ఈసారి తగ్గేదే లే... అంటూ రెండు రోజుల క్రితం పవన్ చేసిన స్టేట్‌మెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అప్పటి వరకు టీడీపీతో పొత్తు ప్రయత్నాలు జరుగుతున్నాయని... బీజేపీ సంగతి ఏంటని చాలా మందికి అనుమానం వచ్చింది. పవన్ కల్యాణ్ ఈ స్టేట్‌మెంట్ ఇచ్చిన తర్వాత మాత్రం ఏపీ పొలిటికల్ సినిమా మరో మలుపు తిరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.
అసలు పవన్ కల్యాణ్ టార్గెట్ ఏంటి.. ఆయన ఎవర్ని టార్గెట్‌గా చేసుకున్నారు.. ఎవరిపై ఒత్తిడి పెంచాలని చూస్తున్నారో అనే అంశంపై చర్చ నడుస్తోంది. పొత్తులపై ఇచ్చిన మూడు ఆప్షన్‌లను పరిగణలోకి తీసుంటే ఇందులో టీడీపీతోపాటు బీజేపీని కూడా పవన్ టార్గెట్ చేసుకున్నారని స్పష్టమవుతోంది.
ఇప్పుడు జనసేన నుంచి వస్తున్న డిమాండ్ బీజేపీలో కలకలం రేపుతోంది. తమతో పొత్తు కొనసాగాలంటే ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్‌ను ప్రకటించాలని ఆ పార్టీ నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. కొందరు నాయకులు నేరుగానే స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆ పార్టీ శ్రేణులు ఇదే డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నాయి. ఒక వేళ బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పవన్‌ను ప్రకటిస్తే... తర్వాత టీడీపీ పొత్తు కోసం ప్రయత్నించినా... ఇదే డిమాండ్ వారి ముందు ఉంచాలని జనసేన భావిస్తున్నట్టు తెలుస్తోంది.
జనసేన చేస్తున్న డిమాండ్‌ను బీజేపీ మాత్రం అంత ఈజీగా అంగీకరించేలా కనిపించడం లేదు. ఒకరు ఒత్తిడి తీసుకొచ్చినంత మాత్రాన సీఎం అభ్యర్థిగా ప్రకటించలేమంటున్నారు బీజేపీ లీడర్లు. నడ్డా వచ్చింది పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించడానికే తప్ప పొత్తులు, సీఎం అభ్యర్థులను ప్రకటించడానికి కాదన్నారు ఆ పార్టీ ఎంపీ జీవీఎల్.
జీవీఎల్ కామెంట్స్‌పై జనసేన లీడర్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఎవరో వస్తారు గెలుస్తామన్న ఆశతో తాము పొత్తులకు ప్రయత్నించడం లేదంటున్నారు పసుపులేటి హరిప్రసాద్. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. తమతో ఎవరు కలిసి వచ్చినా రాకున్నా 2024లో విజయం సాధించేది జనసేన పార్టీ అంటున్నారు ఆ పార్టీ నేతలు.
పవన్ స్టేట్‌మెంట్‌పై టీడీపీ ఇంత వరకు ఎలాంటి అధికారిక స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. కానీ ఆ పార్టీ మద్దతు తెలిపే వారు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఇంత వరకు వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే ఎవరికి ఎవరు షరతులు పెట్టాలో తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.