నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందడంతో పాటు పలువురు గాయపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను గవర్నర్ హరిచందన్ ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు
కందుకూరు ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. గాయపడిన క్షతగాత్రులకు యాభై వేలు చొప్పున సాయం అందిస్తామని వెల్లడించారు. ఈ మేరకు జిల్లా అధికారులకు సీఎంవో ఆదేశాలు జారీ చేసింది.
కుందుకూరులో తెలుగుదేశం నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోవడం చాలా బాధ కలిగించిందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇది చాలా దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను అని... అలాంటి కార్యకర్తలు ప్రమాదం బారిన పడి మరణించడం చాలా విచారకరమన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేశారు. ఆయా కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా కందుకూరు ప్రమాదంపై స్పందించారు. ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరమన్నారు. మృతు ఆత్మకు శాంతి కలగాలని సంతాప వ్యక్తం చేశారు. సభలు, సమావేశాలు సందర్భంగా రాజకీయ పార్టీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీస్ యంత్రాంగం కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికార పార్టీకి కల్పించినట్టుగానే ప్రతిపక్షాలు చేపట్టే సభలకు కూడా బందోబస్తు ఏర్పాటు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఇది రాజకీయ పార్టీ సభ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరణించిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు.