తెలంగాణలో అధికారంలోకి రావటమే ధ్యేయంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. 2022లో కమలం పార్టీ అధిష్టానం మరింత దూకుడు ప్రదర్శించిందనే చెప్పవచ్చు. 2022 ఏడాది ఆది నుంచి బీజేపీ ముఖ్య నాయకులు రాష్ట్రంలో పర్యటనలు చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వంటి కీలక నేతల పర్యటనలు, సభలతో రాష్ట్రంలోని క్యాడర్ కు జోష్ నింపే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను రాష్ట్ర బీజేపీ సక్సెస్ చేసింది. నరేంద్ర మోదీ అమిత్ షాలు ఈ సభలో పాల్గొన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకుల్లో నూతనోత్సాహాన్ని నింపారు. తెలంగాణలో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేసింది కేంద్ర బీజేపీ నాయకత్వం అని చెప్పవచ్చు. ఈ ఏడాది రాష్ట్రంలో బీజేపీ అనేక కార్యక్రమాలను చేపడతూ వచ్చింది.  మోదీ, అమిత్ షాల పర్యటనలతో ఈ ఏడాదిలో బీజేపీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అమిత్ షా, జేపీ నడ్డాలు కొన్ని జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. ప్రవాస్ యోజన కింద తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు పర్యటనలు చేశారు. నియోజకవర్గాల్లో కేంద్రం ప్రవేశపెడుతున్నటు వంటి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలిపే ప్రయత్నం చేశారు. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన అమిత్ షా... రానున్న ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవటమే ధ్యేయంగా 2022 సంవత్సరంలో ఓ ప్రణాళిక ముందుకెళ్లారనే చెప్పవచ్చు. కమలం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సైతం తెలంగాణను వేధిక చేసుకుంది. ఈ ఏడాదిలో కేంద్ర నాయకత్వం తెలంగాణ ప్రజల దృష్టిని తమవైపు ఆకర్షించుకునే ప్రయత్నం చేసింది. ప్రధాని మోదీ పాల్గొన్న కొన్ని కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండటం కూడా ఒకింత చర్చకు దారితీసిందనే చెప్పవచ్చు.   


 బీజేపీ యాక్టివిటీస్...


ఈ ఏడాదిలో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో 4 గురు బీజేపీ ఎంపీలు ఉన్నారు.  ఇందులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎంపీ అరవింద్ లు మాటల తూటాలు పేల్చారు. పదునైన ప్రసంగాలతో బీజేపీ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ... ప్రజల్లోకి వెళ్లారు. రాష్ట్రానికే చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వచ్చారు. రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ కు రాజ్యసభ ఇచ్చి పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఎన్నుకుంది బీజేపీ కేంద్ర అధిష్టానం. రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆరెస్ పార్టీని బీజేపీ నాయకులు ఎండగడుతూ వచ్చారు. రాష్ట్రంలో బీజేపీ పథాధికారుల సమావేశాలు నిర్వహించారు. ప్రతి జిల్లాలో బీజేపీ బలోపేతం కోసం రాష్ట్ర నాయకత్వం కృషి చేస్తూ వచ్చింది. బండి సంజయ్ వివిధ జిల్లాల్లో పర్యటనలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 విడతలుగా వివిధ జిల్లాల్లో పాదయాత్రలు నిర్వహించారు. ఇటు కేంద్ర అటు రాష్ట్ర ముఖ్య నాయకులతో వివిధ జిల్లాలలో బీజేపీ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. కార్యకర్తల్లో నూతనోత్సాహన్ని నింపారు. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా కార్యక్రమాన్ని నిర్వహించారు. భూత్ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించింది బీజేపీ నాయకత్వం. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్ వ్యవహరం రాష్ట్రంలో చర్చకు దారితీసింది. 


మునుగోడు ట్రయల్ రన్  


ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ లో బీజేపీ పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదిపిందనే చెప్పవచ్చు. ఇందుకు ఉదాహరణే మునుగోడు ఉపఎన్నిక అని విశ్లేషకుల అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించింది కేంద్రం. ఆ వెంటనే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం... కమలం పార్టీలోకి చేరటం... మునుగోడు ఉప ఎన్నికలు రావటం అంతా చకచకా జరిగిపోయింది. అయితే మునుగోడులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన అంతిమ విజయం తమదేనని బీజేపీ చెప్పుకొచ్చింది. ఈ ఎన్నికల వల్ల అటు ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ లో బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు. నల్గొండ జిల్లా రాజకీయాల్లో మంచి పట్టున్న నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి రావటం ఆ జిల్లాలో పార్టీకి జీవం పోసినట్లైంది. మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఈ ఎ్ననిక హోరాహోరీగా సాగింది. ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ నువ్వా నేనా అన్న రీతిలో పైట్ సాగింది. 


