TDP MLAs Controversies: శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కర్నూలు రేంజ్ అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేశారంటూ విడుదలైన సీసీ టివి ఫుటేజ్, అటవీ శాఖ ఉద్యోగుల ఆరోపణలు, చేసిన ఫిర్యాదులు కూటమి ప్రభుత్వంలో తీవ్ర కలకలాన్ని రేపాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే స్వయంగా ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం వారి వాహనంలో వారినే ఎక్కించి రౌండ్స్ తిప్పుతూ అనుచరులతో  దాడికి పాల్పడ్డారు అంటూ వచ్చిన ఆరోపణలు అధినేత చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఇరకాటంలో పడేశాయి. ఎంతలా అంటే ఈ కేసు పై పూర్తి నివేదిక ఇచ్చి ఒకవేళ నిజమని తేలితే ఎమ్మెల్యే పైనే కేసు పెట్టాలంటూ స్వయంగా చంద్రబాబు, పవన్ ఆదేశాలు ఇచ్చేంత స్థాయిలో.

"మాది మంచి ప్రభుత్వం "అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి గండి కొట్టేలా ఈ వ్యవహారం మారిపోయింది. ఇదనే కాదు గడచిన కొంతకాలంగా కొంతమంది అధికార పార్టీ నాయకులు అరాచకాలు చేస్తున్నారు అంటూ వస్తున్న విమర్శలు,ఎదుర్కొంటున్న ఆరోపణలు,చిక్కుకుంటున్న వివాదాలు అటు ఇటు తిరిగి చంద్రబాబు మెడకు చుట్టుకుంటున్నాయి. చాలా స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఆయనకున్న ఇమేజ్‌ను చేజేతులా కొంతమంది పార్టీ నేతలు చేస్తున్న పనులతో  దెబ్బతింటోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

టీడీపీని ఇరకాటంలో పెట్టిన కొన్ని వివాదాలు ఇవే

మిగిలినవి ఎలా ఉన్నా ఒక్క ఆగస్టు నెలలోనే మూడు కీలకమైన వివాదాలు టిడిపికి తీవ్ర ఇబ్బందిని కలిగించాయి. వాటిలో ఆల్రెడీ చెప్పుకున్న  శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ శాఖ ఉద్యోగులపై చేసిన అరాచకం కాకుండా హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ దుర్భాషలాడుతూ మాట్లాడిన ఫోన్‌ ఆడియో బయటికి రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఆ ఆడియో తనది కాదు అంటూ ఎమ్మెల్యే వివరణ ఇచ్చినా పార్టీ ఇమేజ్‌కి అది ఆటంకం కలిగించింది అనేది వాస్తవం. 

దుర్గాప్రసాద్‌ వివాదం ఇంకా పూర్తిగా సద్దుమణగ లేదు మరో అతిపెద్ద వివాదం నెల్లూరు జిల్లాల నేతలను కమ్మేసింది. అరుణ, ఖైదీ శ్రీకాంత్ ప్రైవేట్ వీడియోల హల్చల్ చేశాయి.  రెండు జిల్లాల ఎస్పీలు వద్దని చెబుతున్నా యావజ్జీవ ఖైది శ్రీకాంత్‌కు పెరోల్ లభించడం దాని వెనక ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సు ఉందంటూ విపక్ష వైసిపి ఆరోపణలు చేయడం తో పాటు అధికార పార్టీ పత్రికలలో ఈ విషయాలు రావడంతో టీడీపీ ఉలిక్కిపడింది. ముఖ్యమంత్రి సూచనలతో రాష్ట్ర హోం మంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఒక్క ఈ ఆగస్టు నెలలోనే ఈ మూడు వివాదాలు టిడిపికి తీవ్ర ఇబ్బందులు కలిగించాయి అనడం లో ఎలాంటి అనుమానం లేదు.

