AP Congress Chief Sharmila on Polavaram Project | విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఫోకస్ చేశారు. గత ఐదేళ్లలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలవరం ప్రాజెక్టును సైతం ఆయన సందర్శించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసిందని, ప్రాజెక్టును పూర్తి చేయడానికి మరింత సమయం పడుతుందని, అయితే తమ హయాంలోనే నిర్మాణం పూర్తి చేసి నీళ్లు అందిస్తామన్నారు. అయితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి పోలవరం ప్రాజెక్టు జాప్యంపై ఘాటుగా స్పందించారు.  


మహాభారతంలో కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు... ఏపీలో పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి అసలు కారకులు టీడీపి, వైసీపీ, బీజేపీ పార్టీలే అని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మించి 28లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయం అన్నారు. కానీ ఆ తరువాత ప్రభుత్వాలు పంతాలు, పట్టింపులకు పోయి ఏపీ ప్రజల జీవనాడి పోలరవం ప్రాజెక్టుపై ఇన్నాళ్లు రాజకీయ దాడి జరిగిందన్నారు. 


ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పోలవరానికి  కాంగ్రెస్ జాతీయ హోదా హామీ ఇవ్వగా, తరువాత వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం 10 ఏళ్లు ప్రాజెక్టుపై సవతి తల్లి ప్రేమ చూపిందంటూ షర్మిల  మండిపడ్డారు. ఓ వైపు టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లు, తరువాత జగన్ ప్రభుత్వం మరో 5 ఏళ్లు ప్రాజెక్టును నిర్మించలేదని.. పైగా కేంద్రంపై పోరాటం సైతం చేయలేదని విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సైతం ఏపీ ప్రజల కోసం ఏనాడు ఆలోచించలేదని పేర్కొన్నారు. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టుకు తానే కడతానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రతి సోమవారం పోలవరం అంటూ హడావుడి చేశారు తప్ప, టీడీపీ హయాంలో ఆయన చేసింది శూన్యమని విమర్శించారు.