Nara Lokesh Slams Ysrcp Government in Shankaravam: ఉత్తరాంధ్రను వైసీపీ నేతలు దోచుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని (Narasannapeta) శంఖారావం బహిరంగ సభలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతూ.. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ఎమ్మెల్యేల బదిలీ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారని.. ఒక నియోజకవర్గంలో పని చేయని వారు ఇంకో నియోజకవర్గానికి పని చేస్తారా.? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల బదిలీ తీసుకొచ్చినప్పుడే జగన్ ఓటమి అంగీకరించారని అన్నారు. 'సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి.. మద్యం తయారీ, విక్రయం వాళ్లే చేస్తూ జనం డబ్బు లాగేస్తున్నారు. 151 సీట్లు గెలిచిన జగన్ రాష్ట్రానికి ఏం సాధించారు?. ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీలే ఆయనకు బైబై అంటున్నారు. వంద సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ కట్ చేశారు. రాబోయేది టీడీపీ - జనసేన ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఉద్యోగం ఆలస్యమైతే నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు అందజేస్తాం. 3 రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం కానీయం. కేసుల మాఫీ కోసం సీఎం కేంద్రం ముందు తల వంచారు.' అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
'అందరినీ మోసం చేశారు'
సీఎం జగన్ పాలనలో అన్నీ వర్గాలను మోసం చేశారని.. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగులను మాయ చేసి జీపీఎస్ తెచ్చారని లోకేశ్ మండిపడ్డారు. సీఎం జగన్ తాగేది ప్రజల రక్తమని.. మద్యం ద్వారా ఏడాదికి రూ.9 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.45 వేల కోట్లు మింగేశారని ఆరోపించారు. 'జగన్ బ్లూ బటన్ నొక్కి రూ.10 అకౌంట్లో వేస్తే రెడ్ బటన్ నొక్కి రూ.100 లాగేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, ఆర్టీసీ ఛార్జీలు పెంచి జనం జేబులు గుల్ల చేస్తున్నారు. అవకాశం ఇస్తే గాలిపై కూడా పన్ను వేస్తారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలను పీడిస్తున్నారు.' అంటూ ధ్వజమెత్తారు.
'రాబోయేది సంక్షేమ ప్రభుత్వం'
వచ్చే ఎన్నికల్లో రాబోయేది టీడీపీ - జనసేన ప్రభుత్వమని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలోనే దీపం కనెక్షన్లు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. యువగళం పాదయాత్ర నేపథ్యంలో 3,132 కి.మీలు నడిచి ప్రజల సమస్యలు తెలుసుకున్నానని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని అన్నారు. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పాఠశాలలు వెళ్లే పిల్లలకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని స్పష్టం చేశారు.