ఈ మధ్యే బయటకు వచ్చిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజా బెదిరింపుల ఆడియో

ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఒక కాలేజీ వ్యవహారంలో ఆ కాలేజీకి సంబంధించిన వ్యక్తిని ఆడియో హెచ్చరిస్తూ బయటపడిన ఆడియో కూడా వివాదాస్పదమైంది. దీనిపై రెండు మూడు రోజులు హల్చల్ నడిచినా ప్రస్తుతానికి సద్దుమణిగింది. ఇదే కాకుండా హోంమంత్రి అనిత దగ్గర పని చేస్తున్న ఒక వ్యక్తి అనేక దందాలు చేస్తున్నాడు అంటూ ఆరోపణలు రావడం విషయం మంత్రి వరకూ చేరడంతో అతణ్ని ఉద్యోగం నుంచి తొలగించానని మంత్రి ప్రకటించారు. ఇక ఏరికోరి తిరువూరు సీటు నుంచి చంద్రబాబు పోటీ చేయించిన కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలి మొదట్లో పార్టీని తీవ్ర ఇబ్బంది పెట్టింది. స్థానిక నాయకులకు ఆయనకి మధ్య వచ్చిన విభేదాలు చంద్రబాబు వరకు చేరడంతో ఆయన స్వయంగా ఎమ్మెల్యేను మందలించారని టాక్.అందరినీ కలుపుకు పోవాలి తప్ప దూకుడుగా వ్యవహరించడం తగదని శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి సూచించడంతో అప్పుడు నుంచి ఆయన కొంత స్లో అయ్యారు.

లిస్ట్ ఇంకా ఉంది 

రాజకీయాల్లో మర్యాదస్తులుగా పేరుపడ్డ ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, కూన రవికుమార్  మహిళలకు సంబంధించిన అంశాల్లో వివాదాలు ఎదుర్కొంటున్నారు. నజీర్ అహ్మద్ వేరొక మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అంటూ ప్రచారమైన వీడియో ఒకటి బయటకు రాగా కూన రవికుమార్‌పై వచ్చిన ఆరోపణలు మరీ వివాదాస్పదమైనవి. ఏకంగా తనను వేధిస్తున్నాడంటూ ఒక మహిళ మీడియాతో మాట్లాడటం కలకలం సృష్టించాయి. అయితే ఇదంతా కుట్రని రవికుమార్ కొట్టిపారేశారు. ఈ వివాదాలన్నిటికంటే ముందు ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే కాన్వాయ్ విషయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి పోలీసులతో వాగ్వాదానికి దిగడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. 

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వీడియోలు అయితే మరీ దారుణం. అప్పట్లో ఒక మహిళతో ఆయన ఉన్నట్టు చెప్పిన వీడియోలు ఆ మహిళ నే బయటపెట్టింది. ఆయన్ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసారు అధినేత చంద్రబాబు. పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళల్లో జరిగిన ఈ ఘటనలో చంద్రబాబు వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయడం వల్ల పార్టీ ఇమేజ్‌కి పెద్ద దెబ్బ అయితే తగల్లేదు. కానీ విషయం వైరల్ అయింది. ఇవేకాక అప్పుడప్పుడు తన మాట తీరుతో వివాదాల్లో చిక్కుకునే  చింతమనేని ప్రభాకర్, పెద్దారెడ్డి పై ఒంటి కాలుపై లేచే జేసీ ప్రభాకర రెడ్డి అవునన్నా కాదన్న పార్టీకి ఎంతో కొంత తలనొప్పులు తెచ్చి పెడుతున్న మాట వాస్తవం.

చంద్రబాబు ఆలోచన అర్ధం చేసుకోలేక పోతున్న నాయకులు 

సరిగ్గా గమనిస్తే గతంలో ఉన్న చంద్రబాబుకి ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు వ్యవహార శైలికి ఉన్న తేడాను ఈజీగానే గమనించవచ్చు. వీలైనంతగా ప్రజలతో మమేకం కావడానికి నవ్వుతూ ప్రజల మధ్య ఉండడానికే ఆయన ఇష్టపడుతున్నారు. దీనికి కారణం నోటి దురుసుతనంతో గత ప్రభుత్వంలో కొందరు వైసిపి నేతలు చేసిన పనులకు ఎన్నికల్లో ఆ పార్టీ ఎలా దెబ్బతిందో ఆయనకు క్లారిటీ ఉంది. అందుకే మొదటి నుంచి కాస్త శాంతంగా ఉండండి వివాదాలకు దూరంగా ఉండండి ప్రజల మధ్య ఉండండి అని ఎమ్మెల్యేలకు పదే పదే చెబుతున్నారు చంద్రబాబు. చాలామందికి ఆ విషయం అర్థం అవుతున్నా కొందరు నాయకులు ఎమ్మెల్యేలకు మాత్రం తత్వం బోధపడటం లేదు. ఇక నుంచి అయినా పరిస్థితి మారకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదని టిడిపి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వారి ఆవేదనను వివాదాస్పద ఎమ్మెల్యేలు నేతలు పట్టించుకుంటారో లేదో చూడాలి.