KCR New Officers :   ఎన్నికల ఏడాది వచ్చేసింది. ముందస్తుకు వెళ్లినా వెళ్లకపోయినా ఆరు నెలల తర్వాత ఇక పూర్తిగా ఎన్నికల వాతావరణమే ఉంటుంది. అందుకే సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని సర్దుబాటు చేస్తున్నారు. ఇప్పటికే ఐపీఎస్ అధికారుల్ని కొంత మందిని మార్చారు కానీ.. పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ఇప్పుడుభావిస్తున్నారు.  సంక్రాంతి తర్వాత సివిల్ సర్వీస్ అధికారుల బదిలీలు చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లాల కలెక్టర్లు ఎక్కువ మందిని మార్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 


మెజార్టీ జిల్లాల ఎస్పీలను మార్చే అవకాశం 
 
కొద్ది రోజుల కిందట తెలంగాణ సీఎం కేసీఆర్ కొందరు ఐఏఎస్‌ల బదిలీలు చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేయడంతో తప్పనిసరిగా చేయాల్సి వచ్చిన మార్పులు అవి. అయితే మొత్తంగా ఎస్పీలను కూడా ప్రక్షాళన చేయాలని కసరత్తు చేస్తున్నారు. కొత్త  డీజీపీ అంజనీకుమార్ ఈ అంశంపైనే కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారిని కూడా.. భవిష్యత్తు అవసరాలు, ఎన్నికల పరిస్థితు లను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్‌ కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఆరు నెలల తర్వాత ఏ క్షణ మైనా.. ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో.. ప్రభుత్వం తనదైన శైలిలో అధికార యంత్రాంగంలో కీలక మార్పులు చేయనుంది.


జిల్లాల కలెక్టర్లు కూడా అత్యధిక జిల్లాలకు మార్పు చేసే అవకాశం !


తెలంగాణ సీఎస్‌గా శాంతికుమారిని నియమించడం ద్వారా పక్కాగా తనదైన మార్క్‌ను ప్రదర్శించిన కేసీఆర్‌ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలకు ఎక్కువ మంది కన్ఫర్డ్‌ ఐఏఎస్‌లను కలెక్టర్లను నియమించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. సుదీర్ఘకాలంగా పని చేసిన అధికారులను సమర్ధత, విధేయత ఆధారంగా తర్వాత పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.  దాదాపు 20 నుండి 25 జిల్లాలకు కొత్త కలెక్టర్లు రానున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా సివిల్ సర్వీస్ అధికారుల బదిలీలు భారీగా జరగలేదు. అయితే ఎన్నికలకు ముందు ఎలాగూ అధికార వర్గాన్ని ప్రక్షాళన చేయాలి కాబట్టి ఇంత కాలం ఎదురు చూసినట్లుగా చెబుతున్నారు. 


సుదీర్ఘ కాలం ఒకే పొజిషన్‌లో ఉన్న వారికి స్థానభ్రంశం ! 


పలు జిల్లాలకు పూర్తిస్థాయి కలెక్టర్లు లేకపోగా, తెలంగాణ వచ్చినప్పటి నుండి కూడా.. ఒకే పొజిషన్‌లో పనిచేస్తున్న పలువురు అధికారులు ఉన్నారు. వీరికి స్థానభ్రంశం కలిగించే అవకాశాలున్నాయి. ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ ను సీఎంవోకు బదిలీచేస్తారన్న ప్రచారముంది. ఇటీవల పదోన్నతి లభించిన నేపథ్యంలో ఆదిలాబాద్‌, నిర్మల్‌ కలెక్టర్లకు స్థానచలనం కలగనుంది. వికారాబాద్‌ కలెక్టర్‌ ను బదిలీచేయనున్నారు. పలు శాఖలకు ఇన్‌ఛార్జి అధికారులే ఉన్నారు.   


ఎన్నికల సమయంలో ఎస్పీలు, కలెక్టర్లే కీలకం ! 


పాలనాపరంగా, ఎన్నికల పరంగా కలెక్టర్లు ఆయా జిల్లాల్లో కీ రోల్‌ పోషించే అవకాశం ఉండడంతో పోస్టింగ్‌లపై అత్యంత జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నారు. ఇటీవల కేంద్రం తెలంగాణ సివిల్ సర్వీస్ అధికారులపై దృష్టి పెట్టి ఒత్తిడి పెంచుతున్నపరిణామాలు కనిపిస్తున్నాయి. కేంద్రం ఒత్తిడి తలొగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వానికే నిబద్ధతగా ఉండే అధికారులను గుర్తించి ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు