Revanth Reddy Internal Opposition: కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకుంటూ ఉంటారు. అసంతృప్తి ప్రకటనలు చేసే వారికి ఈ పేరు పెట్టుకున్నారు. ఇప్పుడీ కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం హద్దులు దాటి పోతోంది. రాజగోపాల్ రెడ్డి నిరంతరం వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారు. అనిరుధ్ రెడ్డితో పాటు ఇటీవల చిన్నారెడ్డి కూడా అదే చేశారు. తాజాగా సుస్మితా పటేల్ సంచలనం సృష్టించారు. 

Continues below advertisement

సీఎంనూ లెక్క చేయని సుస్మితా పటేల్  రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని చేసిన ఘాటు వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర రాజకీయ కలకలాన్ని రేపాయి. సీఎం రేవంత్‌కు పార్టీ సిద్ధాంతాలు ఇంకా వంటబట్టలేదని, కాంగ్రెస్ క్రమంగా  టీడీపీ కాంగ్రెస్ గా మారుతోందని ఆరోపిస్తూ ఆమె నేరుగా తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం కాంగ్రెస్ కేడర్‌ను షాక్‌కు గురిచేసింది. వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగిన ఒక కార్యక్రమంలో కొండా సుస్మిత మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో పరకాల అసెంబ్లీ టికెట్ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.  మాకు టికెట్ నిరాకరించడానికి అసలు రేవంత్ రెడ్డి ఎవరు? టికెట్ల కేటాయింపు అధిష్టానం పరిధిలోని అంశం అని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో పరకాల నుంచి తాను స్వతంత్రంగానైనా పోటీ చేసి గెలిచి తీరుతానని సవాల్ విసిరారు. ఆనాడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావాలని మొదట కోరింది కొండా దంపతులేనని గుర్తుచేస్తూ, కొడంగుల్ లో ఓడిపోయిన విషయాన్ని సీఎం మరిచి పోవద్దంటూ అత్యంత ఘాటైన స్వరంతో విమర్శలు గుప్పించారు.

ధిక్కార నేతల సంఖ్య క్రమంగా పెరుగుతున్న వైనం 

Continues below advertisement

ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఏ స్థాయికి చేరిందో స్పష్టంచేస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, చిన్నారెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి వంటి కీలక నేతలు ఇదివరకే వేర్వేరు సందర్భాల్లో తమ అసంతృప్తిని వెళ్లగక్కగా, ఇప్పుడు కొండా సురేఖ కుటుంబం నేరుగా సీఎంపైనే విమర్శల బాణాలు విసరడం శాసనసభా పక్షంలో సంచలనంగా మారింది. పార్టీలోని పాత కాంగ్రెస్ నేతలు, బీసీ నాయకులను పక్కనబెట్టి, వలస నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన ఈ వరుస తిరుగుబాట్లకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఏమీ చేయలేకపోతున్న క్రమశిక్షణా కమిటీ

మరోవైపు పీసీసీ క్రమశిక్షణా కమిటీ ,  పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్  నిస్సహాయంగా  మారిపోయారు.  బహిరంగంగా పార్టీ సిద్ధాంతాలను, ముఖ్యమంత్రి నిర్ణయాలను ప్రశ్నిస్తున్న నేతలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేకపోవడం పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రతిబింబిస్తోంది. రాబోయే రోజుల్లో క్రమశిక్షణ తప్పితే చర్యలు ఉంటాయని ఎంపీ మల్లు రవి వంటి నేతలు ప్రకటనలు ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అసమ్మతి నేతలను అదుపు చేయడంలో గాంధీ భవన్ నాయకత్వం పూర్తిగా వెనుకబడి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనాపరమైన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నప్పటికీ, సొంత కేబినెట్ సహచరుల కుటుంబాల నుంచే వస్తున్న ఈ రకమైన తీవ్రమైన విమర్శలు ప్రభుత్వ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట సాగుతున్న ఈ ఘర్షణ వాతావరణం, ప్రతిపక్షాలైన బిఆర్ఎస్, బిజెపిలకు రాజకీయ ఆయుధంగా మారుతోంది. అధిష్టానం తక్షణమే జోక్యం చేసుకుని పార్టీలోని అంతర్గత పోరుకు చెక్ పెట్టకపోతే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ స్థిరత్వానికి మరియు క్రెడిబిలిటీకి పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉంది.