Telangana BJP :  తెలంగాణలో బీజేపీకి అభ్యర్థులు లేరని దుష్ప్రచారం చేస్తున్నారని.. కానీ తాము అన్ని చోట్లా పోటీ చేస్తామని టీఎస్ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో .. అమిత్ షాతో భేటీ తర్వాత ప్రకటించారు. బీజేపీకి అభ్యర్థులు లేకపోవడం అనేది సమస్య కాదు. బీఫాం ఇస్తే పోటీ చేయడానికి వంద మంది రెడీగా ఉంటారు.కానీ ఇక్కడ బండి సంజయ్ భావిస్తున్నట్లుగా అభ్యర్థులు లేరని ప్రచారం జరగడం లేదు..  బలమైన అభ్యర్థులు లేరనే చెప్పుకుంటున్నారు. ఈ విషయం ఢిల్లీ బీజేపీ నేతలకూ  అర్థమయింది. తెలంగాణ విషయంలో పట్టుదలగా ఉన్న అమిత్ షా.. ఉన్న పళంగా నేతల్ని పిలిపించి.. తీసుకున్న క్లాస్ .. అభ్యర్థుల కోసమేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 


ముంచుకొస్తున్న ఎన్నికలు - కేసీఆర్ ముందస్తుకెళ్తే బీజేపీలో గందరగోళమే !


తెలంగాణకు ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. కేసీఆర్ ముందస్తుకు వెళ్తే ఇంకా ముందే జరుగుతాయి. కానీ తెలంగాణ బీజేపీకి మధ్య బలమైన అభ్యర్థుల జాడ దొరకడం లేదు. ఇతర పార్టీల నేతలు వచ్చి చేరిన చోట బలమైన అభ్యర్థులు ఉన్నారు. అయితే అవి చాలా పరిమితంగా ఉన్నాయి. హుజూరాబాద్, మునుగోడు వంటి చోట్ల మాత్రమే ఈ బలం కనిపిస్తోంది. అది కూడా అభ్యర్థుల వల్లే వచ్చింది. ఇక ఇతర నేతలు ఎవరూ పెద్దగా చేరకపోవడంతో .. నియోజకవర్గాల్లో బలపడిన  సందర్భాలు లేవు. ఇంతకు ముందు  పార్టీలో చేరిన వారు.. నియోజకవర్గాల్లో పట్టున్న నేతలు కాదు. పొంగులేటి సుధాకర్ రెడ్డి సహా పలువురు నేతలు ఎన్నికల్లో పోటీ చేస్తారా .. చేస్తే గెలుస్తారా అన్నది చెప్పడం కష్టం. 


పార్టీల్లో చేరికలను సైతం ప్రోత్సహించలేని పరిస్థితి !


సాధారణంగా బీజేపీ చేరికల కింగ్. ఆ పార్టీ అనుకోవాలి కానీ.. ఎమ్మెల్యేలు అయినా వచ్చి చేరిపోవాలి. అయితే విచిత్రంగా ఈ మంత్రం తెలంగాణలో పని చేయడం లేదు. ఎవరూ చేరడం లేదు. చివరికి బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. ఇక బీజేపీలో చేరడమే తరువాయి అనుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తటపటాయిస్తున్నారు. ఇక పదవుల్లో ఉన్న వారు వచ్చి చేరే చాన్స్ లేదు. మొదట్లో వచ్చిన  వారినందర్నీ కాంగ్రెస్ పార్టీ నుంచి చేర్చుకున్నారు. బీఆర్ఎస్ నుంచి ఆకర్షించాలన్న ప్లాన్ పెయిలయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి ఎవరూ బయటకు రారు. చేరికల విషయంలో ఎెందుకు ఫెయిలవుతున్నారని అమిత్ షా పార్టీ నేతలను గట్టిగానే ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ.. కోవర్టుల వల్లే చేరికలు లేవని ... ఈటల రాజేందర్ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం కూడా అమిత్ షా దృష్టిలో పెట్టుకున్నారు. తెలంగాణలో గెలవడం ముఖ్యం కాబట్టి చిన్న చిన్న గొడవలను వదిలి పెట్టి పని చేయాలని సూచించి పంపేశారు 


టిక్కెట్లు దక్కని వలస నేతలపైనే బీజేపీ ఆశలు పెట్టుకోవాలా ?


చివరి క్షణం వరకూ బలమైననేతలురాకపోతే..ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో టిక్కెట్లు రాని నేతల్ని ఆకర్షించి అప్పటికప్పుడు టిక్కెట్లు ఇచ్చి బరిలోకి నిలపడం తప్ప బీజేపీకి మరో ఆప్షన్ ఉండదు. అయితే ఇలా టిక్కెట్లు ఇస్తే.. ప్రజల్లో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. క్యాడర్ కూడా సహకరించదు. మెజార్టీ నియోజకవర్గాల్లో బీజేపీకి ఇటీవల క్యాడర్ పెరిగింది కానీ.. లీడర్లు మాత్రం దొరకడం లేదు. అందరూ ఎవరికి వారు తామే లీడర్లం అనుకుంటున్నారు. కానీ వారిలో ఎమ్మెల్యేకు పోటీ చేసేంత పొటెన్షియల్ ఉందని హైకమాండ్ కూడా నమ్మడం లేదు. ఎలా చూసినా బీజేపీ.. పార్టీని కాకుండా.. బలమైన అభ్యర్థుల్ని నమ్ముకుని రాజకీయం చేసి.. వ్యూహాత్మక తప్పిదం చేసిందన్న అభిప్రాయం మాత్రం .. బీజేపీ ప్రస్తుత పరిస్థితిని చూస్తే అనిపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.