TDP Nara Lokesh Shankaravam: తెలుగు దేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి(TDP General Secretary), మాజీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) తిరిగి ప్ర‌జాబాట ప‌ట్ట‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఆయ‌న ఉత్త‌రాంధ్ర నుంచి `శంఖారావం`(Shankaravam) పేరుతో స‌భ‌ల‌కు ప్రిపేర్ అవుతున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభంకానుంది. ఉత్త‌రాంధ్ర‌లోని పార్వ‌తీపురం మ‌న్యం, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్న ఆయ‌న‌.. శంఖారావం పేరుతో స‌భ‌లు నిర్వ‌హించి.. ఎన్నిక‌ల‌కు ఇటు కేడ‌ర్‌ను.. అటు ప్ర‌జ‌ల‌ను కూడా స‌మాయ‌త్తం చేయ‌నున్నారు. 


కీల‌కం కావ‌డంతో.. 


ఏపీలో త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు(Assembly elections) రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. తెలుగు దేశం పార్టీ(Telugu Desam Party) ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు అస్త్ర‌శ‌స్త్రాల‌ను రెడీ చేసుకుంటోంది. ఒక‌వైపు బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తూనే.. మ‌రోవైపు, ప్ర‌చార‌ప‌ర్వంలోనూ పార్టీ కొత్త ఒర‌వ‌డి క్రియేట్ చేస్తోంది. గ‌త 2019 ఎన్నిక‌లకంటే.. కూడా ప్ర‌స్తుత ఎన్నిక‌లు కీల‌కంగా మార‌డం, ఎట్టి ప‌రిస్తితిలోనూ టీడీపీని గెలిపించుకోవాల‌న్న సంక‌ల్పంతో ఉండ‌డంతో ప్ర‌చారాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. 


పాద‌యాత్ర‌తో మొద‌లు.. 


ఈ నేప‌థ్యంలో పార్టీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. కొన్ని రోజుల విరామం త‌ర్వాత తిరిగి జ‌నంలోకి అడుగు పెట్ట‌నున్నారు. గ‌త ఏడాది జ‌న‌వ‌రి 27న ప్రారంభించిన యువ‌గ‌ళం(Yuvagalam) పాద‌యాత్ర ద్వారా.. ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉన్న ఆయ‌న‌.. అదే ఏడాది డిసెంబ‌రులో పాద‌యాత్ర ముగించారు. అయితే..ఎన్నిక‌ల‌కు స‌మ‌యం చేరువ అవుతుండ‌డంతో షెడ్యూల్‌ను అనుకున్న విధంగా ముందుకు సాగించ‌లేక పోయారు. దీనికితోడు, టీడీపీ అధినేత‌, మాజీ సీఎం, త‌న తండ్రి నారా చంద్ర‌బాబు నాయుడు వివిధ కేసుల్లో అరెస్ట‌యి జైల్లో ఉండ‌డంతో ఆయ‌న త‌న పాద‌యాత్ర‌ను స‌డెన్‌గా నిలిపివేశారు. 


అనివార్య కార‌ణాల‌తో..


దీంతో కొంత గ్యాప్ వ‌చ్చింది. మ‌రోవైపు అభ్య‌ర్థుల ఎంపిక‌, ఎన్నికల ప్ర‌క్రియ వంటివి త‌రుముకొచ్చాయి. దీంతో యువ‌గ‌ళం పాద‌యాత్ర నిడివిని త‌గ్గించుకున్నారు.  మొత్తంగా  226 రోజుల పాటు 3132 కిలో మీట‌ర్ల మేర సాగిన  పాదయాత్ర సాగింది. విశాఖ‌ప‌ట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలోని అగనంపూడి(Aganam pudi) వద్ద  ముగిసింది. వాస్త‌వానికి 100 నియోజ‌క‌వ‌ర్గాలను స్పృశిస్తూ... 4000 వేల కిలోమీట‌ర్ల మేర‌కు పాద‌యాత్ర చేయాల‌ని అనుకున్నారు. కానీ, అనూహ్య ప‌రిస్థితుల కార‌ణంగా దీనిని కుదించుకున్నారు. 


శంఖారావం ఇందుకే..


యువ‌గ‌ళం పాద‌యాత్ర క‌వ‌ర్ చేయ‌ని ప్రాంతాల్లో ఇప్పుడు శంఖారావం స‌భ‌లు నిర్వ‌హించాల‌ని నారా లోకేష్ నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల‌ను ఎంచుకున్నారు. ఈ స‌భ‌ల ద్వారా.. ప్ర‌జ‌ల‌కు ఆయ‌న చేరువకానున్నారు. 


ఇదీ.. షెడ్యూల్‌.. 


+ ఈ నెల 5న ఇచ్ఛాపురం నియోజకవర్గంలో శంఖారావం స‌భ‌ను ప్రారంభిస్తారు. 
+ 6వ తేదీ కి పాలకొండ చేరుకుని అక్కడ బస చేస్తారు. 
+ 7న పాలకొండ, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.
+ 8న సాలూరు, బొబ్బిలి, రాజాంలో జరిగే సభల్లో పాల్గొంటారు. 
+ 9న చీపురుపల్లి, ఎచ్చెర్ల, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 
+ 10న విజయనగరం, గజపతినగరం, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.