TDP Strategy on the inclusion of YCP leaders : వైఎస్ఆర్‌సీపీలో వరుస రాజీనామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ పలువురు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. వారికి ఏ పార్టీలో ఎంట్రీ లభిస్తుందో స్పష్టత లేదు. ఇప్పటికైతే .. అసలు వైసీపీలో ఉండటం కన్నా.. రాజీనామా చేసి ఖాళీగా ఉండటం మంచిదని అనుకున్నారు. అదే పని చేశారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు రాజీనామా బాటపట్టారు. ఎమ్మెల్యేల సంఖ్య వైసీపీకి చాలా పరిమతంగా ఉంది. రాజ్యసభలో.. శాసనమండలిలో మాత్రం ప్రభావం చూపగల స్థాయిలో బలం ఉంది. ఇప్పుడు వ్యూహాత్మకంగా ఆ రెండు చట్టసభల్లోనూ వైసీపీ నామమాత్రంగా మిగిలేలా టీడీపీ వ్యూహం పాటిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
రాజ్యసభలో వైసీపీకి పదకొండు మంది సభ్యులు
వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు. టీడీపీకి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఎన్డీఏ ప్రభుత్వానికి ఇప్పుడు రాజ్యసభ సభ్యుల అవసరం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇస్తుందని ముందుగానే ప్రకటించారు. స్పీకర్ ఎన్నిక విషయంలో ఆయన బీజేపీ అడగక ముందే మద్దతు ప్రకటించారు. కానీ ఇటీవల పాలసీ మార్చుకున్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో విబేధిస్తామని సూచనలు పంపారు. అదే సమయంలో ఢిల్లీలో ఆయన చేసిన ధర్నాకు ఇండియా కూటమి పార్టీలన్నీ వచ్చి మద్దతు పలికాయి. దాంతో ఆయన ఇండియా కూటమికి దగ్గరగా మారిపోయారని క్లారిటీ వచ్చేసింది. అప్పట్నుంచే అసలు రాజకీయం ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా ఏదో ఓ పార్టీలో చేరిపోయేందుకు సిద్ధపడుతున్నారు.
ఓర్వకల్లు, కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్రం ఓకే: రామ్మోహన్ నాయుడు
ఎవరు రాజీనామా చేసినా టీడీపీ ఖాతాలోకే !
టీడీపీలోకి ఎవరు రావాలన్నా రాజీనామా చేసి రావాలని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అంటే.. ఎవరు టీడీపీలోకి వచ్చినా రాజీనామా చేస్తారు. అందులో సందేహం లేదు. ఇక్కడ రాజీనామాలు చేయడం వల్ల ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదు. ఇంకా అధికార పార్టీకి ప్లస్ అవుతుంది. ఎందకంటే.. రాజీనామా చేసిన ప్రతీ స్థానంలోనూ గెలుపు కూటమిదే అవుతుంది. రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేస్తే ఉపఎన్నికలు వస్తాయి. ఇప్పుడు అసెంబ్లీలో బలం కూటమికే తిరుగులేని స్థాయిలో ఉంది. కనీసం పోటీ పెట్టడానికి అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు కూడా వైసీపీకి లేదు. అందుకే ఉపఎన్నికలు వస్తే కూటమి అభ్యర్థులు ఏకగ్రీవం అవుతారు ఇప్పుడు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసి టీడీపీలోనో.. బీజేపీలోనే.. జనసేనలోనే చేరిపోతే ఉపఎన్నికలు వస్తాయి. వారికి అదే సీటును ఇస్తే వారి పదవి వారికి ఉంటుంది. కానీ పార్టీ మాత్రం.. అదికారికంగా మారిపోతారు.
వైఎస్ఆర్‌సీపీలో రాజీనామాల విప్లవం - పెద్ద ఎత్తున రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పే చాన్స్
ఎమ్మెల్సీ అయినా అంతే !
ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా వైసీపీకి..ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలకు ఉపఎన్నికలు వచ్చిన టీడీపీనే గెలుస్తుంది. ఇటీవల విశాఖ స్థానిక సంస్థల ఉపఎన్నిక విషయంలో జగన్ బొత్సను అభ్యర్థిగా ఖరారు చేయడంతో వ్యూహాత్మకంగా పోటీ పెట్టలేదని తెలుస్తోంది. దీని వెనుక భారీ రాజకీయం ఉందని చెబుతున్నారు. మిగతా ఎలాంటి ఎమ్మెల్సీలు వచ్చినా టీడీపీ కూటమి గెల్చుకుంటుంది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న వారు కూటమిపార్టీల్లో చేరి రాజీనామాలు చేసినా వారి పదవులు వారికి ఉంటాయి. అందుకే రాజీనామాల పర్వం సాగబోతోందని చెబుతున్నారు.
మొత్తంగా వైసీపీకి ఉన్న రాజకీయ బలం.. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలే. ఇప్పుడు ఆ బలాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేందుకు పక్కా ప్రణాళికతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నట్లుగా భావించవచ్చు.