Kolikapudi has become a problem for TDP but they are unable to take action: తెలుగుదేశం పార్టీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం ప్రస్తుతం ఒక పెను తుఫానును సృష్టిస్తోంది. అమరావతి పరిరక్షణ ఉద్యమం నుండి పుట్టిన నాయకుడిగా, చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన, ఇప్పుడు అదే పార్టీకి అతిపెద్ద సమస్యగా పరిణమించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తో విభేదాలను సాకుగా చూపుతూ, ఆయన సాగిస్తున్న విమర్శలు నేరుగా పార్టీ ప్రతిష్ఠనే దెబ్బతీస్తున్నాయని ఆ పార్టీ అగ్రనేతలు మండి పడుతున్నా ఏమీ చేయలేకపోతున్నారు.
సొంత పార్టీపైనే దండయాత్ర
అమరావతి ఉద్యమ సమయంలో పోరాట పటిమను చూసి, స్థానిక నేతల వ్యతిరేకత ఉన్నప్పటికీ తిరువూరు నుంచి చంద్రబాబు ఆయనకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. అయితే, గెలిచిన నాటి నుండి కొలికపూడి తన బాణాలను ప్రత్యర్థులపై కాకుండా సొంత పార్టీ నేతలపైనే గురిపెడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో లేని భయం ఇప్పుడు ఉందంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీకి తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇది కేవలం ఎంపీతో ఉన్న పట్టింపుల వల్ల చేస్తున్న విమర్శలు కాదని, పార్టీని టార్గెట్ చేయడమే ఆయన ప్రధాన లక్ష్యమని కేడర్ భావిస్తోంది.
గతం తాలూకు నీడలు వెంటాడుతున్నాయా?
అమరావతి ఉద్యమానికి ముందు కొలికపూడి వైసీపీ సానుభూతిపరుడిగా ఉండేవారన్న గతాన్ని ఇప్పుడు టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న తీరును బట్టి, ఆయనను జగన్ కోవర్ట్ గా సోషల్ మీడియాలోనూ, అంతర్గత చర్చల్లోనూ సంబోధించడం మొదలైంది. జగన్ హయాంలో రక్షణ ఉందని, ఇప్పుడు బెదిరింపులు వస్తున్నాయని ఆయన అనడం వెనుక లోతైన రాజకీయ అర్థం ఉందని, ఇది ప్రత్యర్థులకు ఆయుధాలను అందించడమేనని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అధిష్ఠానం వ్యూహాత్మక మౌనం
ఇంత వివాదం జరుగుతున్నా నారా లోకేష్ ఆయనను విందుకు ఆహ్వానించడం, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నచ్చజెప్పే ప్రయత్నం చేయడం వెనుక బలమైన కారణాలు ఉండవచ్చునని చెబుతున్నారు. ఒక దళిత ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుంటే అది వర్గపరంగా తప్పుడు సంకేతాలు వెళ్తుందనే ఆందోళన ఒకటైతే, అమరావతి ఉద్యమకారుడిగా ఆయనకున్న గుర్తింపు వల్ల వెంటనే చర్యలు తీసుకోవడానికి అధిష్ఠానం వెనుకాడుతోందని చెబుతున్నారు. ఈ వెసులుబాటుతో ఆయన పార్టీ క్రమశిక్షణను గాడి తప్పిస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి
కఠిన నిర్ణయానికి సమయం ఆసన్నమైందా?
కొలికపూడి వైఖరి వల్ల పార్టీ క్యాడర్ నైతిక స్థైర్యం దెబ్బతింటోంది. ఒక ఎమ్మెల్యే బహిరంగంగా పార్టీ విధానాలను తప్పుబట్టడం క్రమశిక్షణారాహిత్యానికి పరాకాష్ట అని క్షేత్రస్థాయి కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. చర్యలు తీసుకుంటే ఆయనను బాధితుడిగా చూపి ప్రతిపక్షం రాజకీయం చేసే అవకాశం ఉన్నప్పటికీ, తీసుకోకపోతే అంతర్గత నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉంది. పార్టీ కన్నా ఎవరూ ఎక్కువ కాదని నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడు చంద్రబాబు నాయుడిపైనే ఉంది. ఎప్పటికప్పుడు ఆయన అంతా సర్దుబాటు అయిందన చెబుతున్నప్పటికీ ఒక్క రోజు కూడా ఈ సర్దుబాటు ఉండటం లేదు.