Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాను రాను రసవత్తరంగా మారుతున్నాయి. కూటమిలో అంతర్గత రాజకీయాలు అంతకంతకూ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దానికి తాజాగా ఉదాహరణ నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పోస్టు కోసం డిమాండ్ వినిపించడం. మొదటజనసేన పార్టీని, పవన్ కల్యాణ్ ను తీవ్రంగా వ్యతిరేకించే మహాసేన రాజేష్ ఈ డిమాండ్ ను తీసుకువచ్చారు. తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుడు మద్దతు పలికారు. రేపు మరికొంత మంది అదే మాట అనవచ్చు. ఇదంతా వ్యూహాత్మకంగానే చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ ఇప్పుడే ఎందుకు ?
లోకేష్‌కు ఇప్పటికిప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు అవసరం అన్నది టీడీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. భవిష్యత్ నాయకత్వాన్ని ఇప్పటి నుంచే రెడీ చేయాలని అంటున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ తన వారసుడు అయిన ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయించారు. అదే తరహాలో నారా లోకేష్ ను చేయిస్తే...తర్వాత ఎవరి నాయకత్వం అనే దానిపై సందిగ్ధం చర్చ ఉండవని.. అంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు టీడీపీలో చంద్రబాబు తర్వాత లోకేష్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. పార్టీపై ఇప్పటికే ఆయన పట్టు సాధించారని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వంలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు అధికారికంగా డిప్యూటీ సీఎం హోదా ఉన్నా.. లేకపోయినా పెద్దగా పట్టింపు లేదు.
దూసుకెళ్తున్న పవన్ కల్యాణ్‌కు చెక్ పెట్టడానికా ?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలి కాలంలో రాజకీయాలు ఎక్కువగా చేస్తున్నారు. హిందూత్వ వాదాన్ని బలంగా వినిపించడంతో పాటు బీజేపీకి ఇంకా ఎక్కువ దగ్గర అవుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో జనసేన పార్టీ వర్గాలు పవన్ ఒక్కరే అద్భుతంగా పని చేస్తున్నారని..ప్రభుత్వ పనితీరు పవన్ వల్లన మెరుగ్గా ఉందని ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా అప్పుడప్పుడు చంద్రబాబుకుపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు విడిగా పరామర్శలకు వెళ్లారు. అలాగే పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఆయన విస్తృతంగా పర్యటనలు చేయాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కు చెక్ పెట్టాడనికి లోకేష్ ను కూడా డిప్యూటీ సీఎం చేయాలన్న వాదన వినిపిస్తోంది.
పవన్ స్పందన ఎలా ఉంటుంది ?
రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే హోదా లేదు. కేబినెట్ లో సీఎం తర్వాత మంత్రులే ఉంటారు. అయితే రాజకీయ పదవిగా డిప్యూటీ సీఎం పదవిని ఇస్తున్నారు. చంద్రబాబు గతంలో రెండు డిప్యూటీ సీఎంలు ఇచ్చారు.జగన్ ఏకంగా ఐదు డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. ఇలా ఇచ్చారుకానీ ఆయా డిప్యూటీ సీఎంలకు ప్రత్యేకంగా ప్రోటోకాల్ కూడా ఏమీ రాలేదు. కానీ ఇప్పుడు ఒకరే డిప్యూటీ సీఎం ఉన్నారు. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన పదవి సాయంతో రాజకీయంగా బలపడేందుకు చేసే ప్రయత్నాలను లోకేష్ కు సమానమైన హోదా ఇవ్వడం ద్వారా అడ్డుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోందది.. మరి పవన్ ఎలాంటి కౌంటర్ రెడీ చేసుకుంటారు ?