కాంగ్రెస్‌ పార్టీకి ఆది నుంచి గట్టి పట్టు ఉన్న ఖమ్మం జిల్లాపై మరోమారు విజయకేతనం ఎగురవేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో ఆ పార్టీ ఓటమి పాలైనప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగింది. అధికారం అందిపుచుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ రెండు ఎన్నికల్లో కేవలం ఖమ్మం జిల్లాలో సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడం ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ బలాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం తిరిగి పునర్‌వైభవాన్ని సాదించేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. 
పార్టీ పిరాయింపుల లోటు పూడ్చేలా..
తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెండు సార్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. అయితే అధికారం హస్తగతం కాకపోవడంతో జిల్లాలో పార్టీ పిరాయింపులు ఎక్కువగా జరిగాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 6 స్థానాల్లో విజయం సాదించింది. అయితే ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరడంతో పార్టీకి నష్టం వాటిల్లింది. నాయకులు వెళ్లినప్పటికీ జనంలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ఆదరణను పెంచుకుని రానున్న ఎన్నికల్లో తిరిగి పాత వైభవాన్ని పుంజుకునేందుకు ఆ పార్టీ వ్యూహాలు పన్నుతుంది. ఇప్పటికే మధిర నియోజకవర్గ వ్యాప్తంగా సీఎల్‌పీ నాయకుడు, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టారు. దీంతోపాటు ఇటీవల కాలంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సైతం వరుసగా జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కిగౌడ్, ఏఐసీసీ వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి జిల్లాలో పర్యటించారు. తాజాగా సీనియర్‌ నాయకులు వి.హనుమంతరావు జిల్లాలో పర్యటించనున్నారు.
పీసీసీ అధ్యక్షుడి హోదాలో తొలిసారి రేవంత్‌రెడ్డి..
తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడి ఎన్నికైన తర్వాత తొలిసారి రేవంత్‌రెడ్డి ఖమ్మంలో పర్యటించనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పార్టీ అంతర్గత వ్యవహారాల విషయంలో ఇప్పటి వరకు బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు తొలిసారిగా ఖమ్మం జిల్లాకు రానున్నారు. వరంగల్‌ జిల్లాలో రాహుల్‌గాందీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటన సాగనుంది. దీంతోపాటు స్వతాహాగా రేవంత్‌ రెడ్డికి ఖమ్మం జిల్లాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఖమ్మం వస్తున్న రేవంత్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకత్వం సమాయత్తమైంది. ఏది ఏమైనప్పటికీ పార్టీ పిరాయింపులతో కొద్దిగా సద్దుమణిగిన కాంగ్రెస్‌పార్టీలో తిరిగి పాత వైభవాన్ని తెచ్చేందుకు కార్యకర్తల్లో జోష్‌ నింపేందుకు రేవంత్‌రెడ్డి పర్యటన ఉపయోగపడనుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.