Ponguleti counters BRS allegations on Nader Gul  lands: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న నాదర్ గుల్ భూముల వ్యవహారంలో మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఘాటుగా స్పందించారు.  హరీశ్ రావు ఇటీవల చేసిన భూ కుంభకోణం ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.  గా నాదర్‌గుల్ భూముల వ్యవహారంలో తమపై వస్తున్న విమర్శలు అర్థరహితమని, వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Continues below advertisement

బీఆర్ఎస్ హయాంలోనే నాదర్ గుల్ భూముల రిజిస్ట్రేషన్                                  

హరీశ్ రావు ఆరోపిస్తున్న నాదర్‌గుల్ సర్వే నంబర్ 613లోని భూములకు సంబంధించి పొంగులేటి కీలక ఆధారాలను బయటపెట్టారు. ఆ భూములను 2014లోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే మూడు ప్రైవేట్ సంస్థలకు రిజిస్ట్రేషన్ చేసిందని ఆయన గుర్తు చేశారు. 2016లో మ్యూటేషన్ ప్రక్రియ జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్ అధికారంలోనే ఉందని, అప్పుడు జరిగిన రిజిస్ట్రేషన్లకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం సంబంధమని ఆయన నిలదీశారు. గతంలో వాటాల ఒప్పందం కుదుర్చుకుని, ఇప్పుడు తమకు వాటా దక్కలేదనే కక్షతోనే హరీశ్ రావు ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Continues below advertisement

మంత్రులు బిజీగా ఉన్న సమయం చూసి ఆరోపణలు                         

కేరళ ఎన్నికల ప్రచారంలో మంత్రులు బిజీగా ఉన్న సమయాన్ని అదనుగా తీసుకుని ప్రతిపక్షాలు బురదజల్లే రాజకీయాలకు తెరలేపాయని పొంగులేటి విమర్శించారు. సన్నబియ్యం పథకం, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి పాల్గొన్న ఈ సమావేశంలో.. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల భయమే బీఆర్ఎస్ నేతల ఆయాసానికి కారణమని ఎద్దేవా చేశారు.

పదేళ్ల కాలంలో జరిగిన అక్రమాలు వెలుగులోకి వస్తాయనే! 

పాలనలో పారదర్శకత కోసం తాము  భూ భారతి వంటి విప్లవాత్మక పోర్టల్‌ను తీసుకొస్తున్నామని, దీనివల్ల భూ రికార్డుల్లో అవకతవకలకు తావుండదని మంత్రి స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌లోని లోపాలను సరిదిద్ది రైతులకు మేలు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గత పదేళ్ల కాలంలో జరిగిన భూ కబ్జాలపై తాము విచారణ జరుపుతున్నామని, అందుకే బీఆర్ఎస్ నేతలు ఉలిక్కిపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై HAM రోడ్ల నిర్మాణంలో ఆరోపణలు, మంత్రి జూపల్లి కృష్ణారావు పై చేస్తున్న ఆరోపణలు కూడా వారి రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికేనని పొంగులేటి కొట్టిపారేశారు. అభివృద్ధి పనులు జరిగితే తమ పార్టీకి పుట్టగతులు ఉండవనే భయంతో ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.  ప్రజాస్వామ్య దేవాలయం లాంటి శాసనసభలోనూ, బయటా హరీశ్ రావు ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారని.. ఆధారాలు లేకుండా మాట్లాడితే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.