Ali has remained an utter flop in politics : రాజకీయాలతో ఇక తనకు సంబంధం లేదని నటుడు అలీ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో ఓ సలహాదారునిగా ఆయన ఉన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక సలహాదారులందర్నీ తీసేసింది. దాంతో ఆయన పదవి పోయింది. వైసీపీ కూడా ఓడిపోవడంతో ఆయన ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని అధికారిక ప్రకటన చేశారు. వైసీపీ అనే పేరు పలకడానికి కూడా ఆయన ఇష్టపడలేదు.
ప్రజాప్రతినిధి కావాలన్న లక్ష్యంతో అలీ రాజకీయాలు
రాజకీయాల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యే అవ్వాలన్న లక్ష్యంతోనే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఏ పార్టీ నుంచి అవకాశం వస్తే ఆ పార్టీలో చేరి పోటీ చేయాలని అనుకున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యారు. మొదటి నుంచి టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆయన.. 2019 ఎన్నికలకు ముందు ఆ పార్టీ నుంచి టిక్కెట్ కోసం ప్రయత్నించారు. కానీ ఎక్కడా సానుకూలత రాకపోవడంతో పవన్ కల్యాణ్ ను కలిశారు. పవన్ కల్యాణ్ ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు.దీంతో గెలుపు అవకాశాలు ఉండన్న ఉద్దేశంతో వైసీపీలో చేరిపోయారు. పవన్ కల్యాణ్ ఆప్తమిత్రుడు అయినప్పటికీ రాజకీయం వేరని ఆయన వైసీపీలో చేరిపోయారు. అయితే వైసీపీలో ఆయనకు టిక్కెట్ దక్కలేదు. కానీ విస్తృతంగా ప్రచారం చేశారు.
పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేసి ఆయనకు దూరమైన అలీ
ఈ క్రమంలో పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఆయనతో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆప్తమిత్రుడైన పవన్.. అలీని పట్టించుకోవడం మానేశారు. అదే సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. ఎన్నికలకు ఏడాది ముందు.. టిక్కెట్ల కసరత్తు చేస్తున్నప్పుడు ఆయనకు సలహాదారు పదవి ఇచ్చారు. దానికే అలీ పొంగిపోయారు. అయితే అంతకు ముందు ఆయన పేరు రాజ్యసభ రేసులో కూడా వినిపించింది. అలాగే ఎన్నికల సమయంలో నంద్యాల పార్లమెంట్ కు అయినా సీటు ఇస్తారని అనుకున్నారు. కానీ ఎక్కడా ఆయనకు టిక్కెట్ కేటాయించలేదు. టిక్కెట్లు ఖరారు చేసే వరకూ ఆయన ఆశాభావంతోనే ఉన్నారు. అవకాశం కల్పించకపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు. ఎన్నికల్లో ప్రచారం కూడా చేయలేదు.
సినిమా కెరీర్ దెబ్బతినే ప్రమాదం ఉండటంతో వైసీపీకి రాజీనామా
నిజానికి తాను నమ్మిన మిత్రుడు పవన్ వెంట ఉంటే.. ఈ రోజు అలీ తన కలను నెరవేర్చుకుని ఉండేవారన్న అభిప్రాయం ఉంది. పవన్ తో ఉంటే ఖచ్చితంగా ఆయన కోసం ఓ సీటు రిజర్వ్ అయి ఉండేది. ప్రజాప్రతినిధి అయి ఉండేవారని అంటున్నారు. ఇప్పుడు వైసీపీకి భవిష్యత్ ఉందో లేదో తెలియదు. వైసీపీతోనే ఉంటే తన కెరీర్ కు కూడా మంచిది కాదు. అవకాశాలు రావన్న ఉద్దేశంతో ఆయన వైసీపీకి గుడ్ చెప్పారంటున్నారు. సినిమాల్లో ఎంతో కష్టపడి పైకి వచ్చిన ఆయన.. రాజకీయాలకు వచ్చేసరికి.. కాస్త తెలివిగా .. భవిష్యత్ వ్యూహంతో ఆలోచించలేకపోయారని అందుకే .. అట్టర్ ఫ్లాప్ అయ్యారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.