Politics On Tenth Results : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షా ఫలితాల కేంద్రంగా రాజకీయం రాజుకుంటోంది. వైఫల్యానికి కారణం మీరంటే మీరని అధికార ప్రతిపక్షాలు విమర్శించుకుంటున్నాయి. పదో తరగతి ఫలితాల్లో ప్రతి ముగ్గరిలో ఒకరు ఫెయిలయ్యారు. నిజానికి గత ఇరవై ఏళ్లుగా పరిస్థితి మెరుగుపడుతూ వస్తోంది. 90శాతం కన్నా ఎక్కువే ఫలితాలు వస్తున్నారు. ఈ సారి మాత్రం 67శాతానికే పరిమితం కావడంతో అటు విద్యార్థుల్లో అలజడి రేగింది. ఇటు విపక్షాలకూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి మరో అవకాశం లభించినట్లయింది. దీంతో విపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రభుత్వ వైఫల్యమేనంటున్న విపక్షాలు !
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అతి తక్కువ ఉత్తీర్ణతా శాతానికి ప్రభుత్వ నిర్వాకరమే కారణం అని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఫలితాలు వచ్చిన కొద్ది సేపటికే టీడీపీ నేత నారా లోకేష్ ఫెయిలయింది విద్యార్థులు కాదని.. ప్రభుత్వమేనని తేల్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసిన గంటా శ్రీనివాసరావు తన అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి విమర్శనాత్మక సలహా ఇచ్చారు. అందరం కలిసి మళ్లీ విద్యార్థుల భవిష్యత్‌ను బాగు చేద్దామని ప్రభుత్వానికి పిలుపునిచ్చారు.
పథకాల భారం తగ్గించుకునేందుకేనంటూ విమర్శలు !
మరికొంత మంది విపక్ష నేతలు.. పథకాల భారాన్ని తగ్గించుకునేందుకు ఇలా విద్యార్థులను పెద్ద సంఖ్యలో పెయిల్ చేశారనే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఫెయిలన వారికి అమ్మఒడి.. ఇవ్వరని.. అలాగే ఇంటర్‌లో చేరే వారి సంఖ్య కూడా తగ్గిపోతుందని.. అక్కడా నిధులు మిగుల్చుకుంటారని ఆరోపణలు చేస్తున్నారు.
టీడీపీ వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న విజయసాయిరెడ్డి !
తెలుగుదేశం నేతల విమర్శలకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నారాయణ విద్యా సంస్థలు పేపర్లు లీక్ చేయడం వల్ల విద్యార్థులు మానసిక ఆందోళనకు గురయ్యారని.. అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయని విమర్శించారు.
విజయసాయిరెడ్డికి మాజీ మంత్రి అయ్యన్న అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు.
టెన్త్ విద్యార్తులతో పోటాపోటీ రాజకీయాలు !
నిజానికి టెన్త్ ఫలితాలు ఇలా రావడానికి రాజకీయ నేతలు విమర్శించుకుంటున్నట్లు కుట్ర పూరితం కాదని విద్యారంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా చదువు సరిగ్గా సాగకపోడవం ... ప్రశ్నాపత్రం స్టైల్ మార్చడం సహా.. అనేక అంశాలు ఉన్నాయంటున్నారు. అయితే ఈ వైఫల్యాన్ని ఒకరిపై ఒకరు తోసుకోవడానిక రాజకీయ పార్టీలు ఏ మాత్రం ఆలోచించడం లేదు. టెన్త్ విద్యార్థులతోనూ తమ రాజకీయం తాము చేస్తున్నారు.