Telangana Congress Government Image:   తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవిలో ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చుట్టూ ముసురుకుంటున్న వరుస వివాదాలు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంత్రాంగానికి పెద్ద పరిపాలనా, రాజకీయ సవాలుగా పరిణమించాయి. ప్రభుత్వంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తారనే పేరున్న పొంగులేటి, శాఖాపరమైన నిర్ణయాల్లో దొర్లిన తప్పిదాలు , వ్యక్తిగత, కుటుంబ వ్యాపార ఆరోపణల కారణంగా నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. పరిపాలనాపరంగా ఇప్పటికే సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ, స్వయంగా కీలక మంత్రి వివాదాల్లో చిక్కుకోవడం ప్రభుత్వాన్ని ప్రతిపక్షాల దాడికి సులభమైన లక్ష్యంగా మారుస్తోంది.

Continues below advertisement

సెక్షన్ 22-ఎలో పొంగులేటికే కాదు ప్రభుత్వానికీ సమస్యలు

సమస్యల్లో అత్యంత తీవ్రమైనది రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్ 22-ఎ వివాదం. హైదరాబాద్ పరిసర జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డిల్లో పదిలక్షలకు పైగా ప్రైవేటు ఆస్తులు, అపార్ట్‌మెంట్లు అధికారులు రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలోకి చేర్చడంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సాధారణంగా రెవెన్యూ శాఖలోని సమస్యలను పరిష్కరించి పౌరులకు ఉపశమనం అందించాల్సి ఉండగా, ఈ కొత్త  22-ఎ ల్యాండ్ లాకింగ్ సమస్య దశాబ్దాల తరబడి ఉన్న ఇళ్లను కూడా వివాదంలోకి నెట్టింది. తీవ్ర నిరసనల అనంతరం మంత్రి పొంగులేటి బహిరంగ క్షమాపణలు చెప్పి, అధికారులపై తప్పు తోసేసి, టోల్‌ఫ్రీ నంబర్లు పెట్టినా.. నాటకీయమైన ఈ పరిణామాలు రేవంత్ ప్రభుత్వంపై పట్టణ మధ్యతరగతికి ఉన్న నమ్మకాన్ని దెబ్బతీశాయి.

Continues below advertisement

పొంగులేటి వ్యాపారాలపై అనేక వివాదాలు

పరిపాలనాపరమైన వైఫల్యాలకు తోడు ఆయన కుటుంబానికి చెందిన వ్యాపారాలు, లీగల్ సమస్యలు కాంగ్రెస్ సర్కార్‌కు మరింత ఇబ్బందికరంగా మారాయి. ఆయన కుమారుడు హర్షా రెడ్డికి సంబంధించిన కోట్లాది రూపాయల లగ్జరీ వాచీల స్మగ్లింగ్, హవాలా మరియు క్రిప్టోకరెన్సీ చెల్లింపుల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, డీఆర్‌ఐ ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో వరుస సోదాలు నిర్వహించడం రాజకీయ కలకలం రేపింది. ఈ కేసుల దర్యాప్తు రేవంత్ ప్రభుత్వంపై అవినీతి ముద్ర పడేందుకు దోహదపడుతుందనే అభిప్రాయం కేడర్‌లో నెలకొంది. మరో ప్రధాన ఆరోపణ పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ప్రాజెక్టులు, అలాగే మౌలిక వసతుల కాంట్రాక్టుల కేటాయింపు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులు, పెద్ద కాంట్రాక్టుల ప్రక్రియలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు అధిక ప్రాధాన్యత దక్కుతోందని, ప్రైవేటు ఆస్తి అభివృద్ధి వ్యాపార సంస్థలతో పొంగులేటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షాలు బీఆర్‌ఎస్, బీజేపీ ఘాటు విమర్శలు చేస్తున్నాయి. కీలక మంత్రి వద్ద అధికారం ఉండటం వల్ల సొంత వ్యాపారాలకు లబ్ధి చేకూరుతోందనే ఆరోపణ ప్రతిపక్షాలకు విమర్శల అస్త్రంగా మారింది.

సీఎం కూడా పొంగులేటి తీరుపై అసంతృప్తితో ఉన్నారా? 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఇది మింగుడుపడని పరిణామంగా మారినట్లు సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవైపు ప్రజాపాలన పేరుతో మెరుగైన ఇమేజ్ సాధించడానికి సీఎం ప్రయత్నిస్తుంటే, మరోవైపు రెవెన్యూలోని 22-ఎ గందరగోళం, ఈడీ, డీఆర్‌ఐ దాడులు, కేబినెట్ సహచరుల అసంతృప్తి వల్ల ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతింటోందనే ఆగ్రహం సీఎం స్థాయిలో ఉందనే ప్రచారం నడుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన శాఖలోని 22-ఎ సమస్యను ఎంత వేగంగా, పారదర్శకంగా పరిష్కరిస్తారనేది ఆయన రాజకీయ భవితవ్యానికే కాదు, మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వ రేటింగ్‌కు అత్యంత ముఖ్యం.