Rammohan Naidu : ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఓర్వకల్లు, కొప్పర్తికి పారిశ్రామిక స్మార్ట్ సిటీలకు ఆమోదం తెలిపినట్లు అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. అలాగే కూటమిలోకి ఏ పార్టీ లీడర్లు వచ్చినా ఆహ్వానిస్తామన్నారు. రావాలనుకునే వాళ్లు తప్పకుండా ప్రస్తుత పదవికి రాజీనామా చేసే రావాలన్నారు. ఓర్వకల్లు, కొప్పర్తికి పారిశ్రామిక స్మార్ట్ సిటీలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్-బెంగళూరు, విశాఖ-చెన్నై కారిడార్లను అప్‌గ్రేడ్ చేస్తామని తెలిపారు. పోలవరానికి త్వరలో రూ.12 వేల కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం జరుగుతుందని, ఏపీకి వివిధ రకాల పరిశ్రమలు వచ్చేలా కేంద్రం సహకరిస్తోందని వివరించారు.
12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలకు ఆమోదం
అంతే కాకుండా దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పారిశ్రామిక స్మార్ట్ సిటీలను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎన్‌ఐడిసిపి) కింద నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఈ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఇది ఆరు ప్రధాన కారిడార్లలో వ్యూహాత్మకంగా నిర్మాణం కానుంది. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూ. 28,602 కోట్లు ఖర్చు చేయనున్నారు.
2596ఎకరాల అభివృద్ధి
కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విశాఖ-చెన్నై కారిడార్ పరిధిలోకి కొప్పర్తి వస్తుందని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,137 కోట్లు ఖర్చు చేస్తుందని ఆయన ప్రకటించారు. ఈ హబ్‌తో 54,500 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. కొప్పర్తిలో ఉత్పత్తి రంగంపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్‌లో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం 2,786 కోట్లు వెచ్చించనున్నారు. దీని ద్వారా సుమారు 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాయలసీమకు మేలు జరుగుతుందన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. ఏపీలో ఈ రెండు స్మార్ట్ సిటీలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలిపారు. కేంద్రం, రాష్ట్రం కలిసి ముందుకు సాగుతున్నాయన్నారు. ఏపీ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రత్యేక దృష్టి సారిస్తున్నమన్నారు.
పోలవరానికి రూ.12,500కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. నవంబర్‌లో పోలవరం పనులు పునఃప్రారంభం కాకముందే ఈ నిధులు విడుదలకానున్నాయి. గత ఐదేళ్లలో ఏపీ చాలా రంగాల్లో వెనుకబడి ఉంది. డబుల్ ఇంజన్ వృద్ధిని చూస్తున్నామని రామ్మోహన్ నాయుడు అన్నారు.
శరవేగంగా పోలవరం
ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరంపై పూర్తి దృష్టి పెట్టారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థానిక ఇంజనీర్ల నుంచి విదేశీ నిపుణుల నుంచి సూచనలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు స్పీడుకు కేంద్రం మద్దతివ్వడంతో పనుల్లో వేగం పెరిగింది. పోలవరంపై ఇటీవల మంత్రులతో సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిపుణుల సలహాలు, సూచనలను మంత్రివర్గంలో ప్రస్తావించారు. కేంద్రం నుంచి నిధులు ఎలా తీసుకురావాలనే దానిపై చర్చించారు. వీటిని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో భారీగా నిధులు కేటాయిస్తూ ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.