Telangana BJP : తెలంగాణ అసెంబ్లీలో చాపకింద నీరులా విస్తరించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రణాళికలు సిద్దం చేసుకుంది. జాతీయవాద అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. జాతీయవాద అంశాలను ప్రజల్లో మరీముఖ్యంగా యువతరాన్ని ఆకట్టుకునేవిధంగా ప్రస్తావిస్తూనే స్థానిక సమస్యలను కూడా లేవనెత్తాలని భావిస్తోంది. జాతీయవాద అంశాలపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించడం వెనక యువత ఓట్లను కొల్లగొట్టడమే కాషాయ పార్టీ ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.
యువతపై ప్రత్యేక గురి
ఎన్నికల్లో ఓట్ల వేసేది ఎక్కువగా యువతేనని బీజేపీ భావిస్తోంది. సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా ఓటర్లలో యువ ఓటర్ల సంఖ్యనే ఎక్కువ. తెలంగాణలో మొత్తం 3కోట్ల 03లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఓటరు ఎన్‌రోలింగ్ జాబితాలో దాదాపు 4లక్షల మంది 18-19 సంవత్సరాల వయసు ఉన్న కొత్త ఓటర్లు చేరుతున్నారు. మొత్తం ఓటర్ల లో యువ ఓటర్ల సంఖ్య కోటికిపైనే ఉంటుందని , ప్రతీ ఎంపీ , అసెంబ్లి సెగ్మెంట్‌లో వీరి ఓట్లు గెలుపోటములను నిర్ణయిస్తాయని బీజేపీ అంచనా వేస్తోంది.
అందుకే యువత ఓట్లను పొందాలంటే జాతీయవాద అంశాలపై వరుస కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ అధిష్టానం రోడ్ మ్యాప్ ఇచ్చినట్లుగా తెలస్తోంది.
చురుకుగా మేరామిట్టి- మేరా దేశ్
స్వాతంత్య్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని వరుసగా జాతీయవాదాన్ని తట్టిలేపే కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. అమరవీరుల స్మరణార్థం దేశ వ్యాప్తంగా మేరా మిట్టి – మేరా దేశ్ కార్యక్రమంతోపాటు ఆగస్టు 14న భారతదేశ విభజనను నిరసిస్తూ దేశ విభజన గాయాల సంస్మరణ ది నర్ ను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. మేరామిట్టి- మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో ఆగస్టు 15 వరకు వరుస కార్యక్రమాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్వహించనుంది. అధిష్టానం ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి జిల్లాకు , ప్రతి అసెంబ్లి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఇద్దరేసి కో.ఆర్డినేటర్లను నియమించింది. ఇప్పటికే ఈ కార్యక్రమ నిర్వహణపై రాష్ట్ర స్థాయిలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన వర్క్‌షాప్ కూడా జరిగింది.
ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఆరెస్సెస్ ప్రచారక్‌ల కార్యాచరణ
ఇప్పటికే ఆరెస్సెస్ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎలా సైలెంట్ గా ప్రచారం చేస్తుందో అలా తెలంగాణలోనూ కార్యచరణ ప్రారంభించింది. అయిదు దశల్లో… పోలింగ్ బూత్‌స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో , రాష్ట్ర స్థాయిలో ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. మఖ్యంగా స్వాతంత్ర్య ఉద్యమన్ని ఓన్ చేసుకునే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామానికి వెళ్లి జాతీయ జెండాలను ఎగురవేయడం, దేశ విభజన సమయంలో చోటు చేసుకున్న మారణకాండపై ప్రచారం, దేశ విభజన గాయాలకు చెందిన ఫోటోలు, ఫీల్మ్‌లను, నాటి వార్తా పత్రికల ప్రతులను ప్రదర్శనకు ఉంచనున్నారు. సార్వత్రిక ఎన్నికలనాటికి ప్రతి పల్లెలో జాతీయవాదాన్ని తట్టిలేపుతూ యువతను సంఘటితం చేసేలా బీజేపీ ప్లాన్ చేసిందని అంటున్నారు. ఇది వర్కవుట్ అయితే సైలెంట్ ఓట్ల సునామీ ఉంటుందని బీజేపీ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి.