TDP Black List: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. అధికార తెలుగుదేశం పార్టీ  లో అంతర్గత క్రమశిక్షణపై ఆ పార్టీ హైకమాండ్ అత్యంత కఠినమైన వైఖరిని అవలంబిస్తోంది. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఉత్సాహంలో కొందరు ఎమ్మెల్యేలు రూట్ మారుస్తూ, పార్టీ గీసిన లక్ష్మణ రేఖను దాటుతుండటంపై అధినేత నారా చంద్రబాబు నాయుడు సీరియస్ యాక్షన్‌కు దిగినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు, సొంత క్యాడర్‌తో విభేదాలు, పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్న కొందరు శాసనసభ్యులను హెచ్చరించడం మానేసి.. నేరుగా దూరం పెట్టే వ్యూహాన్ని టీడీపీ అమలు చేస్తోంది.    కొలికపూడి ఓపెన్ రెబెలిజం.. తిరువూరులో మారిన సమీకరణాలు! 

Continues below advertisement

తిరువూరు  ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మొదటి నుండి తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే, ఇటీవల కాలంలో ఆయన పార్టీ హైకమాండ్ నిర్ణయాలను బహిరంగంగానే ధిక్కరిస్తూ, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. పార్టీ అధిష్ఠానం పలుమార్లు అంతర్గతంగా హెచ్చరించినప్పటికీ ఆయన తన వైఖరిని మార్చుకోలేదు. దీంతో టీడీపీ అగ్రనాయకత్వం ఆయనను పూర్తిగా పక్కనబెట్టేసింది.  ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణను ఇప్పటికే ఇతర నేతలు చూస్తున్నారు.  ఆయనను కేవలం  పేరుకే ఎమ్మెల్యే  అన్నట్లుగా మార్చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి వారికైనా ఇదే గతి పడుతుందనేందుకు కొలికపూడి ఎపిసోడ్ ఒక ఉదాహరణగా నిలిచింది.

 సత్యవేడులో వివాదాల సుడిగుండం.. క్యాడర్‌కు దూరమైన ఎమ్మెల్యే! 

Continues below advertisement

మరోవైపు సత్యవేడు ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం ప్రవర్తన కూడా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. మహిళతో వివాదాస్పదంగా ప్రవర్తించి వార్తాల్లోకి ఎక్కిన ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆ వివాదం సెటిల్ చేసుకున్నా ఆయనను పార్టీలో కలుపుకోలేదు. అందుకే ఆయన కుమారుడు ఇటీవల ప్రెస్మీట్ పెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.అయినా టీడీపీ హైకమాండ్ పట్టించుకోవడం లేదు.  సత్యవేడులో  క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న పాత కార్యకర్తలు సైతం ఆయనను ఓన్ చేసుకోవడం లేదు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా, సోషల్ మీడియా ఫీడ్‌బ్యాక్ ద్వారా గ్రహించిన చంద్రబాబు.. సత్యవేడులో ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే పనులు జరిగేలా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. తద్వారా క్యాడర్‌ను కాపాడుకుంటూనే, ఎమ్మెల్యేకు గట్టి షాక్ ఇచ్చారు. 

 ఆ ‘పది మంది’పై హైకమాండ్ నజర్.. బ్లాక్‌లిస్ట్‌ రెడీ! 

 కేవలం ఈ ఇద్దరే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది మందికి పైగా ఎమ్మెల్యేల జాబితాను   పార్టీ ఇంటెలిజెన్స్ వింగ్ సిద్ధం చేసింది. అధికారం అండతో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడం, ఇసుక, భూ దందాల్లో తలదూర్చడం, కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగించకుండా వివాదాలు కొనితెచ్చుకోవడం వంటి నెగెటివ్ రిపోర్ట్స్ ఉన్న నేతలందరినీ ఈ లిస్టులో చేర్చారు. వీరిలో కొందరు ఉత్తరాంధ్ర, మరికొందరు రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు.   పరిపాలన ముఖ్యం.. రాజకీయం కాదు 

గతంలో  2014-19 మధ్య కాలంలో కొందరు ఎమ్మెల్యేల మితిమీరిన ప్రవర్తన వల్లే పార్టీ 23 సీట్లకు పడిపోయిందనే చేదు నిజాన్ని చంద్రబాబు నాయుడు ఎప్పటికీ మర్చిపోలేదు. అందుకే, ఈసారి 135 కి పైగా సీట్ల భారీ మెజారిటీ ఉండటంతో.. ఒకరిద్దరు లేదా పది మంది ఎమ్మెల్యేలు దూరమైనా ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదనే ధీమాతో హైకమాండ్ ఉంది.  వ్యవస్థ ముఖ్యం, ప్రజల్లో పార్టీ ఇమేజ్ ముఖ్యం.. అంతేకానీ దారి తప్పిన ఎమ్మెల్యేల కోసం పార్టీ ప్రతిష్టను పణంగా పెట్టలేం  అని లోకేష్, చంద్రబాబు ఇద్దరూ అంతర్గత సమావేశాల్లో తెగేసి చెప్పారు. మారమని హెచ్చరించడం కంటే, వారిని పక్కనబెట్టి ప్రత్యామ్నాయ నేతలను తయారు చేయడం  ద్వారా సదరు ఎమ్మెల్యేల పొగరు దించే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో టికెట్లకు ఇప్పుడే కోత సంకేతాలు! 

టీడీపీ హైకమాండ్ తీసుకుంటున్న ఈ నిశ్శబ్ద అడుగులు.. సదరు వివాదాస్పద ఎమ్మెల్యేలకు భవిష్యత్తుపై పెద్ద హెచ్చరికగా మారాయి. ప్రస్తుతం వీరిని దూరం పెట్టడం అంటే.. వచ్చే ఎన్నికల్లో వీరికి టికెట్లు దక్కే ప్రసక్తే లేదనే సంకేతాన్ని క్యాడర్‌కు బలంగా పంపడమే. సోషల్ మీడియాలో కూడా ఈ ఐసోలేషన్ స్ట్రాటజీపై సామాన్య కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు తప్పు చేస్తే వెనకేసుకొచ్చే పాత రోజులు పోయాయని, పద్ధతి మార్చుకోకపోతే ఎంతటి సీనియర్ అయినా  మాజీ  అవ్వక తప్పదని టీడీపీ పంపుతున్న ఈ స్ట్రాంగ్ మెసేజ్.. మిగిలిన ఎమ్మెల్యేలను కూడా దారిలోకి తెస్తుందని భావిస్తున్నారు.