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాను ముమ్మాటికీ కాంగ్రెస్ సైనికుడినే అని, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పని చేస్తానని చెబుతూనే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. పార్టీతో ఏ మాత్రం సంబంధం లేదని వారు ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నారని, ఏళ్ల తరబడి జెండా మోసిన అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు, పాత కాంగ్రెస్ శ్రేణులను అణచివేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి నిధులు ఆంధ్ర కాంట్రాక్టర్లకే దక్కుతుందని, సీమాంధ్ర పాలకుల మీడియా చేతుల్లో ప్రభుత్వం ఉండకూడదని ఆయన సూటిగా విమర్శించారు. పేదల ఇందిరమ్మ ఇళ్లకు వందల కొద్దీ కొర్రీలు పెడుతున్నారని, అదే సమయంలో బడా ప్రాజెక్టుల పేరుతో దోపిడీ జరుగుతోందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎందుకు ఈ వివాదం?
చాలా కాలంగా మంత్రి పదవి కోసం చాలా కాలంగా రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరగనుంది. అందుకే తన వాక్ స్పీడ్ పెంచారని పార్టీలో గట్టిగా వినిపిస్తుంది. ఈసారి మంత్రివర్గంలో తన పేరు కచ్చితంగా ఉండాలనే వ్యూహాత్మక ఒత్తిడి పెంచుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే టైంలో తన జిల్లా రాజకీయాల్లో తగ్గుతున్న ప్రాధాన్యతను ఆయన ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ సీరియస్ వార్నింగ్!
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎవరినైనా సహించేది లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి నుంచి సామాన్య కార్యకర్త వరకు అందరికీ ఒకే రూల్ బుక్ వర్తిస్తుందని, ఎవరూ పార్టీ కంటే పెద్దవారు కాదని ఆయన స్పష్టం చేశారు.
ఎక్కడా నేరుగా రాజగోపాల్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. ఆయన చెప్పిన అభిప్రాయం సరైందేనని కానీ, హద్దులు దాటి మాట్లాడటం సరికాదని అన్నారు. మంత్రిపదవులు, లేదా ఇతర పదవులపై తుది నిర్ణయం హైకమాండ్‌దేనని, అందరి కోరికలను ఒకేసారి తీర్చడం ఎవరికీ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీకి లేదా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన సంకేతాలు ఇచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పాత కాంగ్రెస్, కొత్తగా వచ్చిన వారు మధ్య ఒక కోల్డ్‌వార్ నడుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వారికి సరైన గుర్తింపు దక్కం లేదనే భావన కొంతమంది సీనియర్లలో ఉంది. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా తెలంగాణ ఆత్మగౌరవ కార్డును బయటకు తీశారని మరికొందరు ఆరోపిస్తున్నారు.
