TDP News: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు‍(Prathipati Pullarao) కుమారుడి అక్రమ అరెస్ట్ కక్ష సాధింపు చర్యేనని టీడీపీ అధినేత చంద్రబాబు(CBN) మండిపడ్డారు. ఎన్నికల వేళ జగన్ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడడ్డారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం(TDP)పార్టీ నాయకులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌బాబు(Sarathbabu) అరెస్ట్‌ను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.


అక్రమ అరెస్టే
తెలుగుదేశం(Telugu Desam) సీనియర్ నేత, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌బాబు అరెస్‌పై చంద్రబాబు(CBN) స్పందించారు. ప్రభుత్వం మళ్లీ కక్షసాధింపు చర్యలు ప్రారంభించిందని ఆయన మండిపడ్డారు. అక్రమ అరెస్ట్‌ల ద్వారా తెలుగుదేశం అభ్యర్థలను బెదింరించాలని చూస్తోందన్నారు. ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్యేనన్న చంద్రబాబు... డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్(DRI) ద్వారా అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారన్నారు. డీఆర్‌ఐ(DRI) లక్ష్యమేంటని...మూడేళ్లుగా వాళ్లు పెట్టిన కేసులెన్నని, ఎవరెవరిపై కేసులు పెట్టారో ఆ వివరాలు ప్రభుత్వం విడుదల చేయగలదా అంటూ సవాల్ విసిరారు. సీఐడీ(CID)ని అధికారపార్టీ జేబు సంస్థగా ఉపయోగించునట్లు ఇప్పుడు డీఆర్‌ఐను ఉపయోగించుకుంటోందన్నారు. ఎన్నికల ముంగిట పార్టీ అభ్యర్థులను బలహీన పరిచేందుకే ఈ కుట్రలు చేస్తోందన్నారు. 40 రోజుల్లో ఇంటికి పోయే వైసీపీ(YSRCP) ప్రభుత్వానికి అనుబంధ విభాగ సభ్యులుగా అధికారులు పని చేస్తే తర్వాత మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.


శరత్‌బాబు అరెస్ట్, రిమాండ్
మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌బాబును విజయవాడ(Police) పోలీసులు అరెస్ట్ చేశారు. అవెక్సా(Avexa) సంస్థకు కొన్నిరోజుల పాటు శరత్‌బాబు అదనపు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ సంస్థ ఇన్‌పుట్ ట్యాక్స్  క్రెడిట్‌(Tax Input Credit)లో అక్రమాలకు పాల్పడిందని  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ తనిఖీలు చేసి 2022లోనే నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారణ చేపట్టాలని అప్పట్లోనే విజయవాడ మాచావరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతోపాటు ఆయన కుమారుడిపై కేసులు పెట్టింది. అవెక్సా కార్పొరేషన్ సంస్థ నిర్మాణ సంస్థల నుంచి పనులను సబ్ కాంట్రాక్టులు తీసుకుని చేస్తుంది. 2017లో అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులను సబ్ కాంట్రాక్టు తీసుకుని నిర్మాణం చేపట్టింది. ఏపీ డిట్కో ప్రాజెక్ట్‌ పనులు, మిడ్‌పెన్నా దక్షిణ కాలువ, హుద్‌హుద్ ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టింది. ఈ క్రమంలో ఇన్‌పుట్ ట్యాక్స్‌ క్రెడిట్ అక్రమంగా లబ్దిపొందినట్లు ఆరోపించారు.
మాటువేసి పట్టారు.


ప్రత్తిపాటి పుల్లారావు కోసం ప్రత్యేక మూడు పోలీసు బృందాలు నియమంచారు. ఢిల్లీలో ఉన్న శరత్‌బాబు కోసం ఓ బృందం ఢిల్లీ (Delhi)వెళ్లింది. ఆయను హైదరాబాద్‌ తిరిగి వస్తున్నారని తెలుసుకుని శరత్‌బాబునే అనుసరించింది. ఈ విషయం ముందుగానే హైదరాబాద్‌లో ఉన్న మరో పోలీసు బృందానికి చేరవేయడంతో హైదరాబాద్‌(Hyderabad)లో దిగగానే అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. వివిధ పోలీస్ స్టేషన్లు, కంట్రోల్ రూంలకు తిప్పుతూ శరత్‌బాబు నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. అనంతరం అర్థరాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టగా...శరత్‌బాబుకు 14 రోజులు రిమాండ్ విధించారు. 


అవెక్సాపై ఆరోపణలు ఇవీ
రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణాలకు సబ్‌ కాంట్రక్ట్ పొందిన అవెక్సా సంస్థ....రోడ్లు నిర్మించకుండానే వేసినట్లు నకిలీ బిల్లులతో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అసలు నిర్మాణాలే చేపట్టని రోడ్లకు మెటీరియల్ ఢిల్లీలో కొనుగోలు చేసినట్లు దొంగబిల్లులు పెట్టారని తద్వారా భారీగా లబ్ధిపొందినట్లు పోలీసులు తెలిపారు.