బండి సంజయ్ పాదయాత్ర 


 బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో 5 విడతలుగా పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు. గ్రామ గ్రామాన బీజేపీ పార్టీని బలోపేతం చేసే దిశగా బండి సంజయ్ పాదయాత్ర సాగిందనే చెప్పవచ్చు. పలు సందర్భాల్లో బండి సంజయ్ పాదయాత్రకు అనుమతులు ఇవ్వకపోవటం... సొంత పార్లమెంట్ నియోజకవర్గం కరీంనగర్ లో బండి సంజయ్ ను అరెస్ట్ చేయటం.. పెద్ద ఎత్తున రాష్ట్ర బీజేపీ నాయకులు కరీంనగర్ కు తరలివెళ్లటం ఆ పై బండిని విడుదల చేయటం ఇలా ఒకింత నిత్యం వార్తల్లో ఉండేలా చూసుకుంది బీజేపీ నాయకత్వం. పలు జిల్లాల్లో బండి సంజయ్ పాదయాత్రకు బీజేపీ శ్రేణులు భారీగానే కదం తొక్కాయి. ప్రజల నోళ్లల్లో నానే విధంగా బండి పాదయాత్ర వ్యూహాత్మంగా కొనసాగిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ తర్వాత ప్రత్యామ్నయం బీజేపీయే అన్న ముద్ర వేసుకుంది. రాష్ట్రంలో నెంబర్ -2 గా ఎదిగింది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ధీటుగా ఎదుర్కొని విధంగా 2022లో బీజేపీ అధిష్టానం పావులు కదుపుతూ వచ్చింది. రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకులు పలు సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇస్తూ వచ్చారు. 


బీజేపీలోకి పలువురు కీలక నేతలు 


2022లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూకుడుగా వెళ్లటం హడావుడి చేయటం... రాష్ట్రానికి కేంద్రం నుంచి ముఖ్య నేతల పర్యటనలు జరగటం... ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ పై బీజేపీ అధినాయకత్వం దృష్టి సారించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లో ఉన్న పలువురు నేతలకు కమలం కండువా కప్పుకున్నారు. ఇందులో స్వామీ గౌడ్, దాసోజు శ్రావణ్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి లాంటి నేతలు కాషాయ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. రాష్ట్రంలో నాయకులు కరువైన బీజేపీకి పలువురు కీలక నేతలు పార్టీలో చేరటంతో బలపడీందనే చెప్పవచ్చు. ఆపరేషన్ ఆకర్ష్ లో అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారని బీజేపీ నేతలు చెప్పుకుంటారు. పలు జిల్లాల్లో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కమలం పార్టీలోకి చేరికలు జరిగాయి. ఈ ఏడాది కేంద్ర బీజేపీ నాయకత్వం ఆపరేషన్ ఆకర్ష్ పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇది పార్టీకి కలిసొచ్చే అంశంగా మారింది...మరోవైపు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి విషయంలో గవర్నర్ తమిళ సై కి సీఎం కేసీఆర్ కు మధ్య గ్యాప్ పెరిగింది. కొన్ని అధికారిక కార్యక్రమాల్లో గవర్నర్ కు ప్రభుత్వానికి పొసగకుండా పోయింది. యూనివర్సిటీల్లో వీసీ ల నియామకం వ్యవహారంలో కూడా విబేధాలు తలెత్తాయ్. 


ఈ ఏడాది బీజేపీకి ప్రతి కూల అంశాలేంటి ? 


ఏడాది చివరిలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బీజేపీకి కొంత మచ్చగానే మిగిందని చెప్పవచ్చు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ వ్యవహారాన్ని వీడియో పుటేజీలను చూపిస్తూ వివరించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై విచారణలు జరుగుతూనే ఉన్నాయ్. ఈ అంశం బీజేపీకి కొంత ఇబ్బంది కరంగానే ఉండొచ్చన్నది రాజకీయ విశ్షేకుల అభిప్రాయం. అయితే కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి పారిశ్రామికంగా పెద్దగా చేసిందేమీ లేదనేది రాష్ట్ర ప్రభుత్వం వెలెత్తి చూపుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి పెద్దగా చేసేందేమీ లేదని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో చిన్న చూపుచూస్తోందని రాష్ట్రంలోని అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ పార్టీలు బీజేపీ మతతత్త్వపు పార్టీగా ముద్రిస్తోంది. బీజేపీ ఎంపీలు తమ తమ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. రాష్ట్రంలో రైల్వే కోచ్ ల విషయంలో కేంద్రం చిన్న చూపు చూసింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు ఎందుకు చేయటం లేదని రాష్ట్ర ప్రభుత్వం బీజేపీని ప్రశ్నిస్తోంది. 


ఏదిఏమైనా తెలంగాణ రాష్ట్రంలో పట్టు సాధించేందుకు 2022 ఏడాదిలో బీజేపీ చేసిన ప్రయత్నాలు ఆ పార్టీకి ఒకింత కలిసొచ్చే అంశాలుగానే చెప్పుకుంటున్నారు. గతంలో కంటే ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోందన్నది విశ్లేషకుల భావన. తెలంగాణలో కమలం పార్టీ నెంబర్ 2గా ఎదిగిందన్నది ఆ పార్టీ నేతల్లో భావన.