Telangana BJP :   తెలంగాణ బీజేపీ ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా .. ముందుకే వెళ్లాలని అనుకుంటోంది. వ్యూహాత్మకంగా రిజర్వుడు నియోజకవర్గాలపై ఇప్పటికే దృష్టి పెట్టారు. ఆర్థికంగా బలమైన నేతల్ని ఇంచార్జులుగా పెట్టి విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో పాగా వేయడం ద్వారా  అధికారం చేజిక్కించుకోవచ్చని భావిస్తున్నారు.  తెలంగాణలో  31 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణలో అధికారానికి ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో గెలుపు దగ్గరిదారి అని బీజేపీ హైకమాండ్ ఓ బ్లూప్రింట్ రెడీ చేసింది. 


గణనీయంగా రిజర్వుడు స్థానాలు


తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో 19 స్థానాలు షెడ్యూల్‌ కులాలకు(ఎస్సీ), 12 నియోజకవర్గాలను షెడ్యూల్‌ తెగలు(ఎస్టీ)లకు రిజర్వ్‌ అయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 31 నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచిందో ఆ పార్టీనే అధికారం దక్కించుకుంటోంది.  రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయాలంటే కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 63లో సగం 31 సీట్లు ఎస్టీ, ఎస్టీలవే కావడంతో ప్రధానంగా ఈ నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్‌ పెంచింది. గడిచిన 2018 ఎన్నికల్లో 19 ఎస్సీ నియోజకవర్గాలకుగాను 16చోట్ల, 12 ఎస్టీ నియోజక వర్గాలకు గాను ఆరు చోట్ల అధికార బీఆర్‌ఎస్‌ గెలుపొందింది. మిగతా చోట్ల కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో కూడిన మహాకూటమి గెలుపొందింది.


ఇప్పటికే చాప కింద నీరులా బీజేపీ ప్రచారం 


జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి నేతృత్వంలో బీజేపీ ఎస్సీ నియోజకవర్గాలపై గురిపెట్టి మిషన్‌-19 వ్యూహాన్ని, అదేవిధంగా గరికపాటి మోహన్‌రావు నేతృత్వంలో మిషన్‌-12 వ్యూహాన్ని ఎస్టీ నియోజక వర్గాల్లో గెలుపే లక్ష్యంగా అమలు చేస్తోంది. ఇటీవల పలువురు దళిత, గిరిజన, ఆదివాసీ వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరడంతో ఆయా నియోజకవర్గాల్లో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.  ఇప్పటికే 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాలన్నింటిలో బూత్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. 


ప్రత్యేక దృష్టి పెట్టనున్న కిషన్ రెడ్డి 


ఎన్నికలు సమీపించడంతో 31 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో గెలుపును ఖాయం చేసుకునేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ మోర్చాలతోపాటు ఆయా వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రుల తో ప్రచారం నిర్వహించాలని వ్యూహం రచించింది. మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, చత్తీస్‌గఢ్‌, మిజోరాం తదితర రాష్ట్రాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ మోర్చాల ప్రతినిధులు త్వరలో తెలంగాణలో ఆయా 31 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి బీజేపీ పార్టీని గిరిజన, దళిత వర్గాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నారు.   కిషన్‌రెడ్డి అధ్యక్షతన రెండు రోజులపాటు జరిగిన బీజేపీ పదాధికారుల, ముఖ్యనేతల సమావేశంలోనూ   ముందుగా ఎస్టీ, ఎస్టీ నియోజకవర్గాల్లోనే క్షేత్ర స్థాయి పార్టీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 


పలు చోట్ల రాష్ట్రపతి పర్యటనలు ? 


తెలంగాణలోని పలు ఆదివాసీ, గిరిజన గూడాల్లో ప్రజలు రక్తహీనతతో బాధపడుతున్నారని, ఈ అంశంపై రాష్ట్రపతి పర్యటన ద్వారా ఆదివాసీ, గిరిజనులతో మమేకం అయ్యేందుకు ప్రణాళికా సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్మును ఎంపిక చేయడం ఎస్టీ వర్గాల్లో తమ పార్టీకి ఆదరణ పెరగడానికి కారణం అని భావిస్తున్నారు.